పూజలన్నిటిదీ అదే దారి

ABN , First Publish Date - 2020-05-22T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల దాదాపు ప్రపంచమంతటికీ లాక్‌డౌన్‌ అనుభవంలోకి వచ్చింది. అన్ని మతాల ప్రార్థనాలయాలూ మూతపడ్డాయి. అవి తెరుచుకోవడానికి మరికొద్ది రోజులు పట్టవచ్చు. ఈ నేపథ్యంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని పలు ఆలయాలు ఆన్‌లైన్‌ ద్వారా పూజలను...

పూజలన్నిటిదీ అదే దారి

కరోనా మహమ్మారి వల్ల దాదాపు ప్రపంచమంతటికీ లాక్‌డౌన్‌ అనుభవంలోకి వచ్చింది. అన్ని మతాల ప్రార్థనాలయాలూ మూతపడ్డాయి. అవి తెరుచుకోవడానికి మరికొద్ది రోజులు పట్టవచ్చు. ఈ నేపథ్యంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని పలు ఆలయాలు ఆన్‌లైన్‌ ద్వారా పూజలను ఆఫర్‌ చేస్తున్నాయి.  నిత్య ఆరాధన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాలుగా అందిస్తున్నాయి. యూట్యూబ్‌లో ఉన్న ప్రవచనాలూ, ప్రార్థనలకు ఎన్నో రెట్లు వ్యూయర్‌ షిప్‌ పెరిగింది. ఇది ఒక మతానికో, ప్రాంతానికో పరిమితం కాదు. 


  1. క్యాథలిక్‌ క్రైస్తవుల పవిత్ర క్షేత్రమైన వాటికన్‌ సిటీ అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చర్చిలు సామాజిక మాధ్యమాల్లో కార్యక్రమాలను అందిస్తున్నాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రసంగాలనూ, ఆయన నిర్వహించే ఆరాధనా కార్యక్రమాలనూ టీవీల్లో, ఆన్‌లైన్‌లో తిలకించే వారి సంఖ్య భారీగా పెరిగింది.
  2. ముస్లిమ్‌లకు మూడో అతి పెద్ద పవిత్ర ప్రదేశమైన జెరూసలేమ్‌లోని ‘అల్‌-అక్సా’ మసీదులో కూడా పవిత్ర రంజాన్‌ మాస ప్రార్థనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 
  3. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం ఇర్వింగ్‌కు చెందిన ఇస్లామ్‌ నాయకుడు ఒర్‌ సులేమాన్‌ యూట్యూబ్‌లో పెట్టే వీడియోలకు గత ఏడాది మొత్తం మీద మూడు కోట్ల వ్యూలు రాగా, గత ఆరు వారాల్లోనే రెండు కోట్లు వచ్చాయట!
  4. జెరూసలేమ్‌లోని వెస్ట్రన్‌ వాల్‌ యూదులకు పవిత్ర ప్రార్థనా స్థలం. ఇప్పుడు ఆరాధకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారి తరఫున ఆన్‌లైన్‌లో ప్రార్థనలు చేస్తున్నారు.
  5. జపాన్‌లోని నరా నగరంలో ఉన్న తోడల్జీ ఆలయం శక్తిమంతమైన ఏడు బౌద్ధ ఆలయాల్లో ఒకటిగా ఖ్యాతి పొందింది. కరోనా వైరస్‌ సమసిపోవడం కోసం ఆ ఆలయంలో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
  6. జపాన్‌లోని టోక్యోలో ఉన్న ఆనోటెరుసకీ ఆలయం ‘ఆన్‌లైన్‌ గుడి’ని ప్రవేశపెట్టింది. భక్తులు తమ ప్రార్థనలను ఆన్‌లైన్‌ ద్వారా పంపితే, వాటిని ఒక చెక్క టాబ్లెట్‌ మీద ముద్రించి, షింటో దేవతలకు సమర్పిస్తారు. 





కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రాబోయే రోజుల్లో  పాక్షికంగా ప్రార్థనా మందిరాలు తెరిచినా, పూర్వంలా భక్తులను అనుమతించే పరిస్థితులు లేవు. భక్తులు కూడా రావడానికి జంకవచ్చు. కాబట్టి కొంతకాలం పాటు ఆన్‌లైన్‌, దృశ్య, శ్రవణ మార్గాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆదరణ తగ్గదనడంలో సందేహం లేదు.

Updated Date - 2020-05-22T05:30:00+05:30 IST