ఆన్‌లైన్‌ క్లాసులపై పర్యవేక్షణ కరువు

ABN , First Publish Date - 2021-07-26T04:55:24+05:30 IST

జిల్లాలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం..

ఆన్‌లైన్‌ క్లాసులపై పర్యవేక్షణ కరువు

 ఇంటర్‌ ఫస్టియర్‌లో 50 శాతం దాటని హాజరు

 సెకండియర్‌లో 60 నుంచి 62 శాతం మాత్రమే

 సాంకేతిక పాఠాలను పట్టించుకోని విద్యార్థులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ తరగతులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. కొంతమంది అధ్యాపకుల పట్టింపులేనితనంతో సాంకేతిక పాఠాలు నీరుగారుతున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాకపోవడంతో  విద్యార్థులు వాటికి దూరంగా ఉంటున్నారు. కరోనా  నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూలై 1 నుంచి మరోసారి ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించారు. 2020-21 విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని మేలో ఇంటర్‌ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినప్పటికీ, కరోనా కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.  పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పై తరగతికి ప్రమోట్‌ చేసింది. అయితే ఫిబ్రవరి 1న కళాశాలల్లో ప్రారంభమైన ప్రత్యక్ష తరగతులను రెండో దశ తీవ్రతతో మార్చి 23న నిలిపివేశారు. దీంతో ఇటు క్లాసులు, అటు పరీక్షలు లేక.. మూడున్నర నెలల విరామం తర్వాత జూలై 1 నుంచి మళ్లీ ప్రారంభమైన ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేందుకు చాలామంది విద్యార్థులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఫస్టియర్‌లో 50 శాతం దాటని హాజరు..

జిల్లాలోని 16 మండలాల పరిధిలో 22 ప్రభుత్వ కాలేజీలు నడుస్తున్నాయి. ఇందులో ఫస్టియర్‌లో 13,082 మం ది, సెకండియర్‌లో 7,400 మంది చదువుతున్నారు. నెలన్నర రోజులుగా టీ-శాట్‌ ద్వారా ఫస్టియర్‌, సెకండియర్‌ కు రోజు విడిచి రోజు తరగతులను ప్రసారం చేస్తున్నప్పటికీ, ఎక్కువ మంది విద్యార్థులు హాజరుకావడం లేదని సమాచారం. ఫస్టియర్‌ 13,082 మందిలో రోజూ 50 శా తం మాత్రమే సాంకేతిక పాఠాలను వింటున్నారని, సెకండియర్‌ 7400లో 60-62 శాతం మంది హాజరవుతున్నట్లు ఇంటర్‌ విద్యావర్గాలు చెబుతున్నాయి. కరోనా రెండో దశ తీవ్రతతో దాదాపు 27 శాతం మంది విద్యార్థులు నగరం నుంచి తమ సొంతూళ్లకు వెళ్లారు. అయితే అందులో కేవలం 12 శాతం మంది క్లాసులు వింటుండగా, మిగతా 15 శాతం మంది హాజరుకావడంలేదని సమాచారం. 


ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు..

రోజువారీగా ఎంతమంది విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నారు.. ఎందరు వినడంలేదనే విషయాన్ని తెలుసుకోవాల్సిన ఉన్నతాధికారులు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు మొక్కుబడిగా సాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 50 శాతం వంతున కళాశాలలకు హాజరవుతున్న కొంతమంది అధ్యాపకులు సైతం సాంకేతిక తరగతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. టీ-శాట్‌లో ఆన్‌లైన్‌ పాఠం పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు విద్యార్థులు ఫోన్ల ద్వారా వారిని సంప్రదిస్తున్నా.. సరిగా స్పందించడంలేదనే పేర్కొంటున్నారు.


చాలా మందికి పుస్తకాలు ఇవ్వలేదు 

ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్నప్పటికీ చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 35 శాతం మందికి ఇప్పటివరకు పుస్తకాలు అందకపోవమే ఇందుకు కారణం. ఆన్‌లైన్‌ క్లాసులను ఎంతమంది వింటున్నారో.. ఎంతమంది వినడం లేదో.. అనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. సాంకేతిక పాఠాలను అన్ని వర్గాల విద్యార్థులు వినే విధంగా చర్యలు తీసుకోవాలి.

- శ్యాం, పీడీఎస్‌యూ, గ్రేటర్‌ కార్యదర్శి 






Updated Date - 2021-07-26T04:55:24+05:30 IST