ఆన్‌లైన్‌ బుకింగ్‌ల పేరిట దర్జాగా మోసాలు

ABN , First Publish Date - 2021-06-11T13:51:32+05:30 IST

ఆన్‌లైన్‌ పోర్టళ్లలోనూ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ల పేరిట దర్జాగా

ఆన్‌లైన్‌ బుకింగ్‌ల పేరిట దర్జాగా మోసాలు

  • విమాన టిక్కెట్ల బుకింగ్‌లోనూ వెలుగు చూస్తున్న అక్రమాలు


హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ పోర్టళ్లలోనూ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ల పేరిట దర్జాగా మోసాలు చేస్తూ అందినకాడిని దోచుకుంటున్నారు. ఇదొక్క షాపింగ్‌లకే పరిమితం కాలేదు. విమాన టికెట్ల బుకింగ్‌లకూ పాకింది. మార్చి నెలలో ట్రావొలుక్‌ అనే వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఒకరు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, మరొకరు ఢిల్లీ నుంచి విజయవాడకు విమాన టిక్కెట్లు బుక్‌ చేశారు. క్షణాల్లోనే టిక్కెట్లు బుక్‌ అయ్యాయి. ఇద్దరికి కలిపి రూ. 9,800 చెల్లింపులు కూడా జరిగాయి. రెండు నిముషాల వ్యవధిలో ఓ కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ చేసి మీ టిక్కెట్లు క్యాన్సిల్‌ అయ్యాయని, వారం రోజుల్లో రిఫండ్‌ వస్తుందని చెప్పారు. మరో టిక్కెట్‌ బుక్‌ చేసుకుని వచ్చేసినప్పటికీ.. ఆ డబ్బులు రిఫండ్‌ కాలేదు. 


తొలుత కాల్‌సెంటర్‌ ప్రతినిధులు స్పందించినప్పటికీ.. ఆ తర్వాత వారి స్పందన కూడా ఆగిపోయిందని బాధి తులు వాపోయారు. తీరా ఆన్‌లైన్‌లో సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేయగా ట్రావొలుక్‌ పోర్టల్‌ ద్వారా చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని, దేశవ్యాప్తంగా సైబర్‌ క్రైమ్‌ పీఎ్‌సలలో కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. కన్జూమర్‌ ఫోరంలోనూ వందల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో పోర్టళ్ల ద్వారా మోసపోయే ప్రమాదమున్నందున కొనుగోలు చేసే విషయంలోనూ, ఆన్‌లైన్‌ బుకింగ్‌ల వ్యవహారంలోనూ అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


మోసగాళ్ల పోర్టళ్లు

దుస్తులు, కాస్మెటిక్స్‌, ఇమిటేషన్‌ జువెల్లరీ, చెప్పులు, షూజ్‌ ఇలా ఎన్నో రకాల షా పింగ్‌ పోర్టళ్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. గుర్తింపు లేని పోర్టళ్లు, గుర్తింపు లేని విక్రయ కేంద్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న కొత్త దందా ఇది.  లాక్‌డౌన్‌లో క్యాష్‌ ఆన్‌ డెలివరీ లేదని, క్యాష్‌ పే చేస్తేనే పార్సిల్‌ బుక్‌ అవుతుందని లేదా డిస్కౌంట్‌ ఆఫర్‌లు చూపి తెలిపిగా డబ్బులు కట్టించుకుంటున్నారు. ఎంతకూ ఆ వస్తువు రాకపోగా.. కస్టమర్‌ కేర్‌ నెంబర్లు కూడా సరిగా స్పందించకపోవడంతో సైబర్‌క్రైమ్‌ స్టేషన్లకు పరుగులు తీస్తున్నారు. ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-06-11T13:51:32+05:30 IST