‘ఆన్‌లైన్‌’ అవస్థలు

ABN , First Publish Date - 2020-09-26T11:03:28+05:30 IST

కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ మూడు నెలల విలువైన విద్యాకాలాన్ని నష్టపోయిన విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని రాష్ట్ర

‘ఆన్‌లైన్‌’ అవస్థలు

అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉండని బోధకులు

మెజారిటీ గ్రామాల్లో అందని సెల్‌సిగ్నల్స్‌

పాఠ్యంశాలను డౌన్‌లోడ్‌ చేసి వినిపించేందుకు ఉపాధ్యాయుల కుస్తీ

అర్థం కాక వ్యవసాయ పనులకు వెళ్తున్న విద్యార్థులు 


(ఆంధ్రజ్యోతి, అసిఫాబాద్‌)

 కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ మూడు నెలల విలువైన విద్యాకాలాన్ని నష్టపోయిన విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్‌ విద్యా బోధనకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా ఆసిఫాబాద్‌ వంటి మారుమూల ఏజెన్సీ జిల్లాలో ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్థంకాక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన విద్యార్థుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించే అవకాశం లేక ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఏజెన్సీ గ్రామాల్లో సామాజిక. భాషా పరమైన వైవిధ్యం కారణంగా ఇక్కడి విద్యార్థులో గ్రాహ్య శక్తి అంతంత మాత్రమే. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు  ప్రత్యక్షంగా బోధించే పాఠ్యాంశాలను అవగాహన చేసుకునేందుకు ఇబ్బంది పడేవారు. కాగా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఆదరాబాదరగా ఏర్పాటు చేసిన బోధన ఏమాత్రం కొరుకుడు పడడం లేదని చెబుతున్నారు.


ప్రత్యక్షంగా తరగతి గదుల్లో జరిగే బోధనలో భాగంగా విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై ఏమైనా సందేహాలు వస్తే అర్థమయ్యేలా వివరించేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేవారు. అయితే ఆన్‌లైన్‌లో జరుగుతున్న బోధన  ఆసాంతం ఏకాగ్రతతో వింటేతప్ప అవగాహన చేసుకోలేక పోతున్నారు. అదీ కాకూండా టీ-శాట్‌, దూరదర్శన్‌ టెలివిజన్‌ చానళ్ల ప్రసారాలు స్పష్టంగా ఉండడంలేదని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే జిల్లాలోని జైనూరు, కెరమెరి, వాంకిడి, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, తిర్యాణి, పెంచికల్‌పేట్‌, చింతలమానెపల్లి వంటి మండలాల్లోని చాలా గ్రామాలకు మొబైల్‌ నెట్‌వర్కు అందుబాటులోలేద ని వాపోతున్నారు. 


ఈ ప్రాంతాలన్ని కొండలు, గుట్టలు, దట్టమైన అడవుల మధ్య ఉండడంతో  మొబైల్‌ సిగ్నల్సు సరిగ్గా అందక ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. దాంతో సంబందిత ఉపాధ్యాయులే ఆన్‌లైన్‌ పాఠాలను డౌన్‌లోడ్‌ చేసి విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్లకు వాట్సాప్‌ ద్వారా చేరవేస్తున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలలో విద్యార్థులు ఎరుర్కొంటున్న మరో ప్రదానమైన సమస్య పాఠం నోట్‌ చేసుకునే లోపే పేజీలు మారిపోతుండడంతో ఆ వేగాన్ని అందుకోలేక సతమతమవుతున్నారు. మరోవైపు పట్టణప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఇలాంటి సమస్యలు లేకపోయినా తల్లిదండ్రులు కొనుగోలు చేసి ఇచ్చిన స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా ఆన్‌లైన్‌ వీడియో గేములు, యూ ట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారని, దీంతో పాఠ్యాంశాలు వినడంపై ఏకాగ్రతను చూపడంలేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. 


సందేహాల నివృత్తి బాధ్యత..

 జిల్లాలోని 1,253 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధనపై అవగాహన కల్పించి పాఠ్యాంశాలపై వారికి ఉత్పన్నమయ్యే సందేహాలను నివృత్తి చేసే బాద్యతలను సంబంధిత ఉపాధ్యాయులకే జిల్లా విద్యాశాఖ అప్పగించింది. అసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 33,530 విద్యార్థులకు గాను 1,886 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠ్యాంశాలు చేరేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ మొత్తం విద్యార్థుల్లో 19 వేల మందికి ఆన్‌లైన్‌ సదుపాయాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చారు. కాగా పాఠ్యాంశాలు ప్రారంభమైన కొద్ది రోజులకే ఏజెన్సీ గ్రామాల్లో పనిచేస్తున్న చాలామంది ఉపాధ్యాయులు అందుబాటులో ఉండడంలేదు. దాంతో ఆన్‌ లైన్‌ పాఠాలు విన్నాక సందేహాలు నివృత్తి చేసుకునే పరిస్థితులు లేకుండాపోయాయని విద్యార్థులు అంటున్నారు. ఫలితంగా చాలామంది విద్యార్థుల ఆన్‌లైన్‌ బోధనకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది.


ఇదిలా ఉంటే మరోవైపు ఉపాధ్యాయులు అందుబాటులోలేని పిరిస్థితుల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠాలను పక్కనపెట్టి వ్యవసాయ కూలీలుగా పొలం పనులకు వెళుతున్నట్లు చెబుతున్నారు. పెంచికల్‌పేట్‌, చింతలమానెపల్లి వంటి మండలాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లో ఒకరిద్దరు విద్యార్థులే ఉన ్న పరిస్థితి కొనసాగుతున్నది. ఈ  నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తరువాత ఇళ్ల వద్దకు వెళ్లి పాఠ్యాంశాలపై సందేహాలు నివృత్తి చేసేందుకు ఉపాధ్యాయులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది ఉపాధ్యాయులు స్థానికంగా కాస్తో కూస్తో చదువుకున్న యువతీ యువకులకు తమ జీతం నుంచి కొంచెం వెచ్చించి వలంటీర్లుగా పని చేయిస్తున్నారని తెలుస్తోంది. 


ఇబ్బందులు పడుతున్నాం..దుర్గం సునీల్‌, విద్యార్థి పెంచికలపేట

ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నేను స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. మాది అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామం జిల్లెడ. బడులు ఇంకా తెరుస్తలేరు.. టీవీల్లో పాఠాలు బోధిస్తున్నారు. మా గ్రామంలో కరెంటు సరిగ్గా ఉండక పోవడంతో తరగతులు వినే అవకాశం లేకుండా పోయింది. మరి కొందరికి ఫోన్‌లకు సిగ్నల్‌ అందక ఆన్‌లైన్‌లో సరిగ్గా వినలేక పోతున్నారు. దీంతో తరగతులు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2020-09-26T11:03:28+05:30 IST