కుడి,ఎడమ కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2022-01-20T06:49:53+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజె క్టు నుంచి కుడి, ఎడమకాల్వలకు నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది.

కుడి,ఎడమ కాల్వలకు కొనసాగుతున్న నీటి విడుదల

నాగార్జునసాగర్‌, జనవరి 19: నాగార్జునసాగర్‌ ప్రాజె క్టు నుంచి కుడి, ఎడమకాల్వలకు నీటి విడుదల బుధవారం కూడా కొనసాగింది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 577.40 అడుగులు (275.5168టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వ ద్వారా 7,678 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వ ద్వారా 2,872 క్యూసెక్కుల నీటిని, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని, వరద కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ నుంచి మొత్తం 43,070 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌  ఉత్పత్తి నిలిపివేయడం వల్ల ఎగువనుంచి సాగర్‌కు ఎలాం టి నీటి రాకలేదు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 850.10 అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి ఎలాంటి నీటి విడుదల లేదు.


మూసీకి తగ్గని ఇన్‌ఫ్లో

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తుఫాను ప్రభావంతో ఎగువ మూసీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన విస్తార వర్షాలకు దిగువన గల మూసీ ప్రాజెక్టుకు గత నాలుగు రోజులుగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో తొలుత ప్రాజెక్టు మూడు క్రస్టుగేట్లు మూడు అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిన అధికారులు ఇన్‌ఫ్లో కొంత తగ్గుముఖం పట్టడంతో ఆ తర్వాత రెండు గేట్లను పూర్తిగా మూసేసి 3వ నెంబర్‌ క్రస్టుగేటును అడుగు మేర ఎత్తి ఉంచారు. 

ప్రాజెక్టు 645 అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉండడంతో ఎగువ నుంచి 637 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఎత్తి ఉంచిన ఒక గేటు ద్వారా 792 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. 645 అడుగులు(4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 644.50అడుగులు(4.33టీఎంసీలు)గా ఉంది.  

Updated Date - 2022-01-20T06:49:53+05:30 IST