ఇక ఒకే ఓటరు లిస్టు!

ABN , First Publish Date - 2020-08-30T07:25:18+05:30 IST

జమిలి ఎన్నికల నిర్వహణను సాకారం చేసే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా ఉండే విధంగా దృష్టి పెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే సారి నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగా...

ఇక ఒకే ఓటరు లిస్టు!

  • లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలన్నింటికీ ఒకటే..?
  • రూపకల్పన సాధ్యాసాధ్యాలపై కేంద్రం చర్చ
  • రాష్ట్ర ఎన్నికల సంఘాల విడి జాబితాకు స్వస్తి
  • రాష్ట్ర సర్కార్లకు నచ్చచెప్పనున్న కేంద్రం
  • అవసరమైతే రాజ్యాంగ సవరణ
  • జమిలి ఎన్నికల దిశగా మరో అడుగు!

జమిలి ఎన్నికల నిర్వహణను సాకారం చేసే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా ఉండే విధంగా దృష్టి పెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకే సారి నిర్వహించాలన్న లక్ష్యంలో భాగంగా.. తొలి విడతగా ఒకే ఓటరు జాబితా అమలయ్యేట్లు చూడాలని నిశ్చయించింది.



న్యూఢిల్లీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఇన్నేళ్లూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ తయారు చేసిన జాబితా, మునిసిపల్‌, కార్పొరేషన్‌, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఎస్‌ఈసీ)లు సిద్ధం చేసిన జాబితాలను విడివిడిగా వాడుతున్నారు. అనేక రాష్ట్రాలు ఈసీ జాబితాలనే స్థానిక ఎన్నికలకూ ఉపయోగిస్తున్నప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రాలు తమ సొంత లిస్టులను తయారుచేసుకుంటున్నాయి. ఇది తీవ్ర గందరగోళానికి, విమర్శలకు తావివ్వడమే కాక- విపరీతమైన ప్రజాధనం దుర్వినియోగమవుతోందని కేంద్రం భావిస్తోంది. కొందరి పేర్లు రాష్ట్రాల జాబితాలో ఉండి ఈసీల లిస్టులో లేకపోవడంతో ప్రజల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్న  సందర్భాలనేకం ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు గాను-  ఈనెల 13న ప్రధాని కార్యాలయ ఆధ్వర్యంలో ఓ కీలక సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా రెండు ప్రత్యామ్నాయాలను చర్చించారు.


(1) దేశమంతా ఒకే ఓటరు లిస్టు ఉండేట్లుగా రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌ఏలను సవరించడం.

(2) ఈసీ తయారు చేసే జాబితాలనే స్థానిక ఎన్నికలకూ వాడండని రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చచెప్పడం. ప్రధాని ప్రిన్సిపల్‌ కార్యదర్శి పీకే మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, లెజిస్లేటివ్‌ కార్యదర్శి జి నారాయణరాజు, పంచాయతీరాజ్‌ కార్యదర్శి సునీల్‌ కుమార్‌, ఈసీ సెక్రటరీ జనరల్‌ ఉమేశ్‌ సిన్హా సహా మరో ముగ్గురు అధికారులు, లా కమిషన్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


ఒప్పించే బాధ్యత గౌబాకు..

ఒకే ఓటరు జాబితా ప్రతిపాదనకు ఈసీ, లా కమిషన్‌, న్యాయ శాఖ, పంచాయతీరాజ్‌ విభాగాలు సై అన్నాయి. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మొదలైన అంశాలపై ఎస్‌ఈసీలకు అధికారమిచ్చేవి 243కే, 243జెడ్‌ఏ అధికరణలు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీలో ఈసీకి అధికారమిచ్చేది ఆర్టికల్‌ 324(1).


ఎస్‌ఈసీలు స్థానిక ఎన్నికల వరకూ సొంతంగా జాబితాలు రూపొందించుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పిస్తోంది. కానీ, చాలా రాష్ట్రాలు ఈసీ జాబితాలనే స్థానిక ఎన్నికలకు వాడుతున్నాయి. ఇకపై ఈసీ జాబితాలనే స్వీకరించండని ఈ రాష్ట్రాలకు నచ్చచెప్పడం మంచిదని పంచాయతీరాజ్‌ కార్యదర్శి సునీల్‌ కుమార్‌ గట్టిగా అఽభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. మిశ్రా కూడా దీన్ని ఆమోదిస్తూ రాష్ట్రాలను నెల రోజుల్లో ఒప్పించే బాధ్యతను రాజీవ్‌ గౌబాకు అప్పగించారు. రాష్ట్రాలు అంగీకరించకపోతే- రాజ్యాంగ సవరణ అంశాన్ని పరిశీలిస్తారు. దీని విధి విధానాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని లా కమిషన్‌, న్యాయశాఖను కోరినట్లు తెలుస్తోంది. 


