ఒత్తిడిలో బాల్యం.. దిద్దుబాటు అవశ్యం

ABN , First Publish Date - 2022-01-28T17:55:00+05:30 IST

ఒమైక్రాన్‌ విజృంభణతో విద్యాసంస్థలన్నీ మూత పడి మళ్లీ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలారంభానికి ఒమైక్రాన్‌ కేసులు గరిష్టస్థాయికి చేరతాయనే అంచనాల

ఒత్తిడిలో బాల్యం.. దిద్దుబాటు అవశ్యం

ఆన్‌లైన్‌ క్లాస్‌లతో ప్రవర్తనా పరమైన సమస్యలు

హైదరాబాద్‌సిటీ: ఒమైక్రాన్‌ విజృంభణతో విద్యాసంస్థలన్నీ మూత పడి మళ్లీ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెలారంభానికి ఒమైక్రాన్‌ కేసులు గరిష్టస్థాయికి చేరతాయనే అంచనాల నేపథ్యంలో బడులు తిరిగి ఎప్పుడు తెరుచుకుంటాయనే సందేహాలు చిన్నారులలో కొత్త ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇది వారిపై మానసికంగా అది ఒత్తిడిని తీసుకురావడమే కాదు, ప్రవర్తనా పరమైన మార్పులకూ కారణమవుతుందని, ఇప్పటికే చాలామంది చిన్న తరగతుల పిల్లల్లో ఈ మార్పులను చూస్తున్నామని  సైక్రియాటి్‌స్టలు చెబుతున్నారు.


ఇళ్లు స్ర్కీన్‌లకే అంకితం.. అదే సమస్య

కరోనా ఆరంభంతో చాలామంది పిల్లలు దాదాపు ఇంటికే పరిమితమయ్యారు. పెద్ద తరగతుల పిల్లలు అడపాదడపా స్కూల్స్‌కు వెళ్లినా ఐదో తరగతి లోపు పిల్లల్లో ఎక్కువ మంది పాఠాల కోసం స్ర్కీన్‌లకే పరిమితం కావడంతో తీవ్రంగా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిజానికి చిన్నారులు అంచనా, స్థిరత్వం మీద ఆధారపడి ఉంటారు. కరోనా కాలంలో ఇది పూర్తి భిన్నంగా జరుగుతోంది అని చెబుతున్నారు సైకాలజి్‌స్టలు. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఇళ్లకే పరిమితం కావడమన్నది చిన్నారుల ఎదుగుదలపై అతి తీవ్ర ప్రభావం చూపే అంశమే అని చెబుతున్నారు ఓ కళాశాలలో సైకాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ లావణ్య. ఆమె మాట్లాడుతూ ‘తమ తోటి పిల్లలతో కూడా గడిపే అవకాశం లేకపోవడం, తల్లిదండ్రులు తమ బిజీలో వీరితో పూర్తిగా సమయం కేటాయించలేకపోవడం, డిజిటల్‌ తెరలకు అధికంగా అతుక్కుపోవడం వంటి కారణాల చేత ప్రవర్తనా పరంగా వారిలో తీవ్ర సమస్యలు కనిపిస్తున్నాయి.


సాధారణంగా పాఠశాలల్లో నాణ్యమైన సమయం గడిపే చిన్నారులలో ఎదుగుదల సంపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడది లోపించింది. ఈ కొవిడ్‌ కాలంలో కారణాలేవైనా ఎన్నో కుటుంబాలు తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నాయి. ఇది కూడా చిన్నారులపై ఒత్తిడి పెంచుతోంది...’ అని అన్నారు. పనిపై ఏకాగ్రత చూపలేకపోవడం, పిలిచినా పలకకపోవడం, అతిగా కోపం తెచ్చుకోవడం వంటి ప్రవర్తనలు ఎక్కువ మందిలో కనబడుతున్నాయని  సైకాలజి్‌స్టలు చెబుతున్నారు. ఒంటరిగా ఉండటం వల్ల ఆందోళనకు గురికావడం, అది ఎక్కువైతే డిప్రెషన్‌లో కూరుకుపోవడమూ జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. మూడోవేవ్‌ ఉధృతి ముగిసే వరకూ అటు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపే అవకాశాలు ఎలాగూ ఉండవు.. ప్రభుత్వం కూడా మొండిగా పాఠశాలలు పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి తమ చిన్నారుల యోగక్షేమాల కోసం తల్లిదండ్రులే తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు సైకాలజి్‌స్టలు.


