సరికొత్తగా!

ABN , First Publish Date - 2020-06-03T10:32:21+05:30 IST

విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య కీలకమైనంది. ఉన్నత చదువులకు తొలిమెట్టు. అందుకే అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ..

సరికొత్తగా!

సంస్కరణల దిశగా ఇంటర్‌ విద్య

సీబీఎస్‌ఈ తరహాలో ప్రశ్నాపత్రం

ఎక్కువ ప్రశ్నలు... తక్కువ మార్కులు

ఎంసెట్‌, జేఈఈ, నీట్‌లకు ప్రత్యేక శిక్షణ

ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపు

సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు

కరోనా దృష్ట్యా సెక్షన్‌కు 40 మందే పరిమితం

సెలవులు కుదింపు

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు


ఇంటర్‌ విద్యలో కీలక మార్పులు రానున్నాయి. ఉన్నత విద్యాప్రమాణాలకు పెద్దపీట వేస్తూ ఇంటర్‌ విద్యామండలి సంస్కరణలు చేపడుతోంది. జాతీయ విద్యా పరిశోధన సంస్థ సూచన మేరకు అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపులు, సమయపాలన, విద్యాబోధన, కళాశాల నిర్వహణ, ప్రశ్నపత్రాలు ఇలా అన్నింటిలో సమూల మార్పులు తీసుకురానున్నారు.


ఆన్‌లైన్‌ సేవలు అమలు చేయనున్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులకు... పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణనివ్వనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సెక్షన్‌కు 40 మందినే పరిమితం చేయనున్నారు. ప్రత్యేక వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పడు తల్లిదండ్రులకు తెలియజేయనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


(కాశీబుగ్గ): విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య కీలకమైనంది. ఉన్నత చదువులకు తొలిమెట్టు. అందుకే అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే కోర్సులనే ఎంపిక చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ఉన్నత విద్యాప్రమాణాలతో పాటు కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను తీర్చిదిద్దాలని సంకల్పించింది.  ఈ విద్యాసంవత్సరం నుంచే సంస్కరణలను అమలు చేయనుంది. జిల్లాలో 46 ప్రభుత్వ, 100 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. గత ఏడాది 62,752 మంది ఇంటర్‌ విద్యను అభ్యసించారు. ఇందులో ప్రథమ సంవత్సరం 31,023 మంది, ద్వితీయ సంవత్సరం 31,729 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 4 నుంచి పరీక్షలు ప్రారంభంకాగా..ఒక్క ఒకేషనల్‌ విద్యార్థులకు తప్పించి అన్ని పరీక్షలు పూర్తయ్యాయి.


ఇటీవల జవాబుపత్రాల మూల్యాంకనం సైతం పూర్తయ్యింది. దీంతో కొద్దిరోజుల్లో ఇంటర్‌ ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ విద్యామండలి ఈ విద్యాసంవత్సరం నుంచి కీలక మార్పులు చేయడానికి సిద్ధపడుతోంది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల విధానాన్ని మార్చనుంది. సీబీఎస్‌ఈ తరహాలో ప్రశ్నల సంఖ్యను పెంచి... మార్కులను తగ్గించనుంది. విద్యార్థులకు అన్ని అధ్యాయాలపై అవగాహన తప్పనిసరి చేసింది. తద్వారా ఎంసెట్‌, జేఈఈ, నీట్‌లకు సంబంధించి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా విద్యను అందించనుంది. పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కాలేజీలు, సంస్థలకు ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఇందుకు సంబంధించి ఫీజు నిర్ణయించే బాధ్యత పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షక కమిషన్‌ నిర్ణయిస్తుంది..


ఇవీ మార్పులు

ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు జరుగుతాయి. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. కాలేజీ పనివేళలు కూడా మార్చారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకూ తరగతులు జరుగుతాయి. తరువాత గంట పాటు స్పోర్ట్స్‌, ఇతర అంశాలపై విద్యార్థులకు శిక్షణనిస్తారు. గతంలో ఒక్కో సెక్షన్‌కు 82 మంది విద్యార్థులు ఉండేవారు. దానిని 40 మందికి కుదించారు. ఒక్కో కాలేజీలో 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ఈ లెక్కన ఒక్కో కాలేజీలో 360 మందికి మించి విద్యార్థులు ఉండకూడదు. 


ప్రస్తుతం ప్రైవేట్‌ కళాశాలలో 4 సెక్షన్‌లు ఉండగా... ఇపుడు అదనంగా 5 సెక్షన్‌లు పెంచనున్నారు.ఈ  సెక్షన్‌లకు సంబంధించి  కళాశాలలు పూర్తిస్థాయిలో సౌకర్యాలు, నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వనున్నారు. ఎప్పటికప్పడు తనిఖీలు చేపడతారు. అధ్యాపకుల బోధన, వారి నోట్స్‌, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ఈ నివేదిక వివరాలను వెబ్‌సైట్‌లో తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు సంబంధించి తక్కువగా విద్యార్థులున్న గ్రూపులను ఎత్తివేస్తారు. అక్కడ పనిచేసే అధ్యాపకులను ఎక్కువ మంది విద్యార్థులుండే కాలేజీకి బదలాయిస్తారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తామంటే కుదరదు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షక కమిషన్‌ నిర్ణయించే ఫీజులను వసూలు చేయాలి లేకుంటే కఠినచర్యలు తీసుకుంటారు. వార్షిక కేలండర్‌లో సెలవులను భారీగా కుదించారు. 


సమూల మార్పులు వాస్తవమే .. రుక్మంగధరావు, ఇంటర్‌ బోర్డు జిల్లా పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐవో), శ్రీకాకుళం

 ఇంటర్‌ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నారు. ఉత్తమ విద్యాబోధనతో పాటు విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణనివ్వనున్నారు. అడ్మిషన్ల నుంచి ఫీజుల చెల్లింపు, హాల్‌టిక్కెట్లు వంటి అన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం ఆలస్యమయ్యే అవకాశముంది. అయినా విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంటర్‌ విద్యామండలి అన్ని చర్యలు చేపడుతోంది. జూన్‌ 15లోపు ఫలితాలు వెల్లడికి, జూలైలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. 


Updated Date - 2020-06-03T10:32:21+05:30 IST