వన్‌సైడ్‌ ట్రేడింగ్‌!

ABN , First Publish Date - 2020-09-19T08:58:22+05:30 IST

‘విశాఖ భూములను వన్‌సైడ్‌గా ఆక్రమించుకుంటున్నారు. వారి కన్నుపడిన భూమి వారికి దక్కాల్సిందే. అధికార బలంతో ఎవరూ నోరెత్తకుండా చేసి వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. మద్యం బ్రాండ్లలో

వన్‌సైడ్‌ ట్రేడింగ్‌!

విశాఖ భూములు, మద్యం బ్రాండ్లలో అక్రమాలు

కనీ వినీ ఎరుగని మార్గాల్లో దోపిడీ

16 నెలల్లో పరాకాష్ఠకు అవినీతి 

వైసీపీ నేతలు కోట్లు గడిస్తున్నారు

దేవుళ్లకు కూడా రక్షణ లేదు చంద్రబాబు ధ్వజం


అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘విశాఖ భూములను వన్‌సైడ్‌గా ఆక్రమించుకుంటున్నారు. వారి కన్నుపడిన భూమి వారికి దక్కాల్సిందే. అధికార బలంతో ఎవరూ నోరెత్తకుండా చేసి వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారు. మద్యం బ్రాండ్లలో కూడా వన్‌సైడ్‌ ట్రేడింగ్‌ నడిపిస్తున్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ నేతలతో  శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వైసీపీ 16 నెలల పాలనలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని.. కనీవినీ ఎరుగని మార్గాల్లో పై నుంచి కింది వరకూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆ పార్టీ నేతలు  రూ.4 వేల కోట్లు దోచుకున్నారు.


దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయండి. మేం నిరూపిస్తాం’ అని సవాల్‌ విసిరారు.  ఆంధ్ర ప్రజలకు ఇసుక దొరక్కుండా చేసి.. రోజూ వందల లారీల్లో తెలంగాణకు అక్రమంగా ఎగుమతి చేసి దండుకుంటున్నారని.. అక్కడి నుంచి మద్యం అక్రమంగా దిగుమతి చేసుకుని ఇక్కడ రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై దాడులు చూస్తుంటే రాష్ట్రంలో రాక్షసుల కాలం వచ్చినట్లు అనిపిస్తోందని, దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. 


పల్నాడులో అరాచకం..

పల్నాడులో అరాచకాన్ని సృష్టించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని కిరాతకంగా హత్యలు చేసి భయానక వాతావరణం ఏర్పరిచారని చంద్రబాబు ఆరోపించారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పధకానికి పేరు మార్చి అంచనా వ్యయం రూ.1,600 కోట్లు పెంచి భారీ దోపిడీకి రంగం సిద్ధం చేశారని, ప్రతి పథకంలో ఆదాయం చూసుకుంటున్నారని ధ్వజమెత్తారు.


ధాన్యం కొనాలంటే కేసులా?

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనాలని ఆందోళన చేసిన రైతులపై ప్రభుత్వం కేసులు మోపిందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరెస్టులు బహుమానంగా ఇస్తోందని చంద్రబాబు విమర్శించారు. ‘అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తే అమరావతి రైతులను అణచివేసే ప్రయత్నం చేశారు. వందల మందిని జైళ్లకు పంపారు. 16 నెలల్లో రైతులపై ఇన్ని కేసులు పెట్టిన ప్రభుత్వం మరొకటి లేదు. వ్యవసాయ పంపుసెట్లకు ఎప్పుడో ఎన్టీఆర్‌ తీసివేసిన మీటర్లను మళ్లీ ఇప్పుడు పెడుతున్నారు. ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టడానికే ఈ పనులు చేస్తున్నారు. వరద ముంపులో నష్టపోయిన రైతులను ఆదుకునే చర్యలు లేవు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. రైతులకు అండగా నిలవాలి’ అని పార్టీ నేతలకు సూచించారు. 

Updated Date - 2020-09-19T08:58:22+05:30 IST