ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌కు మరొకరు బలి..!

ABN , First Publish Date - 2022-08-20T06:18:51+05:30 IST

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ మరో కుటుంబాన్ని రోడ్డున పడేసింది.

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌కు మరొకరు బలి..!

వేధింపులు తాళలేక ఆత్మహత్య  


మంగళ్‌హాట్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ లోన్‌  యాప్‌ మరో కుటుంబాన్ని రోడ్డున పడేసింది. అవసరానికి అప్పు తీసుకున్న కుటుంబ పెద్ద, యాప్‌ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సుల్తాన్‌బజార్‌ పోలీసుల కథనం ప్రకారం.. రాంకోఠిలో ఉండే సి.చైతన్య యాదవ్‌(40)కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో లోన్‌ యాప్‌ చిచ్చు రేపింది. గతంలో ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా చైతన్య లోన్‌ తీసుకున్నాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో యాప్‌ నిర్వాహకుల వేధింపులు మొదలయ్యాయి. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చైతన్య ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చైతన్య సెల్‌ఫోన్‌ను పరిశీలించిన కుటుంబ సభ్యులు లోన్‌ యాప్‌ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


లోన్‌ యాప్‌ల పేరుతో వేధింపులు.. పీడీ యాక్ట్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): లోన్‌ యాప్‌ నుంచి రుణం తీసుకొని చెల్లించినా వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీయాక్ట్‌ ప్రయోగించారు. వెస్ట్‌బెంగాల్‌ ఉత్తర్‌ దినాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన షోయబ్‌ అక్తర్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకుల వద్ద టెలీకాలర్‌. లోన్‌ తీసుకొని చెల్లించిన వారికి కూడా డబ్బులు కట్టాలంటూ వేధించేవాడు. ఇతడిపై మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరు కేసులు నమోదయ్యాయి. రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించారు. అతడిపై రాచకొండ సీపీ మహే్‌షభగవత్‌ పీడీయాక్ట్‌ నమోదు చేశారు.

Updated Date - 2022-08-20T06:18:51+05:30 IST