కరోనాను జయించిన 23 ఏళ్ల యువకుడు.. ఏం చెబుతున్నాడంటే..

ABN , First Publish Date - 2020-04-10T20:11:32+05:30 IST

చిత్తూరు జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్‌ సోకిన శ్రీకాళహస్తి యువకుడు గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 18 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉంటూ..

కరోనాను జయించిన 23 ఏళ్ల యువకుడు.. ఏం చెబుతున్నాడంటే..

అతడు కరోనాను జయించాడు


తిరుపతి: చిత్తూరు జిల్లాలో తొలిసారిగా కరోనా పాజిటివ్‌ సోకిన శ్రీకాళహస్తి యువకుడు గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 18 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉంటూ.. ఇమ్యునిటీని పెంచే ఆహారం తీసుకుంటూ.. మానసిక స్థైర్యంతో కరోనా నుంచి బయటపడ్డారు. లండన్‌లో చదువు కుంటున్న ఈ 23ఏళ్ల యువకుడు.. కరోనా నేపథ్యంలో గత నెల 19వ తేదీన శ్రీకాళహస్తికి వచ్చారు.వైరస్‌పట్ల అవగాహనతో ఇంటివద్దే సెల్ఫ్‌ క్వారంటైన్‌ నిబంధనలు పాటించారు. 22వ తేదీన ఏరియా ఆస్పత్రి వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. ఆ వైద్యుల సలహాతో 23వ తేది తిరుపతి స్విమ్స్‌ వైద్యుల వద్దకు వెళ్లిన యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 24న సాయంత్రానికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో జిల్లాలో తొలికేసు నమోదైంది. ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. కాగా, ఈ యువకుడి బాధ్యతాయుత ప్రవర్తనతో కనీసం కుటుంబ సభ్యులకు కూడా వైరస్‌ సోకలేదు.


అతడి తల్లిదండ్రులు, సోదరిని కూడా క్వారంటైన్‌ చేసిన అధికారులు వారికీ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ అని తేలింది. అయినా వారు క్వారంటైన్‌లోనే కొనసాగుతున్నారు. తిరుపతి రుయాస్పత్రిలో చికిత్స తీసుకున్న యువకుడు పూర్తిగా కోలుకోవడంతో నిబంనల ప్రకారం రెండోసారి కూడా నెగెటివ్‌ రిపోర్టు వచ్చాకే గురువారం వైద్యులు అతన్ని డిశ్చార్జి చేశారు. ఇతడికి డిశ్చార్జి ఫైల్‌ అందించి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైద్యులు అభినందించారు. జిల్లాలో నమోదైన తొలి పాజిటివ్‌ కేసు రికవరీ అయి పేషంటు డిశ్చార్జి కావడంతో జిల్లాలోను, ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రాంత ప్రజలూ ఒకింత ఊరట చెందుతున్నారు. శ్రీకాళహస్తి యువకుడికి వైద్యులు మంచి వైద్యం అందించి నెగెటివ్‌ వచ్చేలా చేశారని కలెక్టర్‌ భరత్‌ గుప్తా అభినందించారు. మరో 14 రోజులు స్వీయ నియంత్రణ పాటించాలని ఈ యువకుడికి వైద్యులు సూచించారన్నారు. 


రుయా సేవలతో..

డిశ్చార్జి అయిన తొలి పాజిటివ్‌ యువకుడికి రుయా ఆవరణలోని పాత ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాటు  చేసిన ఐసొలేషన్‌లో 18 రోజుల పాటు వైద్యం అందించారు. ఇక్కడ రోజుకు వైద్యులతో కలిపి రోజుకు 84 మంది వరకు విధుల్లో పాల్గొన్నారు.  ఐసొలేషన్‌ వార్డులో మూడు షిప్టుల్లో 24 మంది వైద్యులు 12 మంది స్టాఫ్‌ నర్సులు, 12 మంది ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 12 మంది సెక్యూరిటీ, ఆరుగురు పెస్ట్‌ కంట్రోలర్లు, ముగ్గురు రేడియోగ్రాఫర్లు, ఒక సూపర్‌వైజింగ్‌ డాక్టర్‌, ఒక సూపరింటెండెంట్‌, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ముగ్గురు ఆర్‌ఎంవోలు.. లాజిస్టిక్‌ నోడల్‌ ఆఫీసర్‌, డేటా అప్‌లోడింగ్‌ నోడల్‌ ఆఫీసర్‌, మ్యాన్‌ పవర్‌ ఆఫీసర్‌ ఒకరు చొప్పున విధులు నిర్వర్తించారు. వీరు కాకుండా నలుగురు పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారు. రుయా ఐసొలేషన్‌లో 9 మంది పాజిటివ్‌ వ్యక్తులు చికిత్స తీసుకుంటుండగా ఒకరు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 8 మంది ఉన్నారు. మరో మూడు రోజుల్లో మరో ఏడుగురు డిశ్చార్జి కానున్నట్టు సమాచారం. 


భయపడకండి: ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన యువకుడు 

‘కరోనా వైరస్‌ వచ్చిందని భయపడకండి. ధైర్యంగా ముందుకొచ్చి వైద్య సేవలు తీసుకుంటే ఆరోగ్యంగా బయటపడొచ్చు. ఐసొలేషన్‌లో వైద్యులు నన్ను బాగా చూసుకున్నారు. మంచి వైద్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచేలా ఆహారం అందించారు. వైద్యులు ఇచ్చిన కౌన్సిలింగ్‌తో నాలో మానసిక ధైర్యం ఏర్పడింది. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నాకేమి కాదు. త్వరగా తగ్గిపోతుందనే ధీమాతో మానసికంగా దృఢంగా ఉన్నా. స్నేహితులు, కుటుంబ సభ్యులూ మద్దతిచ్చారు. ఇప్పుడు నెగెటివ్‌ రిపోర్టు రావడంతో చాలా సంతోషంగా ఉన్నా. అందరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ఇంటి వద్దే ఉండండి. కరోనా లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేసుకోండి. తద్వారా మీ ఆరోగ్యంతో పాటు మీ చుట్టూ ఉన్న వారినీ కాపాడిన వారవుతారు.’ 


తిరుపతి తప్ప అన్ని పాజిటివ్‌ కేసులు చిత్తూరు ఆస్పత్రికే

తిరుపతి తప్ప చిత్తూరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నుంచి ఇకపై వచ్చే కరోనా పాజిటివ్‌ కేసులన్నీ చిత్తూరులోని జిల్లా కోవిడ్‌ -19 ఆసుపత్రికి తరలిస్తామని కలెక్టర్‌ భరత్‌గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలను కోవిడ్‌ ఆసుపత్రిగా ఇదివరకే ప్రకటించగా చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్పు చేసినట్లు వెల్లడించారు.ఇక్కడ ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో 210 పడకలు, ఐసీయూ వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశామని వివరించారు. నగరి ప్రాంతం నుంచి పాజిటివ్‌గా వచ్చిన రెండు కేసులను జిల్లా కోవిడ్‌  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. 


ఇంటింటి సర్వే వేగవంతం చేయండి

జిల్లాలో మూడోసారి ప్రారంభమైన ఇంటింటి సర్వేను 24 గంటల్లోగా వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ నుంచి డివిజనల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవో, మండల తహసీల్దారు, మెడికల్‌ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సర్వే ద్వారా కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా చేపట్టాలని పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల వరకు రెడ్‌ జోన్‌గా ప్రకటించి డ్రోన్‌ సహాయంతో పరిస్థితి సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2020-04-10T20:11:32+05:30 IST