ఒక్కడి నుంచి 77మందికి

ABN , First Publish Date - 2020-05-27T15:59:42+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో..

ఒక్కడి నుంచి 77మందికి

చుట్టేస్తోంది..!

జిల్లాలో మంగళవారం మరో 30 పాజిటివ్‌లు నిర్ధారణ

అందులో 27 కేసులు మామిడాడలోనే.. బాధితుల్లో 19 మంది మహిళలే

బాధితులందరికీ కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తి నుంచే వైరస్‌ సంక్రమణ

అటు గడిచిన అయిదు రోజుల్లో మామిడాడలో ఏకంగా 56 కొవిడ్‌ కేసులు

జిల్లాలో 153కి చేరిన పాజిటివ్‌ కేసులు.. ఆందోళనకర స్థాయిలో తీవ్రత

వస్త్ర, ఆభరణ దుకాణాలు తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం


కాకినాడ(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు పుట్టుకొస్తున్నాయి. కొవిడ్-19తో మృతిచెందిన వ్యక్తి ద్వారా ఇప్పటి వరకూ 77మందికి పైగా వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో జి.మామిడాడలో 56మంది, బిక్కవోలు 13మంది, రామచంద్రపురంలో ఏడుగురు, తునిలో ఒకరు ఉన్నారు. ఆ వ్యక్తి గురువారం కరోనాతో మృతిచెందగా, అప్పటినుంచి వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరొక కేసు బొమ్మూరు క్వారంటైన్‌లో ఉన్న రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మంగళవారంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 153కు చేరింది. కుప్పలుతెప్పలుగా వెలుగులోకి వస్తున్న కొవిడ్‌ కేసులతో జిల్లాలో మామిడాడ పేరు మోగిపోతోంది.


16 వేల జనాభా ఉన్న ఈ గ్రామం పేరు చెబితేనే కలకలం రేగుతోంది. జిల్లాలో కొవిడ్‌ కేసుల ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్ని కేసులు ఏ ప్రాంతంలోను నమోదవలేదు. కానీ మామిడాడలో మాత్రం కేసులు మోతెక్కిపోతున్నాయి. దీంతో ఇక్కడ జనం బిక్కు బిక్కుమంటున్నారు. ఏరోజు ఎవరికి పాజిటివ్‌గా తేలుతుందనేదానిపై ఆందోళన నెలకొంది. తాజాగా మంగళవారం ఈ గ్రామంలో నమోదైన 27 పాజిటివ్‌ కేసులతో కలిపి మొత్తం కొవిడ్‌ కేసులు మామిడాడలో 56కు చేరుకున్నాయి. దీంతో చిన్న గ్రామంలో కేసుల తీవ్రత పెరుగుతుండడంతో వైద్యులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు కూడా అయిదు రోజులుగా ఇళ్లు దాటికి బయటకు రావడానికే జంకుతున్నారు.


రెడ్‌జోన్‌ కావడంతో ఇంటింటికి కూరగాయల సరఫరా వలంటీర్లతో చేయిస్తున్నారు. అయితే ఇవి అరకొరగానే అందుతున్నాయి. అయితే కొవిడ్‌ భయంతో బయటకు రాలేక ఉన్నవాటితోనే జనం సరిపెట్టుకుంటున్నారు. ఇక బిక్కవోలులో నమోదైన ఒక పాజిటివ్‌ కేసులో ఓ అయిదేళ్ల బాలుడున్నాడు. దీంతో మొత్తం బాధితులను వైద్య ఆరోగ్యశాఖ జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తరలించింది. వైరస్‌ సోకిన వారంతా కొవిడ్‌తో మృతి చెందిన 53 ఏళ్ల వ్యక్తి సెకండరీ కాంటాక్టు వారే కావడం గమనార్హం. సోమవారం నిర్ధారణ అయిన కేసుల్లో ఏడుగురు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండడానికి అధికారులు అనుమతిచ్చారు.


వాటికి అనుమతిచ్చారు...

నాలుగో విడత లాక్‌డౌన్‌ సడలింపులు అనేక రంగాలకు వర్తింప చేసినా వస్త్ర, ఆభరణ దుకాణాలకు మాత్రం ఇవ్వలేదు. అనధికారికంగా కొందరు మాత్రం దుకాణాలు తెరిచి పరిమితంగా లావాదేవీలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వీటన్నింటికి అధికారికంగా అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. వస్త్ర దుకాణాలు, మాల్స్‌లోకి వెళ్లే వినియోగదారులు ముందుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని ప్రభుత్వం షరతు విధించింది. మాల్స్‌లో ట్రైల్‌ రూంలు మూసి వేయాలని సూచించింది. ఆభరణాల దుకాణాల్లో విక్రయాలను గ్లౌజ్‌లు ధరించి చేయాలని పేర్కొంది. ఇక పానీ పూరి దుకాణ బండ్లకు అనుమతి నిరాకరించింది. 



బిక్కవోలులో ఐదేళ్ల బాలుడికి..

బిక్కవోలు: బిక్కవోలులో ఐదేళ్ల బాలుడికి సైతం కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ కేసుతో కరోనా బాధితుల సంఖ్య గ్రామంలో 16కు చేరాయని పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ రాజీవ్‌ తెలిపారు. ఈ బాలుని తల్లిదండ్రులు జీ మామిడాడలో కరోనాతో చనిపోయిన వ్యక్తి బంధువులు ఉంటున్న దేవుడిమాన్యంలోని ఇంటిపక్కన నివాసం ఉంటున్నారు. ఇప్పటికే ఈ బాలుని తల్లి, తండ్రి, నానమ్మలకు కరోనా సోకింది. దీంతో దేవునిమాన్యంలో 11, జువ్వలదొడ్డిలో 2, పంచాయతీ వీధిలో ఇద్దరు కాగా, వీరిలో ఒకరు సచివాలయం-2లో ఉద్యోగి. ఇతను జీ మామిడాడలో నివాసం ఉంటున్నాడు. దాంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక జనం తమ వీధుల్లోకి ఇతరులు రాకుండా పాత టీవీలు, దుంగలు అడ్డుగా పెట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-05-27T15:59:42+05:30 IST