కేరళ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-09T06:22:44+05:30 IST

దుబాయ్ నుంచి 190 మందితో కేరళకు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం

కేరళ విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్

తిరువనంతపురం: దుబాయ్ నుంచి 190 మందితో కేరళకు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం శుక్రవారం కోజికోడ్ విమానాశ్రయం రన్‌వే పైకి దిగుతూ ప్రమాదానికి గురైన సంగతి విధితమే. ఈ ఘటనలో విమానంలో ప్రయాణించిన 18 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు. మరణించిన 18 మందిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ఇక మరణించిన వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం వెల్లడించారు. విమానంలో ప్రయాణించిన ప్యాసెంజర్లందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. మరోపక్క ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ప్రాణాలకు తెగించి కాపాడిన రెస్క్యూ సిబ్బందికి ఆరోగ్యశాఖ మంత్రి శైలజా ధన్యవాదాలు తెలిపారు. 


ప్రాణాలను కాపాడే క్రమంలో రెస్క్యూ సిబ్బంది కరోనా నిబంధనలను పాటించలేదని ఆమె గుర్తుచేశారు. ఆ సమయంలో ఇతరుల ప్రాణాలను కాపాడాలనే హడావిడిలో ప్రొటొకాల్‌ను అనుసరించలేకపోయారని తాము అర్థం చేసుకున్నామన్నారు. అయితే ఇక్కడ అందరి ప్రాధాన్యత ఒకరి ప్రాణాలు కాపాడటమేనని.. రెస్క్యూ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రెస్క్యూ సిబ్బంది తమ గురించి కూడా ఆలోచించుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు అప్రమత్తంగా ఉంటూ ఇతరులను కూడా సురక్షితంగా ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి శైలజా కోరారు. కాగా.. ప్రమాదానికి గురైన విమానం వందే భారత్ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి కేరళకు వచ్చింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్‌ను మే 6వ తేదీన ప్రారంభించింది. 

Updated Date - 2020-08-09T06:22:44+05:30 IST