గుర్తించడం ఎలా..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేదాని ప్రకారం చిన్నారులు తమకు ఒత్తిడి ఎదురైనప్పుడు విభిన్నంగా స్పందిస్తారు. మరింత ఆందోళనగా ఉండటం, కోపం ప్రదర్శించడం, అమ్మకు మరీ అతుక్కుపోవడం, ఆతృత ఎక్కువగా ప్రదర్శించడం కనిపిస్తుంది. ఈ ఆందోళనతో కొంతమంది పక్క తడపటమూ చేయొచ్చు. స్కూల్‌ అంటే విరక్తి ప్రదర్శించడం లేదంటే మార్కులు విపరీతంగా తగ్గిపోవడం. ఏకాగ్రత చూపకపోవడం, శ్రద్ధ తగ్గడం, చిన్న  చిన్న కారణాలకే ఏడ్వడం, అధికంగా భయపడటం, ఏదో కోల్పోయినట్లుగా ముభావంగా ఉండటం, సరిగా నిద్రపోకపోవడం, ఒళ్లు నొప్పులు లేదంటే తరచూ తలనొప్పి అని చెబుతుండటం, ఎందుకు తింటున్నామో తెలియకుండా ఏదో ఒకటి తినడం వంటి లక్షణాలు కనిపిస్తే వారు ఒత్తిడిలో ఉన్నట్లే లెక్క.


భరోసా కల్పించాలి..

శారీరక, మానసిక భద్రత కోసం పిల్లలు తమ తల్లిదండ్రుల వైపు చూస్తుంటారన్నది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పిడియాట్రిక్స్‌ భావన. ఒకవేళ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని భావిస్తే తల్లిదండ్రులు, పిల్లలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. 


వారి భావాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా తప్పుచేస్తే ఆన్‌లైన్‌ క్లాస్‌ జరుగుతుంటే గేమ్స్‌ ఆడటం, లేదంటే ఫోన్‌ పక్కనపెట్టి ఆడుకోవడం లాంటి పనులు చేస్తే గట్టిగా మందలించడం చేస్తుంటారు. వారు చేసేది ముమ్మాటికే తప్పే కానీ, వారికి అర్థమయ్యే రీతిలో వివరించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తిట్టడం వల్ల సమస్య పరిష్కారం కాకపోవచ్చు కానీ పెద్దది అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితులు వివరించి, వారికి శ్రద్ధ పుట్టేలా చేయాలి.


నిజాయితీగా ఉండాలి..

మీరు అనుకున్నంత అమాయకులేమీ పిల్లలు కాదు. టీవీలలో అనుక్షణం చూపే కరోనా కేసుల స్కోర్‌ చూసిన తరువాత వారికి సందేహాలు రావడం సహజం. ఏదో ఒకటి ఆ నిమిషానికి చెప్పి తప్పించుకోవడం కాకుండా ఆ ప్రశ్నలకు జాగ్రత్తగా, ఓపిగ్గా సమాధానం ఇవ్వాలి. కరోనా గురించి వీలైనంతగా వారికి నిజాలనే చెప్పండి. అలాగే స్కూల్స్‌ ఎప్పుడు తెరుచుకుంటాయంటే వాస్తవ పరిస్థితులను తెలపండి. అదే సమయంలో మాస్కులు, పరిశుభ్రత, భౌతికదూరం ఆవశ్యకత చెబితే స్కూల్స్‌ ప్రారంభం అయినా వారు ఆ అంశాలను ఆచరించే అవకాశాలూ ఉన్నాయి. 


టైమ్‌ టేబుల్‌ ఉండాల్సిందే...

స్కూల్‌లో టైమ్‌ టైబుల్‌ ఉంటుంది. కానీ ఇంట్లో టైమ్‌ టేబుల్‌ కష్టమే. ఆన్‌లైన్‌ క్లాస్‌ల వేళ ఆ షెడ్యూల్‌ పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి. క్లాస్‌ జరుగుతుంటే ఆకలి అనడం లేదంటే ఇతరత్రా కారణాల కోసం సమయం వృథా కాకుండా జాగ్రత్త పడేలా షెడ్యూల్‌ ఉంటే వారి మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది.


కరోనా పేరుతో ఇంట్లోనే మగ్గిపోవాలా..

కరోనా వచ్చిన తరువాత చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తరచుగా కాకపోయినా అప్పుడప్పుడూ అయినా పిల్లలను బయటకు తీసుకువెళ్లడం వల్ల వారిలో ఒత్తిడి దూరమవుతుంది. కొవిడ్‌ నిబంధనలు పాటించే ఆహ్లాదకరమైన ప్రాంతాలైతే చాలు.


ఇతరులతో కనెక్ట్‌ కావాలి

పాఠశాలలకు దూరం అయిన తరువాత చాలామంది పిల్లలు స్నేహితులకు డిస్‌కనక్ట్‌ అయ్యారు. పిల్లల సంపూర్ణ ఎదుగుదల, వారి వయసు పిల్లలతో కలిసి ఉంటే జరుగుతుంది. భౌతికంగా స్నేహితులను కలిసే అవకాశాలు లేకపోవచ్చు కానీ వర్చువల్‌గా అయినా వారితో సంభాషించే అవకాశం కలిగితే కొంత మేర సమస్య పరిష్కారం అవుతుంది. 

Updated Date - 2022-01-28T17:55:00+05:30 IST