ఆందోళన కలిగిస్తున్నఆన్‌లైన్‌ మోసాలు

ABN , First Publish Date - 2022-04-28T05:21:35+05:30 IST

రోజురోజుకూ సాంకేతికత పెరుగుతుండగా సైబర్‌ నేరాలు సైతం అదేస్థాయిలో అధికమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం విరివిగా అందుబాటులోకి రావడంతో నిత్యం ఏదో ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదంటే ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతకడం చేస్తుండడంతో అలాంటి వారిని బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు.

ఆందోళన కలిగిస్తున్నఆన్‌లైన్‌ మోసాలు

- జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ నేరాలు

- ప్రతిరోజూ ఏదో ఒకచోట నమోదవుతున్న కేసులు

- రూ.లక్షల్లో నష్టపోతున్న అమాయక ప్రజలు

- పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఆగని మోసాలు

- ప్రజలే అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసుశాఖ


కామారెడ్డి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రోజురోజుకూ సాంకేతికత పెరుగుతుండగా సైబర్‌ నేరాలు సైతం అదేస్థాయిలో అధికమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల వినియోగం విరివిగా అందుబాటులోకి రావడంతో నిత్యం ఏదో ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదంటే ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో వెతకడం చేస్తుండడంతో అలాంటి వారిని బురిడీ కొట్టించేందుకు సైబర్‌ నేరగాళ్లు సిద్ధంగా ఉంటున్నారు. ప్రజల అమాయకత్వం, అత్యాశను అసరాగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు రోజుకో రకంగా దోచుకుంటున్నారు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి ఏటీఎం కార్డుల నెంబర్లు, ఇతర వివరాలు అడుగుతున్నారు. మీకు పర్సనల్‌ లోన్‌ అప్రూవ్‌ అయ్యింది. కొన్ని వివరాలు చెబితే డబ్బు మీ ఖాతాలో జమ అవుతాయని చెబుతున్నారు. లేదంటే లాటరీలో మీరు బహుమతులు గెల్చుకున్నారు. మీ అకౌంట్‌ నెంబర్‌, ఏటీఎం కార్డు నెంబర్లు చెబితే మీకు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేస్తామంటూ డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది చదువుకున్న వారితో పాటు అమాయకులు సైతం వీరి ఉచ్చులో చిక్కి బలవుతున్నారు. బ్యాంక్‌ వివరాలు, ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని బ్యాంకర్లు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ప్రజలలో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా చదువుకున్న యువతీ, యువకులు నేరగాళ్ల వలలో పడి డబ్బులు మోసపోయామంటూ పోలీసుస్టేషన్‌ల మెట్లు ఎక్కడం విచిత్రంగా ఉంటుంది. చదువురాని వారంటే మోసపోయారంటే ఓ అర్థం ఉంటుందని పీజీలు, డిగ్రీలు చేసి ఆన్‌లైన్‌ వ్యవహారాలపై అవగాహన ఉండి మోసపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్నో రకాల మోసాలు

సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌లు అమ్మేందుకు ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కువ ధర ఉండే సెల్‌ఫోన్లకు తక్కువ ధరకు ఇస్తామంటూమోసం చేస్తున్నారు. ఇది గ్రహించని అమాయకులు వారు పంపిన మెసేజ్‌లు, లింకులు ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో సైబర్‌ నేరగాళ్లు వారి ఫోన్‌ను హ్యాక్‌ చేస్తున్నారు. బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, ఆధార్‌కార్డు సెంటర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, ఇలా ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఫోన్‌ ద్వారా వస్తువులను ఆర్డర్‌ చేస్తూ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పంపుతామని చెబుతూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగం కావాలంటే కొన్ని టాస్క్‌లు పూర్తి చేయాలని చెప్పి టాస్క్‌ టాస్క్‌కు కొంత డబ్బును అకౌంట్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని డబ్బులు కాజేసి మోసాలకు పాల్పడుతున్నారు.

