Abn logo
Jul 5 2020 @ 14:20PM

ఆన్‌లైన్‌ యాక్టివిజం

ఫేస్‌బుక్‌ కార్యాలయం.. రోజులాగే ఉద్యోగులందరూ ఆఫీసుకు వచ్చారు. కంప్యూటర్లు ఆన్‌ చేశారు. డెస్కుల్లో ఉన్నవాళ్లందరూ ఒక్కసారి పైకిలేచి.. లాగ్‌డౌన్‌ అన్నారు. కంప్యూటర్లను షట్‌డౌన్‌ చేశారు. అదొక కొత్తరకం నిరసన.. వర్చువల్‌ వాకౌట్‌. ఇదివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్‌డౌన్‌ చేసి నిరసన వ్యక్తం చేసేవాళ్లు. అంటే, ఆ రోజంతా పనిచేయరన్నమాట. ఇప్పుడా నిరసనలు వర్చువల్‌ వాకౌట్‌గా రూపం మార్చుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని.. వాటిని నియంత్రించాలని ఫేస్‌బుక్‌ యజమాని జూకర్‌బర్గ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు.. ఈ వాకౌట్‌ చేశారు ఉద్యోగులు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య తరువాత చేపట్టిన బ్లాక్‌ లీవ్స్‌ మాటర్‌ ఉద్యమంలో భాగంగా జరిగిందీ సంఘటన. 


లండన్‌లో కూడా జూమ్‌యాప్‌లో వందల మంది ఆన్‌లైన్‌లో ఒక్కటయ్యారు. అందరి చేతుల్లోనూ ప్లకార్డులు ఉన్నాయి. ఇదివరకైతే రోడ్లమీద, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఇలా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపేవాళ్లు. ఇప్పుడు కరోనా భయంతో.. వర్చువల్‌ నిరసనలకు దిగారు జనం. అందుకు జూమ్‌ యాప్‌ వేదికైంది. మన దేశంలో కూడా మెల్లమెల్లగా ఆన్‌లైన్‌ యాక్టివిజం పెరుగుతోంది.


ఒకప్పుడు ఉద్యమం అంటే జనం రావాలి. జెండాలు, ప్లకార్డులు పట్టుకుని.. నినాదాలు చేస్తూ.. నిరసన వ్యక్తం చేయాలి. దిషిబొమ్మల్ని తగులబెట్టాలి. ఒక్కోసారి పోలీసులు అడ్డుకుంటారు. అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు దారితీసేది. ఇప్పుడు అదే వేడి ఆన్‌లైన్‌ వేదికలకు చేరింది. అందరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు రావడం.. సామాజిక మాధ్యమాలకు అలవాటు పడటంతో.. ఏ చిన్న అసంతృప్తినైనా వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తున్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర మైక్రోబ్లాగింగ్‌ సైట్లు పెరిగాక.. సిటిజన్‌ జర్నలిజం కూడా పెరిగింది. తొమ్మిదేళ్ల కిందట ట్యునీషియా, ఈజిప్టులలో ఆయా ప్రభుత్వాలపై ఆందోళన చేసేందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో తోడ్పడ్డాయి. అరబ్బు దేశాల్లో ఏర్పడిన సంక్షోభాలప్పుడు కూడా ట్విట్టర్‌ చురుకైన పాత్ర పోషించింది.


