అంబానీ, అదానీలను పూజించాలి : బీజేపీ ఎంపీ

ABN , First Publish Date - 2022-02-11T20:34:23+05:30 IST

ప్రభుత్వ విధానాలు ఆదాయ అసమానతలను పెంచుతున్నాయని

అంబానీ, అదానీలను పూజించాలి : బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ : ప్రభుత్వ విధానాలు ఆదాయ అసమానతలను పెంచుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కేజే ఆల్ఫోన్స్ స్పందించారు. ఉద్యోగాలను సృష్టిస్తున్న అంబానీ, ఆదానీ వంటి పారిశ్రామికవేత్తలను పూజించాలన్నారు. వారిని గౌరవించాలని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


పెట్టుబడిదారుల బాకానని తనను ప్రతిపక్షాలు నిందించవచ్చునని అంటూ, ఈ దేశంలో ఉద్యోగాలను సృష్టించేవారిని మనం గౌరవించాలన్నారు. వారి పేర్లను ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి నేను కూడా చెబుతానన్నారు. రిలయన్స్, అంబానీ, అదానీ, వేరొకరు ఎవరైనా సరే, వారిని మనం పూజించాలి, ఎందుకంటే, వారు ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. పెట్టుబడి పెట్టేవారు ఉద్యోగాలను సృష్టిస్తున్నారన్నారు. 


అసమానతలు ప్రపంచవ్యాప్తంగా ఉండటం వాస్తవమని చెప్పారు. ఇద్దరి సంపద పెరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయని, ఎలన్ మస్క్ సంపద 1,016 శాతం పెరిగిందని గుర్తు చేశారు. ఈ విషయం మీకు తెలుసా? అని ప్రతిపక్షాలను నిలదీశారు. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ సంపద 126 శాతం, బెజోస్ సంపద 67 శాతం, బిల్ గేట్స్ సంపద 30 శాతం పెరిగినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అసమానతలు ఉన్నాయనేది వాస్తవమన్నారు. రోజుకు 5 డాలర్ల కన్నా తక్కువ సంపాదిస్తున్నవారు ప్రపంచంలో 300 కోట్ల మంది ఉన్నారన్నారు. 


2022-23 ఆర్థిక సంవత్సరం కోసం నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పని తీరును తాను గమనిస్తున్నానని చెప్పారు. ఎవరికి అమృతం దక్కుతోందో, ఎవరికి విషం అందుతోందో స్పష్టంగా తెలుస్తోందన్నారు. స్నేహితులకు అమృతం, అత్యధిక ప్రజానీకానికి విషం అందుతున్నాయన్నారు. స్నేహితులకు అమృతం సమృద్ధిగా లభిస్తోందన్నారు. ఉద్యోగాల సృష్టికి ఎటువంటి విజన్ లేదన్నారు. ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ కేలండర్‌ను తేవాలన్నారు. నిరుద్యోగ యువత సహనం నశిస్తోందన్నారు. 


Updated Date - 2022-02-11T20:34:23+05:30 IST