ఆన్‌లైన్‌ స్టడీస్‌

ABN , First Publish Date - 2020-03-28T06:50:33+05:30 IST

కరోనా కారణంగా సెలవులు ప్రకటించిన విద్యా సంస్థలు విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టంకాకుండా సాంకేతికతను...

ఆన్‌లైన్‌ స్టడీస్‌

  • సెలవుల్లో పాఠాల బోధన 
  • సాంకేతిక బాటలో విద్యాసంస్థలు 
  • విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు 
  • పలు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఈ-బాట
  • యాప్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా బోధన
  •  ఆన్‌లైన్‌ ద్వారా ఎంసెట్‌, నీట్‌, జేఈఈ మెయిన్స్‌ కోచింగ్‌లు 
  • వర్చ్యువల్‌ ల్యాబ్స్‌ ద్వారా ఇంజనీరింగ్‌ పాఠాలు

 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : కరోనా కారణంగా సెలవులు ప్రకటించిన విద్యా సంస్థలు విద్యార్థులకు విద్యాసంవత్సరం నష్టంకాకుండా సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. విద్యార్థులు సెలవులు సమయాల్లో చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో పలు ప్రైవేటు కాలేజీలు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాయి. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారు. కొందరికి పరీక్షలు పూర్తికాగా మరికొందరికి పరీక్షలు అర్ధంతరంగా రద్దయ్యాయి. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో లేదో తెలియదు. దీంతో విద్యార్థులు టెన్షన్‌తో ఉన్నారు. అయితే సెలవుల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొందరు విద్యార్ధులు, కొన్ని స్కూల్‌ యాజమాన్యాలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి.  కొన్ని ఐసీఎ్‌సఈ, సీబీఎ్‌సఈ పాఠశాలలు, యాప్‌ల సాయంతో విద్యార్థులకు చదువులు కొనసాగిస్తున్నాయి. యాప్‌ల ద్వారా నేరుగా విద్యార్ధులకు క్లాస్‌లు తీసుకోవడమే కాక విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాయి. అంతేకాక విద్యార్థులకు వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృతి చేసేందుకు ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే అధ్యాపకులు చెప్పే పాఠాలను రికార్డు చేసి తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. సుధీర్ఘ సెలవుల సమయంలో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఇలా చర్యలు చేపడుతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే కేంద్రీయ విద్యాసంస్థలు, ప్రైవేటు వర్సిటీలు, స్వయం ప్రతిపత్తి కళాశాలలు ఆన్‌లైన్‌ విద్యాబోధన చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇప్పట్లో స్కూల్‌, కాలేజీలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మిగతా యాజమాన్యాలు కూడా ఇదే బాటపడుతున్నాయి.  సబ్జెక్టుల వారీగా అధ్యాపకులు లైవ్‌లో బోధిస్తున్నారు. స్ట్టడీ మెటీరియల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. వీడియో కాల్‌ ద్వారా కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. 


జూమ్‌, వెబ్‌నార్‌, స్కైప్‌, యాప్‌లు ఇతరత్రా సాంకేతిక విధానాల్లో ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాయు. తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన విద్యాసంస్థలు జూమ్‌ యాప్‌ ద్వారా నేరుగా విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు చెబుతున్నాయి. ఇందుకోసం టీచర్లను, లెక్చరర్లను సమాయత్తం చేశాయి. ముందుగా విద్యార్థులకు యాప్‌లింక్‌ పంపి ప్రతి క్యాంప్‌సకి ఐడీ నంబర్‌ ఇచ్చి యాప్‌ ద్వారా కాంటాక్ట్‌ అయ్యేవిఽధంగా పాస్‌వర్డ్‌ అందిస్తున్నారు. దీంతో నేరుగా ఫోన్‌ లేదా. ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌ ద్వారా విద్యార్థులకు టీచర్‌తో కనెక్ట్‌అవుతున్నారు. ఆయా క్లాస్‌ల వారికి షెడ్యూల్‌ ఇచ్చి ఆ ప్రకారం క్లాస్‌లోని విద్యార్థులందరినీ ఒక సమయంలో ఆన్‌లైన్‌లోకి తీసుకుంటున్నారు. వారి సందేహాలను నివృతి చేస్తున్నారు. టీచర్లు, లెక్చరర్లు ఇంట్లో ఉండే బోధించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ మెయిన్స్‌ విద్యార్థుల కోసం కూడా పలు ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, కలిసి దీక్ష పేరుతో డిజిటల్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ను రూపొందించాయి. ఈ ఉచిత ఈ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ని అనేక మంది విద్యార్థులు వాడుకుంటున్నారు. ఈ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌ కూడా ఉన్నాయి. విద్యార్ధులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఇందులో చదువుకోవడానికి వీలుగా పాఠ్యాంశాలు పొందుపరిచారు. దీక్ష యాప్‌ను ఇంగ్లీ్‌ష్‌, హిందీలో ఉపయోగించవచ్చు. 

