Abn logo
Oct 27 2021 @ 12:45PM

ఫేవ‘రేట్‌’ Betting

మోహన్‌నగర్‌లో నయా దందా

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ముఠా ఆటకట్టించిన రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు 

ఐదుగురి అరెస్టు, రూ. 16 లక్షల సొత్తు స్వాధీనం


ఫేవరెట్‌ టీమ్‌.. అన్‌ ఫేవరెట్‌ టీమ్‌.. వందకు 130, 30కు వంద.. ఇలా విభిన్నంగా లక్షల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన ఆర్గనైజర్‌, సబ్‌ ఆర్గనైజర్‌ సహా మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి నుంచి రూ. 14,92,500లు, ల్యాప్‌టాప్‌ సహా రూ. 16 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 


హైదరాబాద్‌ సిటీ: కొత్తపేట మోహన్‌నగర్‌కు చెందిన బైరామల్‌ శ్రీధర్‌ కోఠిలో బుక్‌స్టాల్‌ నిర్వహిస్తున్నాడు. తన దుకాణంలో పని చేస్తున్న సంబ్రం రామాంజనేయులుతో పాటు సరూర్‌నగర్‌కు చెందిన మరో ముగ్గురు స్నేహితులు జాజుల రాముగౌడ్‌, బోయినపల్లి ఛత్రపతి, గౌని కళ్యాణ్‌లతో కలిసి క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా ఏర్పరిచాడు. లైవ్‌ క్రికెట్‌ స్కోర్‌ను ఫాస్ట్‌గా అందించే ఇల్లీగల్‌ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని ముఠా సభ్యులకు యాక్సెస్‌ ఇచ్చి బెట్టింగ్‌ నిర్వహించేవాడు. ఒక్కో యాక్సె్‌సకు సుమారు రూ. 5 లక్షలు తీసుకునేవాడు. పంటర్‌లను ఆకర్సించి ఏడాదిగా మోహన్‌ నగర్‌లోని ఇంట్లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. 

70:30 - 30:70 రేషియోలో.. 

యాప్స్‌లో బాల్‌ టు బాల్‌ లైవ్‌ క్రికెట్‌ స్కోర్‌తో పాటు, ఇష్టమైన జట్టు పేరు, మ్యాచ్‌ విన్నింగ్‌ రేషియోను ప్రదర్శిస్తుంటాయి. దాన్ని అవకాశంగా తీసుకున్న శ్రీధర్‌ ఫేవరెట్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ పెట్టి గెలిస్తే రూ. 100కు రూ. 30 లాభం, అన్‌ ఫేవరెట్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ పెట్టి గెలిస్తే రూ.30కు రూ. 70 లాభం ఇస్తానంటూ  ఈ ముఠా ప్రచారం చేసింది. ఉదాహరణకు ఫేవరెట్‌ మ్యాచ్‌పై రూ. 10 వేలు పెట్టి గెలిస్తే రూ. 3 వేలు లాభంతో రూ. 13 వేలు ఇస్తారు. అదే అన్‌ ఫేవరెట్‌ మ్యాచ్‌పై రూ. 3 వేలు పెట్టి గెలిస్తే రూ. 7 వేలు లాభం వేసి మొత్తం రూ. 10 వేలు ఇస్తారు. ఇలా పంటర్లను ఆకర్షించి భారీ స్థాయిలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న జరిగిన టీ-20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌తో సహా 25న జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌ వర్సెస్‌ స్కాట్‌లాండ్‌ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌ నిర్వహించారు. మంగళవారం జరిగిన వెస్ట్‌ ఇండీస్‌ వర్సెస్‌ సౌత్‌ ఆఫ్రికా, పాకిస్తాన్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌లకు సైతం పంటర్స్‌ను సిద్ధం చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్‌ఐ అవినాశ్‌, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ సిబ్బందితో రంగంలోకి దిగి మోహన్‌నగర్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న  శ్రీధర్‌ ఇంటిపై దాడి చేశారు. ముఠాలోని ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ముఠా ఆటకట్టించిన సిబ్బందిని, ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డిని సీపీ అభినందించారు.

బెట్టింగ్‌ స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): టీ-20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి మ్యాచ్‌ సాగుతున్న సమయంలో ఆబిడ్స్‌ ప్రాంతంలో బెట్టింగ్‌ జరుగుతోందని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌, ఆబిడ్స్‌ పోలీసుల సాయంతో దాడులు నిర్వహించారు. సుభాష్‌ జైన్‌ను అదుపులోకి తీసుకోగా, ప్రధాన బుకీలు మహమ్మద్‌, సత్యేందర్‌ జైన్‌లు తప్పించుకున్నారు. సుభాష్‌ జైన్‌ నుంచి రూ. 52 వేల నగదు, ఓ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. 

హైదరాబాద్మరిన్ని...