జమిలి ఎన్నికలపై 

జమిలి ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న విషయంలో కేంద్రంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. 2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో  ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. 2022 ,2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి- దేశ వ్యాప్తంగా లోక్‌ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోదీ సర్కార్‌ వ్యూహం.   మోదీ ప్రభుత్వం తీసుకునే కొన్ని చర్యలు, పరిణామాలను బట్టి ఈ ఎన్నికల సమయ్నాన నిర్ణయిస్తారని, వాస్తవానికి కరోనాతో కొన్ని నిర్ణయాలను వాయిదా వేయాల్సి వచ్చిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు లా కమిషన్‌, ఎన్నికల సంఘం కూడా సానుకూల నివేదికలు సమర్పించాయి. గత ఏడాది ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో జమిలి ఎన్నికల విషయంపై సూచనలు చేసేందుకు కమిటీని వేయాలని కూడా నిర్ణయించారు. ఒకే ఓటర్ల జాబితా రూపొందిస్తే ఓటర్లకు తాము ఫలానా జాబితాలో లేమన్న అయోమయం ఉండదని కమిషన్‌ భావిస్తోంది.  


ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు

ఒకే ఓటరు జాబితాను 1999లో తొలిసారిగా ఈసీ   తెరపైకి తెచ్చింది. 2004, 2006లోనూ నివేదికలు పంపినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మళ్లీ 2015లో లా కమిషన్‌ ప్రతిపాదించింది. రాజ్యసభలో పూర్తి మెజారిటీ, చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేకపోవడంతో మోదీ ప్రభుత్వం ముందుకెళ్లలేదు. వాస్తవానికి బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఒకే ఓటరు జాబితాను చేర్చింది. అధికారంలోకి వచ్చాక లా కమిషన్‌, ఈసీలను కేంద్రం సమాయత్తం చేసింది. పార్లమెంట్‌లో మెజారిటీ, దాదాపు 20 రాష్ట్రాలు తమ చేతికిందే ఉండడంతో ఇపుడు అడుగు ముందుకేసింది.


అంత సులువు కాదు

ఒకే ఎన్నికల జాబితాపై రాష్ట్రాలను ఒప్పించడం అంత సులువు కాదని మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఒకరు అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రాలు కేంద్రాన్ని నమ్మవు. అనేక అపోహలు, అనుమానాలు. దీనిపై ఏకాభిప్రాయం సాధించాలి. అది కుదరని పని. ఒకవేళ చేసినా అసెంబ్లీ పోలింగ్‌ కేంద్రాల పరిధులు, మునిసిపాలిటీ వార్డుల పరిధులు వేరువేరు. రెంటినీ సమన్వయం చేయాలి. డిజిటల్‌ పరిజ్ఞానంతో వార్డుల పరిధులు,  ఓటర్ల వివరాలను అసెంబ్లీ కేంద్రాలకు కూడా అనువర్తింపచేయడం సాధ్యమే అయినా.. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడ గోల్‌మాల్‌ జరిగినా ప్రజల నుంచి విమర్శలు తప్పవు’’ అని పేర్కొన్నారు. 



జమిలికి, జాబితాకు సంబంధం లేదు

‘ఆంధ్రజ్యోతి’తో సీఈసీ సునీల్‌ అరోరా

దేశంలో ఒకే ఓటర్ల జాబితా తయారుకు, జమిలి ఎన్నికలకూ సంబంధం లేదని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా అన్నారు. ఈ విధంగా కొన్ని పత్రికలు ముడిపెట్టడం సరైంది కాదని ఆయన శనివారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో అన్నారు. దేశమంతటా  ఒకే ఓటర్ల జాబితా ఉండాలన్న ప్రతిపాదనను ఎన్నికల కమిషన్‌, లా కమిషన్‌ ఎప్పటి నుంచో చేశాయన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనపై సునీల్‌ అరోరా ప్రతిస్పందించలేదు. 


Updated Date - 2020-08-30T07:25:18+05:30 IST