దొరికినంత బాదేయ్‌..

ABN , First Publish Date - 2021-12-07T04:54:29+05:30 IST

జగనన్న గృహ హక్కు పథకంలో అటు అధికారులు ఇటు ఇళ్ల లబ్ధిదారులు నలిగిపోతున్నారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ అంటూ ప్రభుత్వం ఎప్పుడో కట్టిన ఇళ్లకు సొమ్ములు వసూళ్లకు సిద్ధపడింది. రూ. పదివేలు కడితే మీ ఇంటికి రిజిస్ర్టేషన్‌ చేసి ఇస్తామని మీ ఇల్లు మీకే సొంతమంటూ అధికారుల నుంచి వలంటీర్ల వరకు ఊరూ వాడా ఊదర గొడుతున్నారు.

దొరికినంత బాదేయ్‌..

వన్‌టైం సెటిల్‌మెంట్లపై  సర్కారు ఒత్తిళ్లు

ఊరూరుకో టార్గెట్‌.. కడతారా..

చస్తారా అంటూ బెదిరింపులు

వలంటీర్ల నుంచి సచివాలయ సిబ్బంది వరకు పరుగులు

డ్వాక్రా పొదుపు సొమ్ము ‘ఇంటి’ దారి

ముంపు మండలాల్లో వెనక్కే


మన టార్గెట్‌లు పెద్దవి. ఎవరేమనుకున్నా ఎన్ని శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా మనకు అనవసరం.. సర్కారు చెప్పిందే చేయాలి.. ఏదో రూపంలో ఖజానా నింపాల్సిందే.. లేకపోతే మన పని గోవింద’ .. సచివాలయ సిబ్బంది నుంచి సాధారణ సిబ్బంది వరకు అందరి నోటా ఇప్పుడు ఇదే మాట...ఎవరికీ చెప్పుకోలేక.. లబ్ధిదారులను పూర్తిగా ఒప్పించలేక వారంతా నానా తంటాలు పడుతున్నారు..


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) 

జగనన్న గృహ హక్కు పథకంలో అటు అధికారులు ఇటు ఇళ్ల లబ్ధిదారులు నలిగిపోతున్నారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ అంటూ ప్రభుత్వం ఎప్పుడో కట్టిన ఇళ్లకు సొమ్ములు వసూళ్లకు సిద్ధపడింది. రూ. పదివేలు కడితే మీ ఇంటికి రిజిస్ర్టేషన్‌ చేసి ఇస్తామని మీ ఇల్లు మీకే సొంతమంటూ అధికారుల నుంచి వలంటీర్ల వరకు ఊరూ వాడా ఊదర గొడుతున్నారు. ఏదో రూపంలో ఒత్తిడి పెంచైనా సరే వారికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. ఉన్న ఇంటితో పాటు రేషన్‌, పింఛన్‌కు కూడా ఎసరొస్తుందంటూ పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. డ్వాక్రా మహిళలు కూడా దాదాపు ఇంటి‘దారి’ పట్టారు. దీంతో గడిచిన మూడు రోజులుగా ఇంటి వసూళ్లు పెరిగాయి. డబ్బుల్లేవు..సామీ అంటూ గగ్గోలు పెడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.. ఎక్కడ సెటిల్‌ అయితే అక్కడ రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందజేసి సంబరాలు చేసుకుంటున్నారు.  


డ్వాక్రా మహిళలపై ఒత్తిడి

జిల్లా వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో దాదాపు 17 వేల మంది సభ్యులను ఒక దారికి తీసుకు వచ్చే వ్యవహారంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. గ్రూపు రుణాల్లో అప్పటికప్పుడు రూ.పది వేలు చెల్లించి ఇల్లు సొంతం చేసు కోండంటూ చెవిలో ఇల్లు కట్టుకుని ఊదరగొట్టేయడంతో చేసేదిలేక అక్క చెల్లెమ్మలు చాలా చోట్ల కదిలారు. ఉన్న ఇల్లు వదులుకోక కట్టమన్న సొమ్ము కట్టలేక ఇప్పటికే వందల కుటుంబాలు మూలనపడ్డాయి. పైకి చెప్పలేక, ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఓటీఎస్‌ చెల్లింపుకే సిద్ధపడుతు న్నారు. ముఖ్యంగా డెల్టా మండలాల్లో డ్వాక్రా గ్రూపుల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి పట్టాలకు వస్తున్న సొమ్ములు భారీగానే ఉన్నాయి. 


