ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-06-20T10:02:02+05:30 IST

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చిరుజల్లులు
  • నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని, నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిపై ఉన్న బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టులు నిండాయి. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ నీరంతా ఎస్సారెస్పీకి రావడంతో ఆరు రోజుల్లో ప్రాజెక్టులోకి 7 టీఎంసీల నీరు వచ్చి చేరింది. తాజాగా శనివారం 18,564 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1067.20 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. మరోవైపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి ఎత్తిపోతలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. 


శనివారం 11 మోటార్ల ద్వారా 23,100 క్యూసెక్కుల నీటిని (సుమారు 2టీఎంసీలు) అన్నారం బ్యారేజీలోకి ఎత్తిపోశారు. ఈ వర్షాకాలంలో పంప్‌హౌజ్‌ 11 మోటార్లను నడిపించడం ఇదే ప్రథమం. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీలోకి 9,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో బ్యారేజీ ఐదు గేట్లను ఎత్తి 3,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పెద్దేముల్‌లో 2.9 సెంటీమీటర్ల వర్షం కురువగా మర్పల్లిలో 1.9 సెంటీమీటర్లు, నవాబ్‌పేటలో 1.5 వర్షం  కురిసింది. ఇక రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-06-20T10:02:02+05:30 IST