మానవహక్కులకు భంగం వాటిల్లినప్పుడు కూడా సోషల్‌మీడియా స్పందించింది. ప్రధాన మీడియా అందుబాటులో లేనప్పుడు.. సామాజిక మాధ్యమమే సగటు మనిషికి ఆయుధం అవుతోంది. హాంకాంగ్‌లో కూడా ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు ప్రేరణనిచ్చింది సోషల్‌మీడియానే. ఛేంజ్‌.ఓఆర్‌జీ, ఐపిటీషన్స్‌.ఓఆర్‌జీ, అవాజ్‌.ఓఆర్‌జీ వంటి ఆన్‌లైన్‌ పిటిషన్‌ వెబ్‌సైట్లు కూడా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు, సమస్య తీవ్రతను, ప్రజల మద్దతును తెలియజేసేందుకు సహకరిస్తున్నాయి. ఆన్‌లైన్‌ యాక్టివిజం విస్తరించేందుకు.. ఇలాంటి ఆన్‌లైన్‌ పిటిషన్‌ వెబ్‌సైట్లు ఎంతో దోహదపడుతున్నాయి. ఒక్క ఛేంజ్‌.ఓఆర్‌జీని సుమారు రెండొందల దేశాలు వాడుతున్నాయంటే.. వాటి అవసరం అనివార్యమని తెలుస్తుంది. దీని ద్వారా ఇప్పటి వరకు సుమారు 45 వేల సామాజిక సమస్యలకు పరిష్కారం లభించింది. తమ గళాన్ని ప్రపంచానికి బలంగా వినిపించేందుకు ఆన్‌లైన్‌ పిటిషన్‌లు ఎంతో ఉపకరిస్తున్నాయి. ప్రజల మద్దతు లభించేందుకు చిన్న కారణం చాలు. అదొక ఉద్యమంగా రగులుకుంటుంది. ప్రపంచంలోని ఏ మూల నుంచైనా వ్యాప్తి చేయొచ్చు. పాలకుల్ని ప్రశ్నించవచ్చు. ఆన్‌లైన్‌ యాక్టివిజం ఎంత బలమైనదో చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని.. 

భారత్‌ నేమ్‌ ఛేంజ్‌ ..

జాతీయగీతంలో ‘భారత’ భాగ్య విధాత.. ప్రతిజ్ఞలో ‘భారత’ దేశం నా మాతృభూమి, ‘భారతీయు’లు అందరూ నా సహోదరులు.. భారతీయ శిక్షాస్మృతిలో ‘భారతీయ సంవిధాన్‌’.. దేశ అత్యున్నత పురస్కారంలో ‘భారత’రత్న.. దూరదర్శన్‌లో తరచూ వాడే పదం ‘భారత’ ప్రభుత్వం.. ఇలా అన్నిచోట్లా భారత్‌ అనే పిలుస్తున్నాం. మరి ఇండియా అని ఎందుకు పిలవాలి? అప్పుడెప్పుడో వలసచరిత్రను ప్రోది చేసుకున్న ‘ఇండియా’ అనే పేరును మార్చాలి. ఆ పేరులోనే ఆంగ్లేయుల వలసచరిత్ర చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. భరతఖండం పేరుతో ప్రాశస్త్యం పొందిన పురాతన దేశం మనది. ‘భ’ అంటే తేజోమయం, ‘రత్‌’ అంటే గౌరవం. ప్రాచీన భారతీయత అంటే - వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం, యోగా, జీవనదులు, వ్యవసాయం,  విలువైన ఖనిజసంపద.. వీటన్నిటి సమాహారమే. ఆ సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేందుకు ఇండియా పేరును తొలగించి.. భారత్‌గా మార్చాలంటూ ఆన్‌లైన్‌ పిటిషన్ల ద్వారా ప్రచారం సాగిస్తున్నారు కొందరు. ‘భారతీయతలోనే సమైఖ్యస్ఫూర్తి ఉంది.


మన జాతి గర్వపడే సాంస్కృతిక వారసత్వ సంపద ఉంది. ఇండియా, రిపబ్లిక్‌ ఇండియా అని రకరకాలుగా పిలుస్తున్నారు. ఆధార్‌కార్డుపై భారత్‌ సర్కార్‌ అనీ, డ్రైవింగ్‌లైసెన్సు, పాస్‌పోర్టులపై రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా అనీ ముద్రిస్తున్నారు. ఒక దేశం పేరులో ఇంత గందరగోళం ఎందుకు?’’ అంటున్నారు ఢిల్లీవాసి నమహ్‌. ఇదొక ఆన్‌లైన్‌ యాక్టివిజంగా మారింది. ఇండియాను భారత్‌గా మార్చేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. పేరు మార్పుకు కోర్టు ఒప్పుకోలేదు.

