కోదండ రామా.... ఈసారైనా మమ్మల్ని రానిస్తావా.....?

ABN , First Publish Date - 2021-04-14T05:51:57+05:30 IST

ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణానికి గత ఏడాదిలాగానే ఈసారి కూడా కరోనా షాక్‌ తగులుతోంది.

కోదండ రామా.... ఈసారైనా మమ్మల్ని రానిస్తావా.....?
ముస్తాబవుతున్న కళ్యాణ వేదిక

 కోదండరాముని కల్యాణానికి కరోనా షాక్‌

 లక్ష మంది వీక్షించే అవకాశమున్నా 5 వేల మందికే అనుమతినిచ్చే అవకాశం

 సాధ్యాసాధ్యాలపై అధికార యంత్రాంగం కసరత్తు

 26న జరిగే కల్యాణంపై వీడని సందిగ్ధం... మొదలైన ఏర్పాట్లు 


రాజంపేట, ఏప్రిల్‌ 13 : ఆంధ్రా భద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణానికి గత ఏడాదిలాగానే ఈసారి కూడా కరోనా షాక్‌ తగులుతోంది. రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కోదండరాముని కల్యాణాన్ని ప్రత్యక్షంగా లక్షలాది మంది భక్తులు వీక్షించే అవకాశం లేకుండాపోతోంది. ఏకంగా లక్ష మంది వీక్షించే కల్యాణానికి కరోనా మూలంగా భౌతికదూరం పాటిస్తూ 5 వేల మందికి అవకాశం కల్పించే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి ఈనెల 9వ తేదీ ఇచ్చిన ప్రకటనపై సందిగ్ధత కొనసాగుతోంది. లక్ష మంది వీక్షించే కల్యాణానికి 5 వేల మంది భక్తులకు మాత్రమే ఏ ప్రాతిపదికన అనుమతులిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. 


26న జరిగే కల్యాణంపై సర్వత్రా ఆసక్తి 

ఈనెల 26వ తేదీ రాత్రి కల్యాణం జరగనుంది. ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో ప్రధానమైన ఘట్టం కల్యాణోత్సవం. ఈ కల్యాణోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక తెలంగాణా నుంచి కూడా భక్తులు హాజరవుతారు. నిండు చంద్రుని పున్నమి వెన్నెలలో ఆరుబయట కోదండరాముని కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాష్ట్రం విడిపోయిన తరువాత ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని ఆంధ్రాభద్రాద్రిగా మార్చేశారు. అప్పటి వరకు ఆలయం లోపల జరిగే ఈ కల్యాణోత్సవం ప్రత్యేక కల్యాణ వేదిక ఏర్పాటు చేసిన అల్లంతదూరంలో లక్షలాది మంది భక్తుల ఎదుట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018వ సంవత్సరంలో జరిగిన కల్యాణంలో పెద్ద అపశృతి చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులు, వర్షం రావడంతో నలుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద కల్యాణ మండప నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2019వ సంవత్సరంలో తిరిగి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. 2020 సంవత్సరంలో కల్యాణానికి ముందు 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడా లేని విధంగా కలశ ఆకారంలో జర్మనీ టెక్నాలజీతో కల్యాణ మండపానికి శ్రీకారం చుట్టి పూర్తి చేశారు. అయితే ఇంకా అనేక పనులు జరగాల్సి ఉంది. కరోనా మూలంగా పూర్తైన కల్యాణ మండపంలో గత ఏడాది కల్యాణం జరగలేదు. ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగానే కల్యాణోత్సవాన్ని ముగించారు. ఈ ఏడాది కన్నులవిందుగా కల్యాణాన్ని నిర్వహించాలనుకుంటున్న టీటీడీకి, రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి కరోనా దెబ్బ ఎదురవుతోంది. కరోనా తీవ్రత రోజురోజుకు నాలుగింతలు రెట్టింపు కావడంతో కల్యాణం ఎలా జరుపుతారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కల్యాణోత్సవానికి కేవలం 5 వేల మందికి మాత్రమే పాసులు మంజూరు చేస్తామని ప్రకటించారు. లక్ష మంది పైబడి వీక్షించే కల్యాణానికి 5 వేల మందికి మాత్రమే అనుమతి ఎలా ఇస్తారని అటు టీటీడీలోనూ ఇటు జిల్లా అధికారయంత్రాంగంలోనూ కసరత్తు మొదలైంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం 5 వేల మందికి మాత్రమే అనుమతులిస్తే టీటీడీ తీవ్ర విమర్శలకు గురయ్యే అవకాశముంది. ఈ స్థితిలో టీటీడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు కల్యాణాన్ని ఆరుబయట నిర్వహిస్తారా... లేక ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారా లేక టీటీడీ ఈవో ప్రకటించిన ప్రకారం 5 వేల మందికి మాత్రమే పాసులిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 


ముమ్మరంగా ఏర్పాట్లు

కల్యాణోత్సవంపై కరోనా సందిగ్ధత కొనసాగుతున్న సమయంలో టీటీడీ గత కల్యాణోత్సవాలకు చేసిన భారీ ఏర్పాట్లు కాకపోయినా కొంతలో కొంత మేరకైనా ఏర్పాట్లు చేయాలన్న ఉద్దేశ్యంతో కొన్ని పనులకు సిద్ధమైంది. ఇందులో కల్యాణ మండపాన్ని పూర్తిగా పరిశుభ్రం చేశారు. చుట్టుపక్కల కంపచెట్లను తొలగించి కల్యాణానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం క్యూలైన్ల ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ కౌంటర్లు, దేవతామూర్తుల కటౌట్లు, విద్యుత్‌ దీపాలంకరణ, చలువపందిళ్ల ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు.


కల్యాణోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు

- హర్షవర్ధన్‌రెడ్డి, డీఈ, టీటీడీ 

కల్యాణోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నాము. కల్యాణ మండపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈనెల 26న జరిగే కల్యాణానికి చేయాల్సిన అన్ని ఏర్పాట్లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తి చేస్తున్నాము.




Updated Date - 2021-04-14T05:51:57+05:30 IST