అందరిలో ఒకరై..

ABN , First Publish Date - 2022-08-20T05:35:25+05:30 IST

అన్నింటా తానై...అహింసా వ్రతం, చరఖా వడకడం, విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణ... ఇలా మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రతి పిలుపునకూ

అందరిలో ఒకరై..

అన్నింటా తానై...అహింసా వ్రతం, చరఖా వడకడం, విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణ... ఇలా మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించి, ఆ కార్యక్రమాన్ని కనకమ్మ విజయవంతం చేశారు. 


పొణకా కనకమ్మ గురించి ఒక్క మాటలో నిర్వచించడం కష్టం. ఆమె ఉత్తమ దేశభక్తురాలు, స్వాతంత్ర్యోద్యమానికి సర్వస్వం అర్పించిన త్యాగశీలి. ఆనాటి నెల్లూరు మండలంలోని యువతులలో రాజకీయ చైతన్యం, విద్యా వికాసం, ఆత్మస్థైర్యం కలిగించిన సంఘసేవిక. గాంధీజీ నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఒక రూపం ఇచ్చిన శిల్పి. నిత్యం కవులు, పండితులు, గాయకులు, కళాకారులతో గోష్టులు, సమావేశాలు నడిపిన విదుషి. సంపదంతా పోయినా పట్టించుకోకుండా ప్రజా ఉద్యమాలను నిర్వహించిన ధీశాలి. ఆమె కోరి కష్టాలకు ఎదురు వెళ్ళేవారు. అందుకే ఆమెకు ‘కష్టశ్రీ’ అని కానీ, ‘శ్రమశ్రీ’ అని కానీ బిరుదు ఎందుకు ఇవ్వకూడదని నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి ఒక సందర్భంలో చమత్కరించారు. ఆమె అందరిలో ఒకరుగా కలిసిపోయేవారు. అన్నింటా తానై నిలిచేవారు.


నెల్లూరు జిల్లా పొట్లపూడిలో 1892లో కనకమ్మ జన్మించారు. మరుపూరి కొండారెడ్డి, కామమ్మ ఆమె తల్లితండ్రులు. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో ఆమెకు వివాహమయింది. వారికి ఒకరే కుమార్తె. అంతులేని సిరిసంపదలు ఉన్న కుటుంబం వారిది. స్వయంకృషితో పెంపొందించుకున్న విద్య తప్ప ఆమెకు ఏ డిగ్రీలు లేవు. అయినా కనకమ్మలో విజ్ఞాన కాంక్ష అధికంగా ఉండేది. అలాగే దేశ సేవ చేయాలని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనీ తపన ఉండేది. అందుకే... తమ పల్లెలో... 1913లో ‘సుజనరంజనీ సమాజం’ స్థాపించారు. దాని ద్వారా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. 


అప్పుడప్పుడే ఆంధ్రోద్యమం తలెత్తింది. గ్రంథాలయోద్యమాన్ని అయ్యంకి వెంకట రమణయ్య ప్రారంభించారు. వెంటనే పొట్లపూడిలో ‘వివేకానంద పుస్తక భాండాగారం’ కనకమ్మ ప్రోత్సాహంతో ఏర్పాటయింది. అందులో నిరంతరం జరిగే సభలకూ, సమావేశాలకూ జాతీయోద్యమ నాయకులు, సాహిత్యవేత్తలు హాజరయ్యేవారు. అలాగే స్వదేశీ వస్తువులు వాడాలన్న బాలగంగాధర తిలక్‌ ఆదేశం మేరకు... చేనేత మగ్గాలపై తయారైన దుస్తులనే వాడాలనే నిర్ణయంతో... ‘స్వదేశీ నేత సంఘం’ పేరిట ఒక ఉత్పత్తి కేంద్రాన్ని తమ గ్రామంలో కనకమ్మ స్థాపించారు. ఇక, ‘సుజనరంజనీ సమాజం’ ద్వారా అనేక సంఘ సేవా కార్యక్రమాలను జాతి, కుల, మతాలకు అతీతంగా ఆమె చేపట్టారు. ప్రధానంగా కలరా లాంటి వ్యాధులు సోకిన వారికి ఆమె, ఆమె అనుయాయులు సేవలు అందించేవారు. 