బ్రింగ్‌ బ్యాక్‌ అవర్‌ గర్ల్స్‌

ఉత్తర నైజీరియాలోని ఒక మారుమూల ప్రాంతం. సమాచారం బయటికి రావడమే గగనం. అలాంటిది ప్రపంచవార్త అయ్యింది. కారణం కేవలం సోషల్‌మీడియా ఉద్యమమే. ఆరేళ్ల కిందట బోకోహరామ్‌ ఉగ్రవాదులు ఒక పాఠశాలలో చదివే మూడొందల మంది బాలికల్ని కిడ్నాప్‌ చేశారు. అందులో కొందరు తప్పించుకుని ఇళ్లకు చేరుకోగా.. మిగిలిన వాళ్లు ఉగ్రచెరలో బందీలుగా ఉండిపోయారు. స్థానిక పత్రికలు రాసినా.. అదొక జాతీయ అంశం కాలేదు. బాలికల తల్లుల శోకం సర్కారుకు వినిపించలేదు. తూతూమంత్రంగా పోలీసులు గాలించారే కానీ ప్రయోజనం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని, దీన్నొక సవాలుగా స్వీకరించాలని బాలికల తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ‘బ్రింగ్‌ బాక్‌ అవర్‌ గర్ల్స్‌’ అనే హ్యాష్‌టాగ్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అది వెల్లువలా ప్రపంచాన్ని ముంచెత్తింది. దేశవిదేశాల్లోని సెలబ్రిటీలు, దేశాధినేతలు, మానవహక్కుల పోరాట యోధులు  రీట్వీట్‌ చేస్తూ.. మద్దతు పలికారు. తల్లిదండ్రులకు ప్రజల మద్దతు మనోధైర్యాన్ని ఇచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా సతీమణి మిచెల్లీ, ఆప్ఘన్‌ ఉద్యమకారిణి యూసఫ్‌ మలాలాలు సైతం స్పందించారు. ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన సంఘటన అంతర్జాతీయ అంశంగా మారింది. ఆన్‌లైన్‌ ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఇప్పటికీ బాలికల్లో కొందరి ఆచూకీ లభించలేదు. నేటికీ పోరాటం సాగుతోంది. 

ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌

‘‘నా బాల్యాన్ని, భవిష్యత్తును, కలలను కూల్చారు. పర్యావరణ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. భూమినీ, మట్టినీ, నదుల్నీ, సముద్రాల్నీ కలుషితం చేశారు. మీవన్నీ వట్టి మాటలు. ఇన్ని అబద్దాలు చెప్పేందుకు మీకెంత ఽధైర్యం?’’ అంటూ ఐక్యరాజ్యసమితి వేదిక మీద పాలకుల్ని ఏకిపారేసింది ఒక బడిపిల్ల. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ఆ విద్యార్థి అయ్యావార్లనే కాదు, అంతర్జాతీయ సమాజాన్నీ కదిలించింది. తన వెనక ఎవ్వరూ లేరు. జెండాలు, అజెండాలు అస్సలు లేవు. ఒక్కతే వెళ్లి స్వీడన్‌ పార్లమెంటు ముందు కూర్చుంది. ఆ ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. కదిలిపోయారు నెటిజనం. 2018 ఆగస్టులో అలా పర్యావరణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది గ్రెటా థన్బెర్గ్‌. వాతావరణ సంక్షోభంపై పారిస్‌ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని.. అందుకు ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలని ఉద్యమ బాట పట్టింది. సోషల్‌మీడియాలో ఇలాంటి అరుపులు ఒకట్రెండ్రోజులే కనిపిస్తాయని తేలిగ్గా తీసుకుంది ప్రభుత్వం. గ్రెటా మొండిది. ఎంత పట్టుదల పిల్ల అంటే.. రోజూ స్కూలుకు వెళుతూనే.. ప్రతి శుక్రవారం వెళ్లి పార్లమెంటు ముందు కూర్చునేది. ఆ నిరసనకు ‘ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ అన్న పేరుపెట్టింది. ఒకటికాదు, రెండు కాదు.. ప్రతి వారం ఇదే పని. మీడియా మొత్తం ఆమె చుట్టూ చేరింది.


