మరో‘సారి’!

ABN , First Publish Date - 2022-06-27T06:23:45+05:30 IST

- ఆయన పేరు ప్రియా శాంతమూర్తి. కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన ఈయనకు తితలీ తీరని నష్టానికి గురిచేసింది. 2.70 ఎకరాల్లో దాపు 150 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అప్పట్లో పరిహారం జాబితాలో పేరు ఉన్నా.... రూపాయి దక్కలేదు. తాజాగా అదనపు పరిహారం జాబితాలో సైతం పేరు కనిపించడం లేదు.

మరో‘సారి’!
తిత్లీ తుఫాన్‌కు కవిటి మండలంలో నేలకొరిగిన కొబ్బరిచెట్టు


- తితలీ బాధితులకు మొండిచేయి
- 6,600 మందికి అందని సాయం
- అదనపు పరిహారంలో కూడా అన్యాయం
- జాబితాలో పేర్లు లేని వైనం
(కవిటి)

- ఆయన పేరు ప్రియా శాంతమూర్తి. కవిటి మండలం బెజ్జిపుట్టుగకు చెందిన ఈయనకు తితలీ తీరని నష్టానికి గురిచేసింది. 2.70 ఎకరాల్లో దాపు 150 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. అప్పట్లో పరిహారం జాబితాలో పేరు ఉన్నా.... రూపాయి దక్కలేదు. తాజాగా అదనపు పరిహారం జాబితాలో సైతం పేరు కనిపించడం లేదు. అధికారులను అడుగుతుంటే మౌనమే సమాధానమవుతోంది. ఇది ఒక శాంతమూర్తి పరిస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా 6,600 మంది రైతులకు తితలీ అదనపు పరిహారంలోనూ రిక్తహస్తమే ఎదురైంది. 2018 అక్టోబరు 11న తితలీ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలను అతలాకుతలం చేసింది ఈ విలయం. కొబ్బరి, జీడి, మామిడి, వరి పంటలకు అపార నష్టం కలిగింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టింది. నాటి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఇక్కడే ఉండి సహాయ చర్యలు చేపట్టారు. పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు కొద్దిరోజుల వ్యవధిలోనే బాధిత రైతు ఖాతాల్లో పరిహారాన్ని జమ చేశారు. కొబ్బరి చెట్టుకు రూ.1500 చొప్పున సాయాన్ని అందించారు. జీడి, వరి పంటలకు సైతం పరిహారం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 1,23,000 మంది రైతులకు తితలీ సాయం అందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో పంట నష్టం అంచనాలు రూపొందించడం, జాబితాలను సిద్ధం చేయడంలో కొందరి సిబ్బంది చేసిన తప్పిదాలు బాధిత రైతులకు శాపంగా మారాయి. రకరకాల కారణాలు చూపుతూ దాదాపు 6,600 మందికి పరిహారం దక్కకుండా పోయింది. దీంతో తాము అధికారంలోకి వస్తే  పరిహారం దక్కని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. బాధిత రైతులకు అదనపు పరిహారం అందిస్తామని ప్రకటించింది. మళ్లీ ప్రతి రైతు వద్ద నుంచి భూమి విస్తీర్ణం, నష్టం అంచనాలను క్షేత్రస్థాయిలో సేకరించారు. ఇదంతా గడిచి రెండేళ్లయ్యింది. ఇప్పుడు గత జాబితాలో కోత విధించడంతో పాటు గతంలో పరిహారం దక్కని వారికి మొండిచేయి చూపారు. దీంతో బాధిత రైతుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


జీవో ప్రకారమే..
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారమే తితలీ బాధితులకు అదనపు పరిహారం అందిస్తున్నాం. 90,789 మంది రైతులకు రెట్టింపు పరిహారం మంజూరైంది. 6,600 మందికి సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పారదర్శకంగా అదనపు పరిహారం అందిస్తాం.
            - ఆర్‌.ప్రసాద్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి



Updated Date - 2022-06-27T06:23:45+05:30 IST