లాటరీ కొట్టేదెవరు?

ABN , First Publish Date - 2022-06-21T16:16:05+05:30 IST

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ఆన్‌లైన్‌ లాటరీ పద్ధతిలో కేటాయించ నున్నారు. అయితే, లాటరీ పారదర్శకంగా నిర్వహిస్తారా, పైరవీకారులకే ఫ్లాట్లను ఖరారు చేస్తారా అనే సందేహాలు

లాటరీ కొట్టేదెవరు?

‘రాజీవ్‌ స్వగృహ’ కేటాయింపు పారదర్శకంగా జరిగేనా?

ఫ్లాట్లు దక్కించుకునేందుకు పైరవీలు

అధికారులపై ఒత్తిడి

ఆన్‌లైన్‌ లాటరీపై అనుమానాలు

భారీ స్థాయిలో దరఖాస్తులు


హైదరాబాద్‌ సిటీ: రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను ఆన్‌లైన్‌ లాటరీ పద్ధతిలో కేటాయించ నున్నారు. అయితే, లాటరీ పారదర్శకంగా నిర్వహిస్తారా, పైరవీకారులకే ఫ్లాట్లను ఖరారు చేస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. లాటరీ తర్వాత దరఖాస్తుదారుల మొబైల్‌కు సమాచారం పంపిస్తామని, రాజీవ్‌ స్వగృహ వెబ్‌సైట్‌లో పొందుపరిచే జాబితానే ఫైనల్‌ అవుతుందని అధికారులు అంటున్నారు. బహిరంగ మార్కెట్‌తో పోల్చితే స్వగృహ ఫ్లాట్స్‌ ధర చవకగా ఉండడంతో చాలా మంది పోటీ పడ్డారు. ఈ ఫ్లాట్లను దక్కించుకునేందుకు పలువురు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తుదారుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.


బండ్లగూడ, పోచారంలోని అపార్ట్‌మెంట్లలోని 3,716 ఫ్లాట్లకు మొత్తం 39 వేల దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా నాగోల్‌ బండ్లగూడలోని అపార్ట్‌మెంట్లలో 2,246 ఫ్లాట్ల కోసం 33 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పోచారంలోని 1470 ఫ్లాట్లకు 5,920, బండ్లగూడలోని త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్లకు 16,670 దరఖాస్తులు రావడం విశేషం. డీలక్స్‌ ఫ్లాట్లు కేవలం 345 మాత్రమే ఉండగా, ఒక్కో ఫ్లాట్‌కు 48 మందికి పైగా పోటీ పడ్డారు. 


అధికారులపై ఒత్తిడి?

బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు నాగోల్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్నాయి. సెకండ్‌ భవనాల్లోనూ చ.అడుగు ధర రూ.3500కు పైగానే ఉండగా, పదేళ్ల నాటి స్వగృహ ఫ్లాట్స్‌ చ.అడుగు ధర రూ.2750గా నిర్ణయించడంతో నగరవాసులు ఆసక్తి చూపారు. రాజకీయ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, పలుకుబడి ఉన్న వారు సైతం దరఖాస్తు చేశారు. ఇందులో కొందరు ఆన్‌లైన్‌లో లాటరీ కావడంతో ఫ్లాట్‌ దక్కించుకోవడానికి పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. మంత్రుల పేషీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి కూడా అధికారులకు సిఫారసులు అందినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు కూడా కింది స్థాయి సిబ్బంది కోసం, బంధువుల కోసం ఫ్లాట్‌లను ఇప్పించాలంటూ ఫోన్లు చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు ఉండడంతో అధికారులు తిరస్కరించలేని పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోంది. 


లాటరీ వాయిదా 27 నుంచి ఒకటో తేదీ వరకు

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 27 నుంచి జూలై ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లాట్ల కొనుగోలుకు అనూహ్యమైన స్పందన రావడంతో పారదర్శకత, నిష్పాక్షపాతంతో నిర్వహించడానికి మూడు రోజుల పాటు ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. తొలుత 1 బీహెచ్‌కే సీనియర్‌ సిటిజన్‌, తర్వాత 3 బీహెచ్‌కే డీలక్స్‌, 3 బీహెచ్‌కే, 2బీహెచ్‌కే, 1బీహెచ్‌కే స్టూడియోలను కేటగిరి ప్రకారం ముందుగా బండ్లగూడ తర్వాత పోచారం ఫ్లాట్లకు లాటరీ తీయనున్నారు. ప్రతీ దరఖాస్తుకు టోకెన్‌ నెంబర్‌ కేటాయించగా, అదే వెబ్‌సైట్‌లలో ప్రదర్శిస్తారు.


దరఖాస్తుదారుల్లో అనుమానాలు

కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కోడింగ్‌ ప్రక్రియతో లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ తర్వాత కొత్త పేర్లను చేర్చడానికి, ఉన్న వాటిని తొలగించడానికి అవకాశాలు ఉన్నాయని దరఖాస్తుదారు లు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ లాటరీ ఎలా జరుగుతుందో బయటకు తెలిసే అవకాశం లేదు. దీంతో దరఖాస్తుదారు ల్లో అనుమానాలను మరింత పెరుగు తున్నాయి. కోడింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినా, ఫైనల్‌ జాబితా తర్వాత మార్పులు, చేర్పులు చేస్తారేమోనని, అవసరమైన వారి పేర్లను చేర్చిన తర్వాతే ఇతరులకు ఫ్లాట్లను ఖరారు చేస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా లాటరీ నిర్వహణ ప్రత్యక్ష పద్ధతిలో ఉండాలి. వైన్స్‌ షాప్‌ల కేటాయింపు అలానే జరుగుతోంది. కానీ, స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు అందుకు విరుద్ధంగా జరగనుండడంతో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2022-06-21T16:16:05+05:30 IST