లాక్‌డౌన్‌లో ఆన్‌లైనే మేలు!

ABN , First Publish Date - 2020-03-27T09:40:25+05:30 IST

లాక్‌డౌన్‌ మొదలై ఐదురోజులు గడిచిపోయింది! ఇంకా నిత్యావసర వస్తువుల కోసం జనం షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు

లాక్‌డౌన్‌లో  ఆన్‌లైనే మేలు!

ఆన్‌లైనే మేలు!

లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరేదప్పుడే

పలుచోట్ల డెలివరీ బాయ్స్‌ అడ్డగింత

కొన్ని చర్యలు చేపట్టిన ప్రభుత్వం

నగరంలో 63 మొబైల్‌ రైతు బజార్లు

నిత్యావసరాలు ఆగొద్దు

సీఎ్‌సలకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ఆదేశాలు

రవాణా వాహనాలపై వివరాలు: డీజీపీ

పాల వాహనాలను అడ్డుకోవద్దు: తలసాని


హైదరాబాద్‌, మార్చి 26(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ మొదలై ఐదురోజులు గడిచిపోయింది! ఇంకా నిత్యావసర వస్తువుల కోసం జనం షాపుల ముందు బారులు తీరుతున్నారు.  ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో కొవిడ్‌ 19ను నియంత్రించేందుకు ప్రజలను ఇళ్లకే పరిమితం చేయలన్న లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక దూరం నిబంధన కూడా అమలు కావడంలేదు. సామాజిక దూరం పాటించాలన్నా.. లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరాలన్నా.. ఆన్‌లైన్‌ సరఫరా, మొబైల్‌ మార్కెట్లకు ఆటంకం కలగకుండా చూస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా సరఫరా అందుబాటులో ఉన్నా డెలివరీ బాయ్స్‌ పలు చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నారు. దీంతో వారు  కొన్ని ప్రాంతాల్లో తమ సేవలను నిలిపివేస్తున్నారు. తక్షణమే ఆన్‌లైన్‌ షాపింగ్‌.. సరఫరాపై ప్రభుత్వం దృష్టిపెడితే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో మొబైల్‌ రైతు బజార్ల ఏర్పాటుకు మార్కెటింగ్‌ శాఖ  శ్రీకారం చుట్టింది. 63 వాహనాలు ఏర్పాటుచేసి  కూరగాయలు పంపినట్లు  మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 


డెలివరీ బాయ్స్‌ను అనుమతించండి

 లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. గురువారం ఆయన వివిధ రాష్ట్రాల సీఎ్‌సలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు.  మందులు, నిత్యావసరాలు ఇళ్ల వద్దకు సరఫరా చేయడానికి డెలివరీ బాయ్‌లను అనుమతించాలన్నారు. 


100కు ఫోన్‌ చేయండి: డీజీపీ

నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలపై ఆయా వస్తువుల వివరాలు తెలిసేలా డిస్‌ప్లేలు ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డి సూచించారు.ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే ‘డయల్‌-100’కు ఫోన్‌ చేయాలని సూచించారు.  ఈ-కామర్స్‌ సంస్థలు కూడా వాహనాలపై బ్రాండ్‌ వివరాలు కనిపించేలా చూడాలన్నారు. పాల సేకరణ కోసం గ్రామాలకు వచ్చే వాహనాలను గ్రామస్థులు అడ్డుకోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సూచించారు. లాక్‌డౌన్‌ కారణంగా రైతులు నష్టపోకుండా కూరగాయలను ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌ మార్కెట్లకు తరలిస్తామని మంత్రి హరీశ్‌రావు రైతులకు హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-03-27T09:40:25+05:30 IST