ఇందులో లొకేషన్‌ బట్టి కోర్సులు అందుబాటులో ఉంచారు. ఉదాహరణకు హైదరాబాద్‌ లొకేషన్‌ సెలెక్ట్‌ చేస్తే ఈ ప్రాంతలో విద్యావిధానాన్ని బట్టి పుస్తకాలు, కోర్సులు అందుబాటులోకి వస్తాయి. టీశాట్‌  నెట్‌వర్క్‌ ఛానల్‌ కూడా ప్రత్యేక పాఠ్యాంశాలను ఈనెల 24 నుంచి ప్రసారం చేస్తోంది. ఎంసెట్‌, నీట్‌ , జేఈఈ మెయిన్స్‌ విద్యార్ధుల కోసం టీ శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు, ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నాయి.  మొత్తం 43 రోజులపాటు ఇవి కొనసాగనున్నాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్‌1అండ్‌2 సబ్జెక్టులు బోధిస్తున్నారు.


ఉచితంగా వర్చ్యువల్‌ ల్యాబ్‌ : త్రివిక్రమ్‌రావు

కరోనా కారణంగా విద్యాసంవత్సరం నష్టపోతున్న విద్యార్థులను ఆదుకునేందుకు కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇంజనీరింగ్‌ విద్యార్థులందరికీ నెలరోజులపాటు వర్చ్యువల్‌ ల్యాబ్‌ ఉచితంగా అందచేయనున్నట్లు బెంగుళూరుకు చెందిన ఫ్లాటిఫై సొల్యూషన్‌ కంపెనీ సీఈఓ వి.త్రివిక్రమ్‌రావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. తమ క్లౌడ్‌ ద్వారా వర్చ్యువల్‌ ల్యాబ్‌ ను దేశవ్యాప్తంగా లక్షా 30వేల మందికి పైగా విద్యార్థులు వినియోగిస్తున్నారని చెప్పారు.


కరోనా సెలవుల తరువాత ఈ ల్యాబ్స్‌ను వాడుకునే వారి సంఖ్య  25వేలు పెరిగిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులు ముఖ్యంగా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు తాము ఉచితంగా నెలరోజులపాటు  వర్చ్యువల్‌ ల్యాబ్‌ అందచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ క్లౌడ్‌ను బిట్స్‌ పిలానీ, ఐఐటీబాంబే, ఐఎ్‌సబీ, ఎస్‌వీకెఎం, వెలంకర్‌ యూనివర్సిటీ , అమృతయూనివర్సిటీ, విద్యార్థులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే ల్యాబ్‌లో ఛాట్‌ పాట్‌ ఉంటుందని, దీని ద్వారా విద్యార్ధుల సందేహాలు నివృతి చేసుకోవచ్చన్నారు. 10లక్షల ప్రశ్నలకు సమాధానాలు సిద్థంగా ఉంటాయని కొన్ని జఠిలమైన సమస్యలకు ఆన్‌లైన్‌లో ప్రొఫెసర్లు సమాధానమిస్తారని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌, టూల్స్‌, ల్యాబ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అన్ని క్లౌడ్‌లో ఉంటాయన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం 157 సాఫ్ట్‌వేర్‌లు క్లౌడ్‌లో అందుబాటులో ఉన్నాయని వీటన్నింటినీ నెల రోజుల పాటు ఉచితంగా వాడుకునే సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారు తమ వివరాలను మెయిల్‌కు (జీుఽజౌఃఞజ్చ్టూజీజజీ.ఛిౌఝ) పంపాలని కోరారు.


Updated Date - 2020-03-28T06:50:33+05:30 IST