రూ. 10 కోట్ల వరకు వసూళ్లు

సరిగ్గా వారం రోజుల క్రితం ఏకకాల రుణ చెల్లింపు వ్యవహారం చాలా చప్పగా సాగేది. కాని ఒత్తిళ్ల ప్రభావం అందరి మీద పడింది. రేషన్‌, పింఛన్‌ తొలగిస్తామనే బెదిరింపులు పనిచేశాయి. ఎవరికీ చెప్పుకోలేక ఇప్పుడు సర్కారు వారు అడిగిందే తడవుగా డబ్బు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో నాలుగు రెవెన్యూ డివిజన్లలో గుర్తించిన 44 వేల మంది లబ్ధిదారుల నుంచి దాదాపు రూ.43 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటివరకు గుర్తించిన లబ్ధిదారుల్లో అత్యధికంగా గోపాలపురం నియోజకవర్గంలో 4,289 మంది ఉండగా అత్యల్పంగా ఏలూరు నియోజకవర్గంలో 1,460 మంది మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్కరు రోజుకొక లబ్ధిదారుడిని రిజిస్ట్రేషన్‌ దిశగా నడిపించా ల్సిందేనంటూ సర్కారు ఆదేశం మేరకు సిబ్బంది ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఏలూరు డివిజన్‌లో 16,500 మంది, జంగారెడ్డిగూడెంలో రెండు వేలు, కొవ్వూరులో 13 వేలు, నరసా పురంలో 11 వేల మంది లబ్ధిదారులను గుర్తించగా సోమవారం నాటికి దాదాపు 11 వేల మంది ముక్కుపిండి రూ. పది కోట్ల వరకు వసూలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో కాస్త చూసీ చూడనట్టు వెళ్లాలని సర్కారు తాజాగా సూచనలు జారీ చేసింది.కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం వంటి ముంపు మండలాల్లో నిర్వాసితులను ఎక్కడికక్కడ నిర్వాసిత కాలనీలకు తరలిస్తున్నారు. పోలవరం నియోజకవర్గ పరిధిలో 3 వేల 47 మంది లబ్ధిదారులను గుర్తించగా వీరిలో ఇప్పటిదాకా జిల్లాలో అత్యల్పంగా 427 మంది మాత్రమే స్పందించారు. బుట్టాయిగూడెం మండలంలో 691 మందిని గుర్తించగా పదుల సంఖ్యలో కూడా ఎవరూ కట్టలేదు.


ఓటీఎస్‌ లబ్ధిదారులకు తోడ్పాటునివ్వాలి : జేసీ అంబేడ్కర్‌

ఏలూరు, డిసెంబరు (ఆంధ్రజ్యోతి) : వన్‌టైం సెటిల్‌మెంట్‌పై లబ్ధిదా రుల్లో అవగాహన కల్పించి శాశ్వత భూ గృహహక్కు పథకాన్ని సద్విని యోగం చేసుకునేలా చూడాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన అధి కారులతో వీడియో సమీక్ష నిర్వహించారు.అన్యాక్రాంతమైన భూముల జాబితాలను సిద్ధం చేసి అవకాశం వున్న వాటిని క్రమబద్ధీకరిం చేందుకు ప్రతి పాదనలు పంపాలన్నారు. నీటితీరువా వసూలుకు తహసీల్దార్లు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 120 గొడౌన్ల నిర్మాణా లకు ప్రతిపాదించగా, 76 నిర్మాణాలకు స్థలం వివరాలు అందించారన్నారు. మిగిలిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వీసీలో జేసీలు సూరజ్‌ గానోరే, పద్మావతి, డీఆర్వో డేవిడ్‌రాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T04:54:29+05:30 IST