ఆన్‌లైన్‌ జూదాలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు

ABN , First Publish Date - 2021-09-18T17:41:52+05:30 IST

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదాలు, బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు శుక్రవారం శాసనసభలో హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. తద్వారా రాష్ట్రంలో ఇకపై ఆన్‌లైన్‌ జూదాలకు కఠిన నిబంధనలు

ఆన్‌లైన్‌ జూదాలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు

                   - శాసనసభలో బిల్లు 


బెంగళూరు: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదాలు, బెట్టింగ్‌లను కట్టడి చేసేందుకు శుక్రవారం శాసనసభలో హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. తద్వారా రాష్ట్రంలో ఇకపై ఆన్‌లైన్‌ జూదాలకు కఠిన నిబంధనలు వర్తించనున్నాయి. ఆన్‌లైన్‌ జూదాలలో పట్టుబడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తారు. కర్ణాటక పోలీసు యాక్ట్‌కు సవరణ తీసుకొచ్చేందుకు ఇటీవలే కేబినెట్‌లో తీర్మానించారు. సదరు బిల్లును శాసనసభ ముందు ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌, బెట్టింగ్‌లతోపాటు టోకెన్‌లు ఉపయోగించడం నేరంగా భావిస్తారు. ఎలక్ట్రానికల్ సాధనాలతో జరిగే జూదాలను నిషేధించారు. మొబైల్‌ యాప్‌ ద్వారా జూదాలను సాంకేతిక సమాచార నిబంధన 2000 ప్రకారం ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉపయోగించడాన్ని సైబర్‌ నేరంగా భావించేలా చట్టంలో పొందుపరిచారు. ఆన్‌లైన్‌ జూదాలలో పట్టుబడితే ఏడాదిపాటు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించేలా చట్టాన్ని సవరించారు. ఆన్‌లైన్‌ జూదాల నిషేధం పరిధిలోకి లాటరీ, గుర్రపు పందేలు చేరవు. ఈ రెండింటినీ మినహాయించి మిగిలినవి ఆన్‌లైన్‌ జూదాలు గా పరిగణిస్తారు. రాష్ట్రప్రభుత్వం గతంలోనే ఆన్‌లైన్‌ జూదాలను నిషేధిస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించి శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. వర్చువల్‌ కరెన్సీ, డిజిటల్‌ కరెన్సీ, ఎలక్ట్రానిక్‌ మనీ, ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఫండ్స్‌, పాయింట్స్‌ రూపంలోని నగదుతోపాటు అన్ని విధాలా ఆర్థిక వ్యవహారాలు సాగే జూదాలను నిషేధించనున్నారు. కాగా ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ప్రధానంగా కంప్యూటర్‌ సిస్టమ్‌, మొబైల్‌ అప్లికేషన్‌, వర్చువల్‌ ప్లా ట్‌ఫాం, సైబర్‌ స్పేస్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌, కంప్యూటర్‌ రీసోర్స్‌, ఎలక్ట్రానిక్‌ అప్లికేషన్‌, సాఫ్ట్‌వేర్‌ యాక్సెసరీస్‌ సౌలభ్యాలతో నడిచే ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ రూపంలోని అన్ని గేమ్‌లను పోలీసుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 

Updated Date - 2021-09-18T17:41:52+05:30 IST