హోంరూల్‌ ఉద్యమం వచ్చినప్పుడు, దాని ప్రచారానికి ఆ ప్రాంతంలో పోట్లపూడి గ్రామమే వేదికయింది. అంతేకాదు, అహింసా వ్రతం, చరఖా వడకడం, విదేశీ వస్తు, వస్త్ర బహిష్కరణ... ఇలా మహాత్మా గాంధీ ఇచ్చిన ప్రతి పిలుపునకూ స్పందించి, ఆ కార్యక్రమాన్ని కనకమ్మ విజయవంతం చేశారు. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు అతి సన్నగా నూలు వడికి, ఖాదీ దుస్తులు నేయించి, తాము ధరించడమే కాకుండా... గాంధీజీకి కానుకగా పంపేవారు. తన నగలన్నీ అమ్మేసి, పల్లెపాడులో ‘పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమా’న్ని కనకమ్మ స్థాపించారు. దాన్ని గాంధీజీ ప్రారంభించారు. ఆమెకు 1920 నుంచి కాంగ్రె్‌సతో సన్నిహిత సంబంధం ఉంది. మహిళలలో దేశభక్తి ప్రజ్వరిల్లడానికి ఆమె దోహదం చేశారు. కాకినాడ మహిళా వాలంటీర్‌ దళానికి అధ్యక్షత వహించారు. మహిళలందరూ విద్యావంతులు కావాలనీ, రాజకీయ చైతన్యం కలిగి దేశభక్తులు కావాలనీ ఆమె కోరిక. అందుకే నెల్లూరులో ‘కస్తూరిదేవి విద్యాలయా’న్ని నెలకొల్పారు. 1923లో దాన్ని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం ప్రారంభించారు. కాగా, పాఠశాల సొంత భవనాలకు 1929లో గాంధీజీ శంకుస్థాపన చేస్తూ... ‘‘నెల్లూరులో చూడదగ్గది ఏదైనా ఉంటే అది కస్తూరిదేవి విద్యాలయమే. మీరు దానికి సహకరించండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. 


1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా... శాసనోల్లంఘనం చేసినందుకు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. 1932లో సారా దుకాణాల  దగ్గర పికెటింగ్‌ చేసి... ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్నారు. జైల్లోనే ఆమె హిందీ నేర్చుకొని, కొన్ని అనువాదాలు కూడా చేశారు. జైలు శిక్ష కారణంగా ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. జమీన్‌ రైతు ఉద్యమం కారణంగా వందల ఎకరాల ఆస్తిని ఆమె కుటుంబం కోల్పోయింది. ఈలోగా ఆమె కుమార్తె మరణించడ కనకమ్మను మరింత క్రుంగదీసింది. మనశ్శాంతి కోసం అరుణాచలంలోని శ్రీరమణ మహర్షి సన్నిధిలో, మరి కొంతకాలం అన్నారెడ్డిపాలెంలోని శ్రీరామయోగి ఆశ్రమంలో గడిపారు. కనకమ్మ ఆంగ్లంలో బాగా మాట్లాడేవారు. మంచి రచయిత్రి. అప్పటి పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. శ్రీ రమణ మహర్షి గురించి ‘శ్రీరమణ బ్రహ్మాంజలి’ గ్రంథం రాశారు. ‘శ్రీరామయోగి’, ‘గురుదేవుడు’ అనే జీవిత చరిత్రలు రచించారు. అనేక గ్రంథాలను అనువదించారు. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలిసి పద్యకావ్యాలను రాశారు. భగవద్గీతను సుమధురంగా తెనిగించారు. మహిళలు భగవద్గీతను తెలుగులో రాయడం అదే మొదటిసారి. 


మహిళలకు చేతిపనులను నేర్పి, కుటీర పరిశ్రమలు నేర్పించడం కోసం ‘కస్తూరిదేవి పారిశ్రామిక విద్యాలయా’న్ని చరమదశలో  ప్రారంభించారు. బూజుపట్టిన పాత భావాలను, ఆచారాలను తోసిపుచ్చి, అభ్యుదయకరమైన కొత్త రీతులను సాదరంగా ఆహ్వానించేవారు. 1962 మే నెలలో... మద్రాసు నగరంలో జరిగిన ఆంధ్ర మహిళా సభ రజతోత్సవాల సందర్భంగా సన్మానం అందుకున్న ప్రముఖుల్లో కనకమ్మ ముఖ్యులు. రజతఫలకంపై ఆమె ఘనతను చెక్కి ఆనాటి మహారాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ సుబ్బరాయన్‌ చేతులమీదుగా అందజేశారు. నిండు జీవితం గడిపి, ఎందరికో మార్గదర్శకురాలుగా నిలిచిన కనకమ్మ 1963 సెప్టెంబరు 15న కన్నుమూశారు.


(‘స్వతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు’ సంకలనం నుంచి )

Updated Date - 2022-08-20T05:35:25+05:30 IST