వందల్లో బాధితులు

సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కి మోసపోయిన బాధితులు జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఈ రెండు, మూడు నెలల్లోనే పదుల సంఖ్యలో మోసపోయారు. డబ్బులు పోగొట్టుకున్న వారిలో చాలా మంది పోలీసులను ఆశ్రయించడం లేదు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయామని తెలిస్తే పరువుపోతుందని ఎవరికీ చెప్పుకోవడం లేదు. మరికొందరు మాత్రం పోలీసుస్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నా సమయం మించి పోవడంతో డబ్బులు తిరిగి రాక ఇబ్బందులకు గురవుతున్నారు. గత వారం రోజుల పరిధిలో వివిధ మండలాల్లో సైబర్‌ మోసాలకు బలైన వారి వివరాలు ఇలా ఉన్నాయి. భిక్కనూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి లోన్‌బే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అడిగిన ప్రకారం ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు నమోదు చేశాడు. వెంటనే అతని ఖాతాలో రూ.1,230 జమ అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేసి ఇంకా రూ.820 మీ ఖాతాలో జమ కావాల్సి ఉందని మాయమాటలు చెప్పి ఎనీడెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాడు. దీంతో ఖాతాలో ఉన్న రూ.15,500 దోచుకున్నారు. బుధవారం సైతం ఓ యువకుడు జాబ్‌ కోసం గూగుల్‌ యాప్‌లో వెతుకగా గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ చేసి అమేజాన్‌లో జాబ్‌ ఆఫర్‌ ఉందని అందుకు మూడు టాస్క్‌లు పూర్తి చేయాలని చెప్పి రూ.99,232లను కాజేశారు. పెద్దకొడప్‌గల్‌ మండలంలో ఓ తండాకు చెందిన యువకునికి అపరిచిత వ్యక్తి ఫోన్‌చేసి మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయిందని నమ్మించి వివరాలు తెలుపమనడంతో వివరాలు చెప్పిన వెంటనే ఖాతాలోని రూ.15వేలు మాయం చేశారు. లింగంపేట మండలంలోని శెట్టిపల్లి సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రుణం కోసం వెతికి ఎఫ్‌ఎల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ఖాతా తెరవడానికి రూ.2వేలు జమ చేయాలని వాట్సాప్‌కు సమాచారం రావడంతో పంపాడు. ఆ తర్వాత ఈనెల 22న ఖాతా ఫ్రీజ్‌ అయిందని మరో రూ.6వేలు జమ చేయాలని చెప్పడంతో ఇవి కూడా జమ చేశాడు. మరో 8వేలు పంపితే సొమ్ము జమ అవుతుందని నమ్మించగా పంపి ఎంతకూ రుణం డబ్బులు రాకపోవడంతో 1930కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశాడు. గాంధారి మండలంలో ఓ తండాకు చెందిన వ్యక్తి ఫేస్‌బుక్‌లో ట్రాక్టర్‌, ట్రాలీ రూ.20 వేలకే ఇప్పిస్తామనే ప్రకటనకు ఆకర్షితుడై ఇచ్చిన లింక్‌లోని ఫోన్‌ నెంబర్‌కు కాల్‌చేసి రూ.28వేల వరకు పంపాడు. సదరు వ్యక్తి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాన్సువాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తన వద్ద దుబాయి నోట్లు ఉన్నాయని రూ.2.5లక్షలను దోచుకొని వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. ఇలా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సైబర్‌ నేరాలు చోటు చేసుకుంటుండడం నిత్యం సోషల్‌మీడియాలో, వార్తపత్రికలలో ఈ విషయాలు ప్రజలు చూస్తున్నా తమ వరకు వచ్చి మోసపోయే వరకు మేలు కోవడం లేదని తెలుస్తోంది.

ఇలాంటి పొరపాట్లు చేయొద్దు

కొత్త నెంబర్ల నుంచి వచ్చే వెబ్‌సైట్‌ లింకులపై క్లిక్‌ చేయకూడదు. ఎవరైన క్యాష్‌ ఇవ్వండి ఫోన్‌పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్‌ ద్వారా పంపితే అమౌంట్‌ వచ్చినట్టు చూపిస్తోంది. కానీ మన ఖాతాలో జమ కాదు. ఇటీవల హిట్‌ సినిమాల పేరుతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్‌ చేయడం ప్రమాదకరం. మన ఫోన్‌ గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడం మంచిది కాదు. క్యూఆర్‌ కోడ్‌ వంటి వివరాలను వారి ఫోన్‌ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశముంది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, పేమెంట్‌ యాప్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు గోప్యంగా ఉంచుకోవాలి. ఫోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌లు నమోదు చేయకూడదు.

Updated Date - 2022-04-28T05:21:35+05:30 IST