జలకళ దరఖాస్తులకు ఆన్‌లైన్‌ ఆటంకాలు

ABN , First Publish Date - 2020-10-29T05:54:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ జలకళకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేవారికి సర్వర్‌ సమస్య వెంటాడుతోంది.

జలకళ దరఖాస్తులకు ఆన్‌లైన్‌ ఆటంకాలు
జిల్లాకు కేటాయించిన రిగ్గులను ప్రారంభిస్తున్న కలెక్టర్‌(ఫైల్‌)



ఒక్కో దరఖాస్తు నమోదుకు సుదీర్ఘ సమయం

జిల్లాలో 6,250 దరఖాస్తులే కొలిక్కి

నిరాశ చెందుతున్న రైతులు 

గంట్యాడ, అక్టోబరు 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్‌ఆర్‌ జలకళకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారి దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేసేవారికి సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి గ్రామ సచివాలయ సిబ్బంది టెన్షన్‌ పడుతున్నారు. ఒక దరఖాస్తు వివరాలు నమోదు చేయాలంటే సుమారు 20 నుంచి 30 సార్లు ప్రయత్నం చేస్తేగాని కావడం లేదు. ఈ సమస్య జిల్లా వ్యాప్తంగా ఉంది. అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదు. గత నెల 28న వైఎస్‌ఆర్‌ జలకళ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ప్రతి రైతు పొలంలో ఉచితంగా బోరు వేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. మొదట్లో ఐదు ఎకరాలు ఉండాలని నిబంధనలు పెట్టింది. తరువాత దీనిని సవరించింది. పొలంతో సంబంధం లేకుండా గతంలో ఆ రైతుకు బోరు మంజూరు కాకపోతే ఈసారి మంజూరు చేస్తారు. అలాగే వాల్టా చట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్‌ మిషన్‌ను ప్రభుత్వం కేటాయించింది.  ఈ పథకానికి పట్టాదారు పాస్‌ పుస్తకం, 1బి, ఆధార్‌ కార్డు, తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి రైతూ అర్హుడే. ఇప్పటికే అన్ని గ్రామాల్లో రైతులకు సంబంధించి వివరాలను, దరఖాస్తులను గ్రామ వలంటీర్లు సేకరించారు. వీటిని సంబంధిత సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌కు అందజేశారు. వారు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లాగిన్‌లో రైతుల వివరాలను ఆన్‌లైన్‌ చేయాలి. సర్వర్‌ పని చేయకపోవడంతో దరఖాస్తులను నమోదు చేయలేకపోతున్నారు. ఒక్కో దరఖాస్తు కోసం దాదాపు  అరగంట సమయం పడుతోంది. జిల్లావ్యాప్తంగా వేలాది దరఖాస్తులు రైతుల నుంచి తీసుకున్నప్పటికీ వాటిలో కేవలం 6,250 దరఖాస్తులనే ఆన్‌లైన్‌ చేశారు. జిల్లాలోని గంట్యాడలో అత్యధికంగా 602 దరఖాస్తులు ఆన్‌లైన్‌ చేయగా...అత్యల్పంగా విజయనగరం మండలంలో 16 దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనివల్ల పథకం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది.  


మండలాల వారీ ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తులిలా..

జిల్లాలో వైఎస్‌ఆర్‌ జలకళకు ఇప్పటివరకూ వచ్చిన వాటిల్లో 6,250 దరఖాస్తులే ఆన్‌లైన్‌ అయ్యాయి. మండలాల వారీగా వివరాలు

=====================

మండలం- దరఖాస్తుల సంఖ్య

=====================

విజయనగరం - 16 దరఖాస్తులు, 

ఎస్‌.కోటలో -31, 

పూసపాటిరేగలో- 43, 

గజపతినగరంలో- 68, 

భోగాపురంలో -75, 

గుమ్మలక్ష్మిపురం 79, 

మెంటాడలో 79, 

ఆర్‌బీపురం 86, 

గరివిడి 86, 

పాచిపెంటలో 50, 

గుర్ల 61, 

జామిలో 94, 

కురుపాంలో 111, 

దత్తిరాజేరులో 126, 

నెల్లిమర్లలో 133, 

కొత్తవలస 133, 

డెంకాడ 141, 

పార్వతీపురం 145, 

వేపాడ 160, 

చీపురుపల్లి 163, 

సాలూరు179, 

బొండపల్లి 188, 

బొబ్బిలి 227, 

గురుగుబిల్లి 229, 

తెర్లాం 231, 

బాడంగి 237, 

జియ్యమ్మవలస 224, 

ఎల్‌.కోట 248, 

బలిజిపేట 301, 

మక్కువ 346, 

కొమరాడ 353, 

మెరకముడిదాం 447, 

సీతానగరం 465,

 గంట్యాడలో 602  


ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం

మండలాల వారీ సమాచారం తీసుకుని సర్వర్‌ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పటివరకు చాలా మంది దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశాం. రైతులు ఇచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌ చేస్తున్నాం.

                                - నాగేశ్వరరావు, పీడీ, డ్వామా



Updated Date - 2020-10-29T05:54:52+05:30 IST