మిగతా బడిపిల్లలంతా పొలోమంటూ వాలిపోయారు. సోషల్‌మీడియాలో ఆమెకు దేశాధ్యక్షుల్ని మించిన ఫాలోయింగ్‌ లభించింది. హఠాత్తుగా సెలబ్రిటీ అయ్యింది. ఐక్యరాజ్యసమితి వాళ్లే తమ సమావేశాలకు ఆహ్వానం పలికారు. అంతర్జాతీయ పర్యావరణవేత్తలు, విద్యార్థులు తమ దేశాల్లోని ప్రభుత్వకార్యాలయాలు, చట్టసభల ఎదుట ప్రతి శుక్రవారం ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఈ పర్యావరణ ఉద్యమం రెండొందల దేశాలకు విస్తరించింది. ‘ప్రతి ఒక్కరు పర్యావరణ ధర్మాలను పాటించాలి. భూగోళం ఉష్టోగ్రత తగ్గించాలి. పాలకులు మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి..’ అంటోంది గ్రెటా.


నెపోటిజం

రాజకీయ నాయకులకు అధికారం భూషణం.. సెలబ్రిటీలకు అభిమానులే ఆభరణం. పదవిపోతే గౌరవం దక్కదు. అభిమానులు తగ్గితే ఆదరణ ఉండదు. అందుకే బాలీవుడ్‌ తారలను నింగి నుంచి నేలకు దింపాలనుకుంది నెపోటిజం. బంధుప్రీతిని వ్యతిరేకించే ఆన్‌లైన్‌ ఉద్యమం ఇది. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న వెంటనే.. సోషల్‌ మీడియా వేదికగా బంధుప్రీతి వ్యతిరేక ఉద్యమాన్ని లేవనెత్తారు. సుశాంత్‌ బతికున్నప్పుడు ఎవరైతే అతన్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చులకనగా మాట్లాడారో వాళ్లను అన్‌ఫాలో చేయడం.. వీరి లక్ష్యం. స్టార్‌కిడ్స్‌ల ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి ఫాలోవర్స్‌ బయటి వచ్చేయడం.. నిరసన తెలపడం ముఖ్యోద్దేశం. ఈ దెబ్బతో సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల క్రేజీ రోజు రోజుకూ పడిపోతోంది. అప్పట్లో కరణ్‌ జోహర్‌ అలియాను ఒక ఇంటర్వ్యూ చేస్తే.. ‘సుశాంతా? అతనెవరో నాకు తెలీదే?’ అని చెప్పిందామె. అప్పట్లో ఆ వ్యాఖ్య వివాదాస్పదమైంది కూడా. ఆ సమయంలో ధోనీ బయోపిక్‌లో నటించిన సుశాంత్‌కు హీరో గుర్తింపు వచ్చింది. అలాంటి ఎత్తిపొడుపుల్ని తిరిగి గుర్తుచేసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు. తల్లిదండ్రులు, బంధుగణం బలం లేకపోతే స్టార్‌కిడ్స్‌కు అవకాశాలు వచ్చుండేవి కాదు కదా.. అన్నది నెపోటిజం ఉద్యమకారుల ప్రశ్న. అందుకే స్టార్‌కిడ్స్‌ అయిన అలియా, సోనాక్షి, సోనమ్‌, కరణ్‌, కరీనా తదితరుల సోషల్‌స్టేటస్‌ను అన్‌ఫాలోతో తగ్గించేస్తున్నారు. వాళ్ల ట్విట్టర్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఖాతాల నుంచి అభిమానులు వైదొలగుతున్నారు.   

