ఆన్‌లైన్‌ అవస్థలు

ABN , First Publish Date - 2021-06-24T06:21:14+05:30 IST

ఆన్‌లైన్‌ అవస్థలు

ఆన్‌లైన్‌ అవస్థలు

2021-22 పదో తరగతి విద్యార్థులకు ఇంకా మొదలుకాని ఆన్‌లైన్‌ తరగతులు

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇప్పటికే ప్రారంభం 

పరీక్షలపై సందిగ్ధంలో ఈ ఏడాది పది విద్యార్థులు

అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : కరోనా ప్రభావం విద్యార్థుల భవిష్యత్తును బాగానే దెబ్బతీస్తోంది. ఈ నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకాని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 4,442 పాఠశాలలు ఉండగా, వాటిలో ఉన్నత పాఠశాలలు 1,096 ఉన్నాయి. 607 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు 489 ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివే విద్యార్థులు 55వేల మందికిపైగా ఉంటారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠ్యాంశాల బోధనను పక్కనపెడితే పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ ప్రహసనంగా మారింది. 

40 శాతానికి పైగా విద్యార్థులకు ఇబ్బంది

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలు ఇంకా నిర్వహించలేదు. ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేదు. కరోనా కారణంగా పరీక్షలు ఆలస్యం కావడంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఎప్పుడు పరీక్షలు నిర్వహించినా సంసిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. వాట్సాప్‌ గ్రూపుల్లో తగు సూచనలు ఇస్తున్నారు. ఈ  ప్రక్రియ కూడా తూతూమంత్రంగానే సాగుతుందనే వాదన ఉంది. ఇక పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల్లో తగు సూచనలు ఇస్తున్నా.. జిల్లాలో 40 శాతం మంది దానికి దూరంగా ఉంటున్నారు. కొంతమందికి సెల్‌ఫోన్లు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మరికొంతమందికి ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో పాఠ్యాంశాల బోధన, మోడల్‌ పరీక్షల నిర్వహణకు విద్యార్థులు దూరంగా ఉంటున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్య ఇలా..

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 6.13 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇలా ఉంది. 6వ తరగతిలో 19,980 మంది, 7లో 20,116 మంది, 8లో 21,667 మంది, 9లో 20,862 మంది, 10వ తరగతిలో 19,613 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 35 నుంచి 40 శాతం మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం, ఆన్‌లైన్‌లో తరగతులకు హాజరయ్యేందుకు వీలుగా సెల్‌ఫోన్లు అందుబాటులో లేకపోవడం, సిగ్నల్స్‌ రాకపోవడం, ఇతరత్రా సాంకేతిక కారణాలు చెబుతున్నారు. ఇక ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ఎంతవరకు అర్థమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 

ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభిస్తాం.. 

పదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గురుకుల, కస్తూరీభా గాంధీ పాఠశాలల్లో ప్రారంభమయ్యాయి. జెడ్పీ, ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎంతమంది పిల్లలకుసెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. సాంకేతిక సమస్యలు ఎక్కడున్నాయి.. తదితర అంశాలపై ఆయా పాఠశాలల హెచ్‌ంఎంలను వివరాలు కోరాం. - తెహారా సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి

Updated Date - 2021-06-24T06:21:14+05:30 IST