ఆన్‌లైన్‌ క్లాసులొద్దు

ABN , First Publish Date - 2020-07-05T08:51:34+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలలు నిర్వహిస్తోన్న ఆన్‌లైన్‌ క్లాసులపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించరాదన్న

ఆన్‌లైన్‌ క్లాసులొద్దు

  • విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దు 
  • నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
  • పాఠశాల గుర్తింపునూ రద్దు చేస్తాం
  • ప్రైవేట్‌ స్కూళ్లకు విద్యాశాఖ హెచ్చరిక


అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలలు నిర్వహిస్తోన్న ఆన్‌లైన్‌ క్లాసులపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించరాదన్న ప్రభుత్వ ఆదేశాల అమలుకు చర్యలు ప్రారంభించింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఎటువంటి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించరాదని ప్రైవేట్‌ పాఠశాలల మేనేజ్‌మెంట్లకు జిల్లాల విద్యాశాఖాధికారులు ఆదేశాలిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదని, ఉపాధ్యాయులను తొలగించరాదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభం కాలేదు. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు తెరుచుకుంటాయని సీఎం జగన్‌ ప్రకటించినా, ఇంత వరకు ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. కానీ, ప్రైవేట్‌ పాఠశాలలు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధనకు ఎప్పుడో శ్రీకారం చుట్టాయి.  విద్యార్థుల కోసం తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టా్‌పలు ఏర్పాటుచేసేలా చూసుకున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు ఫీజులు చెల్లించాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఫీజులు ఎలా చెల్లించగలమని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించరాదని తాజాగా హెచ్చరించారు. దీంతో డీఈవోలు ప్రవేటు స్కూళ్లకు ఆ మేరకు హెచ్చరికలు చేశారు.

Updated Date - 2020-07-05T08:51:34+05:30 IST