పశువుల బీడు మాయం

ABN , First Publish Date - 2020-09-25T11:28:09+05:30 IST

మండలంలో రోజురోజుకు భూఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ‘కంచేచేను మేస్తుంటే కాపేమి చేయగలడు’ అన్నచందంగా ఇక్కడ పరిస్థితి తయారైంది.

పశువుల బీడు మాయం

 రెవెన్యూ అధికారుల అండతో 

  రెచ్చిపోతున్న ఆక్రమణదారులు 

 ఆందోళనలో పశుపోషకులు


కొనకనమిట్ల, సెప్టంబరు 24 : మండలంలో రోజురోజుకు భూఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. ‘కంచేచేను మేస్తుంటే కాపేమి చేయగలడు’ అన్నచందంగా ఇక్కడ పరిస్థితి తయారైంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు లంచాల మత్తులో జోగుతూ భూబకాసురల చేతిలో కీలుబొమ్మలుగా మిగిలిపోతున్నారనే విమర్శలున్నాయి. వివరాల్లోకి వెళితే కాంట్రగుంట పంచాయతీలో  సర్వే నంబరు 199లో 4.16 సెంట్లు,  200-2లో 5.24 ఎకరాలు, 200-1లో 2.66 ఎకరాలు, 202లో 43.15 ఎకరాల పశువుల బీడు భూములున్నాయి.


కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులతో కుమ్మకై రికార్డులను తారుమారు చేసినట్లు ఆరోపణలున్నాయి. పాత పాసుపుస్తకాలలో పేర్లు, ఫోటో తీసివేసి అక్రమార్కుల పేరు మీద నకిలి పాసుపుస్తకాలను సృష్టించారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు అవకతవకలపై వినతిపత్రాలు ఇచ్చారు.


అయినప్పటికీ, న్యాయం జరగక పోవడంతో జిల్లాకలెక్టర్‌కు నివేధించారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సర్వే నంబరు  197లో 32.68 ఎకరాల్లో కొంత పశువుల బీడు భూమిని గ్రామంలోని కొంత మంది ఆక్రమించుకొని పంటలు వేశారు.


ఈ తరుణంలో ఆగ్రహించిన పశుపోషకులు, గొర్రెల కాపర్లు ఆ పంటలను తమ పశువులతో మేపించారు. అనంతరం 23న గొర్రెలతో తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపారు.  ఈ విషయంపై తహసీల్దార్‌  భాగ్యలక్ష్మిని వివరణ కోరగా పశువుల బీడు భూములకు 2015లో ఆన్‌లైన్‌ చేసి ఉందని, అంతేకాకుండా ఆ భూములకు పాసుపుస్తకాలు ఉన్నాయని వాటిని పరిశీలించి  నివేధికలు ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. 

Updated Date - 2020-09-25T11:28:09+05:30 IST