అనుకున్నంత మేలు జరగలేదు!

ABN , First Publish Date - 2021-12-22T13:35:03+05:30 IST

కరోనా కారణంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతుల వల్ల బడి పిల్లలకు అనుకున్నంత మేలు జరగలేదని ఓ సర్వేలో స్పష్టమైంది. ఆన్‌లైన్‌ విద్య విద్యార్థుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు దీని వల్ల ఎక్కువగా..

అనుకున్నంత మేలు జరగలేదు!

లెక్కలు.. ఎక్కాలు మరిచారు

ఇంగ్లిష్‌, మాతృభాషను చదవలేకపోతున్నారు

దిగువ తరగతి నైపుణ్యాలకూ దగ్గరగా లేరు

ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో వెనుకంజ

అభ్యసన సామర్థ్యాన్ని కోల్పోయిన బడి పిల్లలు

ఆన్‌లైన్‌ విద్యతో ఆగం.. నిసా సర్వేలో వెల్లడి


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ తరగతుల వల్ల బడి పిల్లలకు అనుకున్నంత మేలు జరగలేదని ఓ సర్వేలో స్పష్టమైంది. ఆన్‌లైన్‌ విద్య విద్యార్థుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని తేలింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు దీని వల్ల ఎక్కువగా నష్టపోయారని తెలిసింది. ఇందులో ఎక్కువగా పేద వర్గాల వారే ఉన్నారని వెల్లడైంది. విద్యార్థులపై కరోనా ప్రభావంపై నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్‌ అలయన్స్‌(నిసా) సర్వేను నిర్వహించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిసాలో బడ్జెట్‌ స్కూళ్ల యాజమాన్యాలు సభ్యులుగా ఉండగా, తెలంగాణ రికగ్నైజ్డ్‌ ప్రైవేట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌(ట్రస్మా) భాగస్వామిగా ఉంది. కరోనా వల్ల లర్నింగ్‌ లాస్‌(అభ్యసన సామర్థ్యాన్ని కోల్పోవడం)ను అంచనా వేసేందుకు నిసా దేశవ్యాప్తంగా సెప్టెంబరులో సర్వే నిర్వహించింది. తెలంగాణ సహా 17 రాష్ట్రాల్లో 1,502 మంది విద్యార్థులపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 3,5,8 తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, నివేదిక రూపొందించారు. విద్యార్థులు లెక్కలు, ఎక్కాల్లో వెనుకబడ్డారని.. మాతృభాషల్లో చదవలేకపోతున్నారని సర్వేలో స్పష్టమైంది. ప్రతి ముగ్గురిలో ఒకరు గణితంలో వెనుకబడిపోయారని తెలిసింది. మూడో తరగతిలో 44 శాతం మంది పిల్లలు లెక్కలు, ఎక్కాల్లో వెనుకబడ్డారు.


వీరిలో 36 శాతం తాము చదువుతున్న తరగతి కన్నా ఒక క్లాస్‌ వెనుకబడిపోగా, 8 శాతం పిల్లలు 2 క్లాసులు వెనుకబడి ఉన్నారు. సెమీ అర్బన్‌లో 5వ తరగతిలో 42 శాతం పిల్లలు గణితంలో వెనుకబడిపోగా, 8వ తరగతిలో 34 శాతం విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అన్ని క్లాసుల విద్యార్థులు గణితంలో తాము చదువుతున్న తరగతుల కన్నా ఒకటి లేదా రెండు తరగతుల దిగువస్థాయి నైపుణ్యాలను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. తెలంగాణ, ఏపీలోనూ పిల్లలు మాతృభాషలో చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 30శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం పిల్లలు మాతృభాషలో చదవలేకపోతున్నారు. ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో 14 శాతం చదవడం, 17 శాతం రాయడంలో వెనుకబడ్డారు. కొందరు విద్యార్థులు చదవగలుగుతున్నా.. రాయలేకపోతున్నారని తేలింది. 35 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులు మాతృభాషలో రాయడం అతిపెద్ద సమస్యగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 30శాతం విద్యార్థులది అదే పరిస్థితి. 8వ తరగతిలో 2శాతం విద్యార్థులు మాతృభాషలో రాయలేకపోతుండగా, 35 శాతం పట్టణ విద్యార్థులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 9శాతం విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న తరగతుల కన్నా రెండు తరగతులు వెనుకబడి ఉన్నారు. 3వ తరగతిలో 35శాతం విద్యార్థుల సామర్థ్యాలు 1,2 తరగతుల్లోని విద్యార్థుల సామర్థ్యాలకు దగ్గరగా ఉన్నాయి. 


ఆంగ్లంలో వెనుకబాటు..

ఆంగ్లంపై పట్టు సాధించడంలో ఏ ఒక్క విద్యార్థి దిగువ తరగతి నైపుణ్యాలను కూడా కనబర్చలేదని సర్వేలో తేలింది. ఇంగ్లిష్‌ పఠనంలో గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్‌ అన్న తేడాల్లేకుండా అంతా వెనుకబడ్డారు. ఇంటర్నేషనల్‌ స్కూళ్లల్లోని విద్యార్థులు ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తెలిసింది. 3వ తరగతిలో 35 శాతం విద్యార్థులు తాము చదువుతున్న తరగతి కన్నా రెండు తరగతులు వెనుకబడిపోయారు. 5వ తరగతిలో 26శాతం, 8వ తరగతిలో 19 శాతం విద్యార్థులు ఇంగ్లిష్‌ సరిగా చదవలేకపోతున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులు సైతం ఇంగ్లిష్‌ చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. 5వ తరగతిలో 50 శాతం విద్యార్థులు ఆంగ్లంలో రాయలేకపోవడం, పదాలను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.


లోటును వచ్చే ఏడాది పూడ్చాలి: వినోద్‌

రాబోయే (2022-23) విద్యా సంవత్సరాన్ని అభ్యసన లోటును పూడ్చే ఏడాదిగా ప్రకటించి, అభ్యసన సామర్థ్య లోటును భర్తీ చేయాలని బోయినపల్లి వినోద్‌ సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులంతా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ విషయంలో ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఒక తరం మొత్తం నష్టపోయే ప్రమాదముందన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయినా, కరోనా భయంతో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపే సాహసం చేయడంలేదని, దీంతో 50 శాతం మించి విద్యార్థులు తరగతులకు హాజరుకావడంలేదని చెప్పారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని వారే అత్యధికంగా నష్టపోతున్నారని తెలిపారు.



Updated Date - 2021-12-22T13:35:03+05:30 IST