రిమూవ్‌ చైనా యాప్స్‌

భారత్‌, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్‌ లోయలో జరిగిన ఉద్రిక్తతవల్ల.. ఇరు పక్షాల సైనికుల ప్రాణాలు పోయాయి. మన దేశానికి చెందిన కొందరు సైనికులు వీరమరణం పొందారు. కరోనా కష్టకాలంలో ఇలా హద్దులు మీరడం ఏంటని చైనాపైన మండిపడ్డారు నెటిజన్లు. కేంద్ర ప్రభుత్వం కూడా చైనాపై నిరసన వ్యక్తం చేసేందుకు.. సుమారు 60 యాప్స్‌ను నిషేధించింది. ఇదివరకు ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ను వన్‌టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌ రూపొందించింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. చైనా కూడా స్పందించింది. తమ దేశం పట్ల విద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారని పేర్కొంది. అయితే భారత్‌లో మాత్రం చైనా యాప్స్‌ పట్ల నెటిజన్లలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. కొందరు సెలబ్రిటీలు ఆ దేశానికి చెందిన యాప్స్‌ను రిమూవ్‌ చేస్తున్నట్లు బహిరంగ ప్రకటనల్ని చేశారు. నెటిజన్లు కూడా టిక్‌టాక్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయులు రూపొందించిన చింగారీ యాప్‌ను లక్షలమంది డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. రిమూవ్‌ చైనా యాప్స్‌ సామాజిక మాధ్యమాలతోనే ప్రాచుర్యం పొందింది. ఇది ఎంత వరకు కొనసాగుతుందనేది ఇప్పుడే చెప్పలేం. చైనా సాంకేతికతను అందిపుచ్చుకుని.. పోటీని తట్టుకునే యాప్స్‌ను మన దేశం తీసుకొస్తే.. ఫలితం ఉంటుంది. లేకపోతే రిమూవ్‌ చైనా యాప్స్‌ ఉద్వేగ నిర్ణయంలా మిగిలిపోతుంది. సరిహద్దు గొడవలను వాణిజ్య సంబంధాలకు ముడిపెట్టడం ఎంత వరకు సమంజసం అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. 

 మీటూ

అప్పట్లో తెలుగుసాహిత్యంలో స్త్రీవాద ఉద్యమం ఉప్పెనలా ఎగసిపడినట్లే.. ప్రపంచవ్యాప్తంగా ‘మీటూ’ ఆన్‌లైన్‌ ఉద్యమం సంచలనం సృష్టించింది. ముసుగులు వేసుకున్న కొందరు పురుషుల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేశారు మహిళలు. తమ జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై గొంతు విప్పారు. ధైర్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వచ్చారు. ఈ దేశం ఆ దేశం అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా మహిళలకు ఏదో ఒక రూపంలో లైంగికవేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. మన దేశంలోనూ 2018లో ‘మీటూ’ ఉద్యమం అడుగుపెట్టింది. బాలీవుడ్‌లో అయితే పేరున్న నటీమణులు బయటికి వచ్చి.. తమ కెరీర్‌లో జరిగిన లింగవివక్ష, వేధింపులను బహిర్గతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, మీడియా సంస్థలు, బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోని పలువురు నటీమణులు ఇదే బాట పట్టారు. నానాపటేకర్‌పై తనుశ్రీదత్తా చేసిన ఆరోపణలు పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టాయి. గౌరవప్రతిష్టలు కలిగిన రంగాల్లో కూడా ఈ జాడ్యం తీవ్రం కావడంతో మహిళలంతా ఒక్కటయ్యారు. ఆన్‌లైన్‌ వేదికలుగా ఉద్యమించారు. ‘మీటూ’ కేవలం సోషల్‌మీడియాకే పరిమితం కాలేదు. చర్చావేదికలు, పుస్తకాలు, ఆంగ్ల కథలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ఫిల్మ్స్‌, సినిమాల రూపంలో కూడా విస్తరించింది.

బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌

ఒక్కడి మరణం.. జాతి మొత్తాన్ని ఏకం చేసింది, ఉద్యమింపజేసింది. అమెరికాలో జార్జ్‌ఫ్లాయిడ్‌ ఒక అనామకుడు. అక్కడి పోలీసు చేతిలో చనిపోయాక.. నల్లజాతీయుల గుండెల్లో నిలిచిపోయాడు. అతనిదొక క్రూరమైన పోలీసు హత్య. సెల్‌ఫోన్‌లో రికార్డయిన ఆ దృశ్యం వైరల్‌ అయ్యింది.  జార్జ్‌ మరణాన్ని చూసి.. అయ్యోపాపం అన్న వాళ్లంతా ఇళ్లలోనే ఉండిపోలేదు. జనం తండోపతండాలుగా రోడ్ల మీదికి వచ్చారు.  నల్లజాతీయులంతా నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు నిరసనలతో అట్టుడికిపోయాయి. ఆ ఉద్యమానికి సుదీర్ఘ కార్యచరణను రూపొందించి.. ‘బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌’ పేరుతో విస్తరించారు. సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. వివిధ రంగాల్లో శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే వరకు వెళ్లింది. రంగును బట్టి మనిషికి ప్రాధాన్యం ఇస్తారా? అనే చర్చలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే.. కలరిజం మరోసారి తెరమీదికి వచ్చింది. ఫెయిర్‌నెస్‌ క్రీములు, లోషన్లు, సబ్బులు, ఇతర కాస్పొటిక్‌ ఉత్పత్తుల ప్రకటనలు కూడా నల్లజాతీయుల్ని అవమానించేలా ఉన్నాయన్న ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దీంతో యూనీలీవర్‌కు చెందిన కొన్ని సౌందర్య ఉత్పత్తులు, ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ వంటి ఉత్పత్తుల పేర్లను మార్చాల్సి వచ్చింది. బ్లాక్‌ లైవ్స్‌ మాటర్‌ ఉద్యమ సెగలు రకరకాల కంపెనీలకు వ్యాపించాయి.


ఫేస్‌బుక్‌ను కూడా వదల్లేదు. ‘ప్రధాన సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌ తమ లాభాల కోసం జాతి, వర్ణ, ప్రాంత విద్వేషాలను ప్రోత్సహిస్తోంది. ఇది మంచిది కాదు..’ అంటూ ఫ్రీ ప్రెస్‌, కామన్‌సెన్స్‌, మానవహక్కుల సంస్థలు ఒక్కటై మరో కొత్త ఉద్యమాన్ని తీసుకొచ్చాయి. అదే ‘స్టాప్‌ హేట్‌ ఫర్‌ ప్రాఫిట్‌’. ఉద్దేశపూరిత పోస్టులను కట్టడి చేయనందున ఫేస్‌బుక్‌కు వాణిజ్యప్రకటనల్ని నిలిపివేస్తున్నట్లు ఈ ఉద్యమం ప్రకటించింది. ఒక్క యూనీలీవర్‌ కంపెనీనే రెండువేల కోట్ల రూపాయల విలువచేసే ప్రకటనల్ని ఫేస్‌బుక్‌కు ఇస్తుంటుంది. ఇప్పుడవి ఇవ్వబోమని చెప్పిందా సంస్థ. స్టార్‌బక్స్‌, వెరిజోనా, కోకోకోలా, హోండా కూడా అదే బాటలో నడుస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement