నిర్లక్ష్యంతో నీరు వృథా

ABN , First Publish Date - 2020-10-31T09:16:15+05:30 IST

నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం, మార్కాపురం చెరువు సప్లయ్‌ చానల్‌పై పర్యవేక్షణ లోపం వెరసి మార్కాపురం చెరువుకు చేరాల్సిన నీరు వృథాగా పోతోంది.

నిర్లక్ష్యంతో నీరు వృథా

సప్లయ్‌ చానల్‌కు మరమ్మతుల కరువు
కంభం చెరువు నిండటంతో పెరిగిన నీటి ఉధృతి
పొంగిన మార్కాపురం చెరువు సప్లయ్‌ చానల్‌
భగత్‌సింగ్‌ నగర్‌లో చేరిన నీరు
ఆందోళనలో స్థానికులు

మార్కాపురం, అక్టోబరు 30 : నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం, మార్కాపురం చెరువు సప్లయ్‌ చానల్‌పై పర్యవేక్షణ లోపం వెరసి మార్కాపురం చెరువుకు చేరాల్సిన నీరు వృథాగా పోతోంది.  అదీనూ జనాలు నివాసముండే ప్రాంతంలోకి వస్తోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖాధికారులు స్పందించక పోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 


సప్లయ్‌ చానల్‌కు పెరిగిన నీటి ఉధృతి
మార్కాపురం చెరువుకు గుండ్లకమ్మ నది నుంచి నీరు సరఫరా అయ్యేందుకు మండలంలోని మాల్యవంతునిపాడు వద్ద నుంచి 12.35 కిలోమీటర్ల మేర సప్లయ్‌ చానల్‌ ఉంది. నీటిపారుదలశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా చానల్‌పై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల నల్లమలలో కురిసిన వర్షాలకు కంభం చెరువు నిండింది. నాలుగు రోజుల నుంచి చెరువు అలుగు పారుతోంది. దీంతో గుండ్లకమ్మ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. మాల్యవంతునిపాడు నుంచి మార్కాపురం చెరువుకు ఉన్న సప్లయ్‌ చానల్‌కు కూడా నీటి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి సప్లయ్‌ చానల్‌లో నీటి ఉధృతి పెరిగింది.


పొంగిన సప్లయ్‌ చానల్‌-భగత్‌సింగ్‌ నగర్‌లోకి నీరు
మార్కాపురం చెరువు సప్లయ్‌ చానల్‌లో నీటి ఉధృతి పెరగడంతో 9.05 కిలోమీటర్‌ వద్ద నీరు పొంగి పొర్లింది. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో సప్లయ్‌ చానల్‌ ఒడ్డున ఉన్న మట్టి కరిగి కొట్టుకుపోయింది. సప్లయ్‌ చానల్‌లో ప్రవహిస్తున్న నీరు తర్లుపాడు రోడ్డులోని భగత్‌సింగ్‌ నగర్‌, పవర్‌ ఆఫీస్‌ వెనుకవైపునకు చేరింది. ఖాళీ స్థలాలలోకే కాక, ఇళ్ల మఽఽధ్యకు కూడా చేరింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


రెండు యూటీల ద్వారా నీరు విడుదల
నీటి ఉధృతితో సప్లయ్‌ చానల్‌ దెబ్బతినడం, భగత్‌సింగ్‌ నగర్‌లోకి నీరు చేరిన విషయాన్ని తెలుసుకున్న నీటిపారుదలశాఖ ఏఈ భాగ్యలక్ష్మి స్పందించారు. కొండేపల్లి వద్ద ఉన్న రెండు యూటీల ద్వారా నీటిని వదిలారు. సప్లయ్‌ చానల్‌లో నీటి ప్రవాహ ఉధృతిని తగ్గించేపనిలో ఉన్నారు. 


ఆందోళనలో కాలనీవాసులు
గతంలో ఎన్నడూ లేని విధంగా కాలనీలోకి సప్లయ్‌ చానల్‌ నీరు రావడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సప్లయ్‌ చానల్‌కు శాశ్వత మరమ్మతులు చేసి కాలనీలోకి నీరు రాకుండా చేయాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-10-31T09:16:15+05:30 IST