ఘాటెక్కుతున్న ఉల్లి

ABN , First Publish Date - 2020-03-29T11:42:17+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉల్లి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఇప్పటికే కిలో ఉల్లిగడ్డలు రూ. 50 లకు చేరుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో

ఘాటెక్కుతున్న ఉల్లి

బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 50 

 రవాణా లేకపోవడంతో పెరుగుతున్న ధరలు

 త్వరలోనే సెంచరీ కొట్టడం కాయమంటున్న వ్యాపారులు

ఖమ్మం మార్కెట్‌, మార్చి 28:  లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉల్లి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఇప్పటికే కిలో ఉల్లిగడ్డలు రూ. 50 లకు చేరుకున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక వర్షాల కారణంగా గత నవంబరు, డిసెంబరు మాసాల్లో కిలో రూ. 150 నుండి రూ. 170లు పలికిన ఉల్లి ధరలు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో  కొంత తగ్గుముఖం పట్టి కిలో రూ. 25 నుంచి రూ. 30 లకు చేరగా ప్రస్తుతానికి కరోనా ఎఫెక్ట్‌తో రూ. 50 లకు చేరింది. గత రెండు రోజుల నుంచి సుమారు కిలోకు రూ. 20 ల పెరుగుదల నమోదు కావడంతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నా రు. లాక్‌డౌన్‌ కారణంతో త్వరలోనే కిలో ఉల్లి రూ. 100 లకు చేరుకోవ చ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్‌ మహారాష్ట్రలో ఎక్కువగా ఉండటంతో అక్కడ వ్యాపారులు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు.


అంతే కాకుండా ఎక్కువగా దిగుమతి చేసుకొనే స్థానిక వ్యాపారులు సైతం అక్కడకు వెళ్లక పోవడంతో ఉల్లి దిగుమతుల్లో కొంత ఆందోళన నెలకొంది. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణా పోలీసులు తెలంగాణా మహారాష్ట్ర బోర్డర్‌లో ఆంక్షలు విధించడంతో దిగుమతులు పూర్తీగా నిలిచిపోయాయి. పరిస్థితి ఇలా ఉంటే మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు ఈజీగా సాధ్యమయ్యో విధంగా లేవని వ్యాపారులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి ఉల్లి రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు తసుకుంటే తప్ప ధరలు అదుపులో ఉండవని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - 2020-03-29T11:42:17+05:30 IST