అన్నదాత విలవిల

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

ప్రాణహితకు భారీగా వరద పోటేత్తడంతో పంటలు నీట మునిగి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పోటెత్తిన

అన్నదాత విలవిల

ప్రాణహిత వరదలకు నీట మునిగిన చేలు 

కొనసాగుతున్న పంట నష్టం సర్వే


కోటపల్లి, సెప్టెంబరు 18: ప్రాణహితకు భారీగా వరద పోటేత్తడంతో పంటలు నీట మునిగి అన్నదాతలు విలవిలలాడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పోటెత్తిన వరదలతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు కలతచెందుతున్నారు.  పంట నష్టంపై ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వం తమను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


పోటెత్తిన వరద..

భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, మహారాష్ట్ర లో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో ప్రాణహిత నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఆగస్టు 31 అర్ధరాత్రి వరద ఉధృతితో కోటపల్లి మండలంలో ప్రాణహిత నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని పంట చేలు, పొలాల్లోకి నీరు ప్రవేశించింది. వరద ఉధృతికి తోడు మేడిగడ్డ బ్యారేజీ నుంచి బ్యాక్‌ వాటర్‌ వచ్చి చేరడం తో వేల ఎకరాల్లోని పంటలు నీట మునిగాయి. సుమారు వారం రోజుల పాటు పంటలు నీట మునిగే ఉన్నాయి. దీంతో పత్తి మొక్కలు కుళ్లిపోయాయి. మండలంలోని వెంచపల్లి, జనగామ, సూపా క, ఆల్గామా, పుల్లగామ, సిర్సా, అన్నారం, అర్జునగుట్ట, దేవులవాడ, రాంపూర్‌, రాపనపల్లి, రావులపల్లి గ్రామాల్లో వరద నీరు చేరిన కారణంగా పత్తి, వరి పంటలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. మరోవైపు తుంతుంగ ప్రాజెక్టు ఉధృతితో ఏదులబంఽ దం శివారులోని పంటలు నీటి పాలయ్యాయి. పంట ల సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టగా ఆదిలోనే నష్టాలు చవిచూడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


అధికారుల సంయుక్త సర్వే..

ప్రాణహిత వరదలతో పంటలు నీటిలో మునిగిపోవడంతో 12 రోజు లుగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో  సంయుక్తంగా నష్టంపై సర్వే జరుగుతోంది. మండల పరిధిలో 3,380 ఎకరాలలోని పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 3,330 ఎకరాల్లో పత్తి,  50 ఎకరాల్లో వరి నీట మునిగిందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేతో పంటనష్టం జరిగిన విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ ఏవో, ఏఈవో లు  పంట క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ నష్టం వివరాలను సేకరిస్తు న్నారు. బుధవారం ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రాణహి త వరదల వల్ల జరిగిన పంట నష్టంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.


అపార నష్టం..తాటి బుచ్చయ్య, రైతు, జనగామ

ప్రాణహిత వరదలతో అపారంగా పంట నష్టం జరిగింది. నేను నాలుగెకరాల సొంత భూమితో పాటు మరో రెండు ఎకరాలు కౌలు కు తీసుకొని పత్తి సాగు చేశాను. ప్రాణహిత వరదలు పంటను ముంచడంతో ఆరెకరాలలో పంట తుడిచిపెట్టుకుపోయింది. కౌలుభూమికి ఎకరానికి రూ.40 వేలు, సొంత భూమికి ఎకరానికి రూ.25 నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం  ఆదుకోవాలి. 


మరో నాలుగు రోజుల్లో సర్వే పూర్తి..మహేందర్‌, వ్యవసాయశాఖ అధికారి 

ప్రాణహిత నది వరదల వల్ల జరిగిన పంట నష్టంపై మరో నాలుగు రోజుల్లో సర్వే పూర్తి కా నుంది. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా నివే దిక ప్రభుత్వానికి  అందజేశాం.  పంటలు వారం రోజుల పాటు నీటిలో ఉండడంతో మొక్కలు కుళ్లిపోయాయి. అధికంగా పత్తి పంటకు నష్టం వాటి ల్లింది. దెబ్బతిన్న పంట మొక్కలను తీసివేసి నువ్వులు, పెసర లాంటి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం. 

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST