ఉల్లిని కృత్రిమ కొరత సృష్టిచొద్దు!

ABN , First Publish Date - 2020-10-25T06:46:47+05:30 IST

ఉల్లిని నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వ్యాపారులను హెచ్చరించారు.

ఉల్లిని కృత్రిమ కొరత సృష్టిచొద్దు!

వ్యాపారులకు కలెక్టర్‌ హెచ్చరిక

రైతుబజారులో కిలో రూ.40లకే విక్రయం


నెల్లూరు (వ్యవసాయం), అక్టోబరు 24 : ఉల్లిని నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చక్రధర్‌బాబు వ్యాపారులను హెచ్చరించారు. నెల్లూరులోని నవాబుపేట రైతుబజారులో శనివారం వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీ ఉల్లి విక్రయకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.40లకే రైతుబజార్లలో విక్రయించేలా చర్యలు తీసుకుందన్నారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన దృష్ట్యా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సబ్సిడీపై విక్రయించనున్నట్లు తెలిపారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.


జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ మాట్లాడుతూ ఉల్లిపాయలు కావాల్సిన వారు ఆధార్‌ లేదా రేషన్‌ కార్డు తప్పక తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి బాలకృష్ణారావు, మార్కెటింగ్‌ శాఖ ఏడీ మామమ్మ, నెల్లూరు తహసీల్దారు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T06:46:47+05:30 IST