UK కేంద్రం.. Hyderabad అడ్డా.. నలుగురు నేపాలీ అమ్మాయిల నియామకం.. పోలీసులు రంగంలోకి దిగడంతో...!

ABN , First Publish Date - 2021-10-09T17:28:55+05:30 IST

తిరుమలగిరికి చెందిన చున్నం కిరణ్‌ ఎంబీఏ చదివాడు. 2003లో జాబ్‌ వీసాపై యూకే వెళ్లాడు...

UK కేంద్రం.. Hyderabad అడ్డా.. నలుగురు నేపాలీ అమ్మాయిల నియామకం.. పోలీసులు రంగంలోకి దిగడంతో...!

  • రూ. లక్షల్లో బెట్టింగ్‌
  • ‘బెట్‌ఫెయిర్‌’లో హైదరాబాదీల దందా
  • నలుగురు నేపాలీ అమ్మాయిల నియామకం
  • ముఠా ఆటకట్టించిన రాచకొండ పోలీసులు
  • ముగ్గురు నిందితుల అరెస్టు, 74.83 లక్షలు స్వాధీనం

బెట్‌ ఫెయిర్‌.. ప్రపంచంలో అతి పెద్ద గ్యాంబ్లింగ్‌ కంపెనీ. యూకే  కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ  యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠా ఆటకట్టించారు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు. నలుగురిని అరెస్టు చేసి కటకటాల్లోకి  నెట్టారు. వారి నుంచి రూ. 53లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 21,82,254 లు సహా మొత్తం రూ. 74,83,000 స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సీపీ మహేష్‌ భగవత్‌, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.


హైదరాబాద్‌ సిటీ : సికింద్రాబాద్‌ తిరుమలగిరికి చెందిన చున్నం కిరణ్‌ ఎంబీఏ చదివాడు. 2003లో జాబ్‌ వీసాపై యూకే వెళ్లాడు. అక్కడ ఓ రెస్టారెంట్‌లో కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత క్లబ్‌లో అబ్జర్వర్‌గా చేరాడు. యూకేలో డిమాండ్‌ ఉన్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్స్‌ అయిన బెట్‌ఫెయిర్‌.కామ్‌, బెట్‌365, 1ఎక్స్‌బెట్‌లపై పట్టు సాధించాడు. ఆ తర్వాత శ్రీలంకకు వెళ్లాడు. అక్కడ కూడా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై బెట్టింగ్‌లు కట్టి లక్షల్లో సంపాదించాడు. ఇప్పటికీ తరచూ గోవాకు వెళ్లి రూ. లక్షల్లో బెట్టింగ్‌ కడుతుంటాడు.


బెంగళూరులో నకిలీ కంపెనీ..

యూకే కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్‌ను హైదరాబాద్‌ అడ్డాగా దేశవ్యాప్తంగా నిర్వహించాలని పథకం వేశాడు. బెంగళూరులోని ఇందిరానగర్‌లో శ్రీనిధి సాఫ్ట్‌బైక్‌ పేరుతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, నకిలీ కంపెనీ రిజిస్టర్‌ చేశాడు. కంపెనీ పేరుతో యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా తెరిచాడు. బుకీలు, పంటర్‌ల నుంచి జరిగే ఆర్థిక లావాదేవీలను ఆ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లావాదేవీలుగా నమ్మించేందుకు ప్లాన్‌ వేశాడు. ఆ తర్వాత రూ. 20 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించి యూకే నుంచి బెట్‌ఫెయిర్‌.కామ్‌లో మెంబర్‌షిప్‌, ఏజెన్సీ తీసుకున్నాడు.


నేపాల్‌ యువతులతో పరిచయం..

కిరణ్‌ శ్రీలంక వెళ్లినప్పుడు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కంపెనీల్లో పనిచేసిన నేపాల్‌ యువతులతో పరిచయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్స్‌ నిర్వహించే క్రమంలో పంటర్స్‌ను ఆకర్శించడం, బెట్టింగ్‌ వ్యవహారం చూసేందుకు నలుగురు నేపాలీ యువతులను నియమించుకున్నాడు. తనకు సహాయంగా ఉండటానికి, పంటర్‌లతో మాట్లాడటానికి ఇద్దరు స్నేహితులు సయ్యద్‌ అఖీల్‌ అహ్మద్‌, అనేరు సురేందర్‌రెడ్డిని ముఠాలో చేర్చుకున్నాడు. సురేందర్‌రెడ్డి మొదట పంటర్‌గా చేరి రూ. 15 లక్షలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు వెల్లడించాడు.


ఆ తర్వాత కిరణ్‌ వద్ద సహాయకుడిగా చేరినట్లు తెలిసింది. 2018 నుంచి బెట్టింగ్‌ నిర్వహిస్తున్న కిరణ్‌ రూ. కోట్లు సంపాదించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోసారి నిందితులను క స్టడీకి తీసుకొని బెట్టింగ్స్‌కు సంబంధించి పూర్తి టెక్నికల్‌ వివరాలు తెలుసుకుంటామని సీ పీ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అడిషనల్‌ డీసీపీ ఎస్‌వోటి సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ బృందాన్ని సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. 

Updated Date - 2021-10-09T17:28:55+05:30 IST