పురుష ప్రయత్నంతోనే బంధవిముక్తి

ABN , First Publish Date - 2020-10-01T07:37:20+05:30 IST

‘చపల స్వభావం కలది, నిలకడలేనిది అయిన మనసు ఏయే విషయాల యందు సంచరిస్తుందో వాటి నుంచి దాన్ని మరలించి ఆత్మ (పరమాత్మ)యందే స్థాపితం చేయాలి. అంతర్ముఖంగా ఆత్మయందే ఉండేటట్లు ప్రయత్నించాలి...

పురుష ప్రయత్నంతోనే బంధవిముక్తి

  • యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం
  • తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం న యేత్‌

‘చపల స్వభావం కలది, నిలకడలేనిది అయిన మనసు ఏయే విషయాల యందు సంచరిస్తుందో వాటి నుంచి దాన్ని మరలించి ఆత్మ (పరమాత్మ)యందే స్థాపితం చేయాలి. అంతర్ముఖంగా ఆత్మయందే ఉండేటట్లు ప్రయత్నించాలి.’ అని గీతా సందేశం. సంకల్పమే మనసు యొక్క రూపం. కనుక సాధకుడు మనసు యొక్క చర్యలను గమనిస్తుండాలి. ఎదురయ్యే సుఖ దుఃఖాలకు చలించక, సమబుద్ధితో, మనో నిగ్రహంతో చిత్తాన్ని సమత్వమునందుంచడమే యోగసారమని గీతాబోధ. ‘‘పొగతో మసిబారిన ఇంట్లో ప్రవేశిస్తే శరీరానికి ఏ కొద్దిగానైనా మసి అంటుకోకుండాపోదు. అదే విధంగా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంద్రియాలతో సహవాసం చేసిన వానికి కొంతైనా కామేచ్ఛ కలుగక తప్పదు’’ అంటారు శ్రీరామకృష్ణ పరమహంస. విత్తనాలు చల్లకుండా పంట ఎలా పండదో.. అలాగే, ప్రయత్నించకుండా ఈ లోకంలో ఏ పనీ సఫలం కాదు. లోకంలో ఉన్న ప్రాణులకు పనులన్నీ శ్రమ వల్లనే సిద్ధిస్తున్నాయి. నది సముద్రాన్ని చేరి సముద్ర భావం పొందునట్లు.. చిత్తమును ఆత్మయందు నింపి ఆత్మ స్వరూపానుభవం చేసే కొద్దీ ఆత్మభావం కలుగుతుంది.


పట్టుపురుగు తన నూలుచే గూడు కట్టుకొనేటప్పుడు ఎలాగైతే ద్వారాన్ని కూడా బంధించుకుని మరణిస్తుందో.. అలాగే జీవుడు స్వసంకల్ప వాసనాజాలానికి తగులుకుని మరణిస్తున్నాడు. దానిని పురుష ప్రయత్నం చేతనే ఛేదించి బంధ విముక్తిని పొందగలగాలి. ఇంద్రియాలకు బానిసైన వాడు దుఃఖాల పాలై జనన మరణ చక్రంలో పడుతున్నాడు. ‘‘ఉపాసనం వినా సిద్ధిర్నై వాస్యాదితి నిర్ణయః’’ అని భగవాన్‌ రమణుల వాక్కు. అనగా ఉపాసనలో పురుష ప్రయత్నంతో తాపత్రయాగ్నిని శమింపజేసుకోవాలి అని శాస్త్ర నిర్ణయం. అట్లే సాధకుడు తన హృదయంలో ఉన్న పాత వృత్తులను ఒక్కొక్కటిగా త్యజించాలి. కొత్త వృత్తులు లోనికి ప్రవేశించకుండా గట్టిగా అడ్డుకుని దైవభావంతో ఉంటే త్వరగా ముక్తి పొందవచ్చు. ‘‘యత్నానురూపంహి ఫలం కిఇయాణామ్‌’’ ..పని యొక్క ఫలితం ప్రయత్నాన్ని అనుసరించే ఉంటుంది. కార్యశీలత అనేది దైవధ్యానం వంటిది. యోగం లాంటిది. యాగం లాంటిది. సానపెడితేనే వజ్రం ప్రకాశిస్తుంది. కాల్చిన బంగారమే కాంతులు వెదజల్లుతుంది. అందుకే ‘‘సాధనమున పనులు సమకూరు ధరలోన’’ అన్నాడు వేమన. 


  • ఉద్యమః సాహసం ధైర్యం, బుద్ధిశ్శక్తిః పరాక్రమః
  • షడే తౌ యత్ర వర్తంతే, తత్రదేవ స్సహాయకృత్‌

అని ‘విక్రమార్కచరితం’ చెబుతున్నది. అనగా ప్రయత్నం, సాహసం, ధైర్యం, మనోబలం, శక్తి, పరాక్రమం.. ఈ ఆరు గుణాలూ ఎక్కడ ఉంటాయో అక్కడ దైవమే ఉండి కార్య సాఫల్యము కావించునని దీని భావము. శారీరక, మానసిక శ్రమని లెక్కచేయకుండా.. సహనంతో, సంయమనంతో చేసే సాధన ఎప్పుడూ సత్ఫలితాలను ఇస్తుంది. మనిషికి తాను చేసే పనిలో పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తుంది. అందుకే అసాధ్య సాధకులైన, సుధీరులైన, నిశ్చలమనస్కులైన మహనీయుల్ని మార్గదర్శకులుగా భావించి కర్తవ్య నిర్వహణ చేయాలి. 

- మేఘశ్యామ (ఈమని), ఫోన్‌: 8332931376


Updated Date - 2020-10-01T07:37:20+05:30 IST