రైతులకు సంకెళ్లపై నిరసనల వెల్లువ

ABN , First Publish Date - 2020-10-31T09:27:54+05:30 IST

అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి.

రైతులకు సంకెళ్లపై నిరసనల వెల్లువ

అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద టీడీపీ శ్రేణులఆందోళనలు

నేడు చలో గుంటూరుకు తరలాలని పిలుపు


ఒంగోలు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : అమరావతి రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టి విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని హెచ్‌సీఎం కాలేజీ ఎదురు ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీశ్రేణులు మో కాళ్లపై కూర్చొని చేతులకు బేడీలు వేసుకొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.  

టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ బాలాజీ, ఇతర నాయకులు కొఠారి నాగేశ్వరరావు, రాజ్‌విమల్‌, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కనిగిరి, పామూరు, వెలిగండ్ల, సీఎ్‌సపురం, గిద్దలూరు తదితర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇంకొల్లులో ఒంగోలు-పర్చూరు రహదారిపై టీడీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించగా, చీమకుర్తి పట్టణంలో ఆ పార్టీశ్రేణులు శుక్రవారం సాయంత్రం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో సీపీఐ కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎస్సీ, బీసీ రైతులకు సంకెళ్లు ఘటనకు బాధ్యులైన ఉన్నతస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాల వద్ద నేతలు డిమాండ్‌ చేశారు. నిరసన కొనసాగింపులో భాగంగా శనివారం చలో గుంటూరు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎన్‌. బాలాజీ తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలోని అన్ని ప్రాంతాల నుంచి చలో గుంటూరు కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-10-31T09:27:54+05:30 IST