కొవిడ్‌ ఆస్పత్రిలో కలకలం.. విషయం తెలిసి ఉలిక్కిపడ్డ ఆస్పత్రి ఉద్యోగులు..!

ABN , First Publish Date - 2020-05-30T17:56:34+05:30 IST

విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో మరో మహిళా ప్రొఫెసర్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు తెలిసింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్‌ రోగులకు వైద్యసేవలందిస్తున్న ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం.

కొవిడ్‌ ఆస్పత్రిలో కలకలం.. విషయం తెలిసి ఉలిక్కిపడ్డ ఆస్పత్రి ఉద్యోగులు..!

మరో మహిళా ప్రొఫెసర్‌కు కరోనా..!

ధ్రువీకరించని వైద్యాధికారులు 

పాజిటివ్‌ కేసుల సమాచారమూ నిల్‌ 


(విజయవాడ, ఆంధ్రజ్యోతి): విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిలో మరో మహిళా ప్రొఫెసర్‌కు కరోనా వైరస్‌ సోకినట్లు తెలిసింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్‌ రోగులకు వైద్యసేవలందిస్తున్న ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వైద్యాధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. ఇంతకుముందు ఇదే ఆసుపత్రిలో సేవలందిస్తున్న మరో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు జూనియర్‌ డాక్టర్లు, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు ఇటీవలే మళ్లీ విధులకు హాజరయ్యారు. తాజాగా మరో మహిళా ప్రొఫెసరు కరోనా బారినపడినట్లు తెలియడంతో ఆసుపత్రి ఉద్యోగులు మరోసారి ఉలిక్కిపడ్డారు.


ఇదిలా ఉండగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలో 11,638 మందికి సంబంధించిన నమూనాలను పరీక్షించగా.. వారిలో 33 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఆ బులెటిన్‌లో జిల్లాలవారీగా సమాచారం ఇవ్వకపోవడంతో కృష్ణాజిల్లాకు చెందిన కేసులు ఉన్నాయా? లేదా? అనేది తెలియడం లేదు. జిల్లా అధికారులు కూడా కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగినా మౌనమే సమాధానమవుతోంది. ఇదే పద్ధతిని కొనసాగిస్తే ప్రజలను కరోనా పట్ల అప్రమత్తం చేసే అవకాశం ఉండదని, దీనివల్ల వైరస్‌ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని తెలిసి కూడా అధికారులు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-05-30T17:56:34+05:30 IST