సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ABN , First Publish Date - 2022-04-04T02:13:12+05:30 IST

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం వచ్చే మంగళవారంనాడు ..

సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం వచ్చే మంగళవారంనాడు జరుగనుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన  జరిగే ఈ సమావేశంలో పార్టీ ఉభయసభల ఎంపీలు హాజరవుతారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు సహజంగానే ఈ తరహా సమావేశాలు జరుగుతుంటాయి. అయితే, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేదు అనుభవం చవిచూసిన అనంతరం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుండటం ఇదే మొదటిసారి.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని పార్టీని ఐక్యంగా ఉంచేందుకు సోనియాగాంధీ కొద్దిరోజులుగా గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులోనూ ఈ ఏడాది రెండు కీలకమైన రాష్ట్రాల్లో...హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ కొన్ని చిక్కులు ఎదుర్కొంటోంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అరుణ్ యాదవ్ మనస్తాపంతో ఉండగా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలోనూ కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీ నిర్వహణకు సంబంధించి సమూల మార్పులు చేయాలని పట్టుబడుతున్న జీ-23 నేతలను సైతం సోనియాగాంధీ వ్యక్తిగతంగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ సంప్రదించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే బదులు కాంగ్రెస్ పటిష్టత కోసం సమష్టిగా, అందర్నీ కలుపుకొని వేళ్లే నాయకత్వం అవసరమని, నిర్ణయాలు అన్ని స్థాయిల్లోనూ తీసుకునే వీలు కల్పించాలన్నది జీ-23 నేతల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. 2024లో విశ్వసనీయమైన ప్రత్యామ్నాయానికి మార్గం సుగమం చేసేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చర్చలకు చొరవ చూపాలని కూడా అసమ్మతి నేతలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-04T02:13:12+05:30 IST