ఓటరు సవరణకు నెల గడువు

ABN , First Publish Date - 2021-10-29T05:26:41+05:30 IST

ఓటరు నమోదుకు ఫామ్‌ 6 ద్వారా కానీ, ఆన్‌లైన్‌ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు సూచించారు.

ఓటరు సవరణకు నెల గడువు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

- తప్పొప్పులు, మార్పులు, చేర్పులకు  అవకాశం

- వచ్చే నెల నుంచి బూత్‌ల వారీగా ముసాయిదా జాబితా

- 2022 జనవరి 5న కొత్త ఓటరు జాబితా

- ఓటరు జాబితా సవరణపై అఖిలపక్ష ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 28 : ఓటరు నమోదుకు ఫామ్‌ 6 ద్వారా కానీ, ఆన్‌లైన్‌ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు సూచించారు. ఓటరు జాబితా సవరణపై గురువారం కలెక్టర్‌ రెవెన్యూ సమావేశ మందిరంలో అఖిల పక్ష పార్టీల నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తొలగింపులు, మార్పులు, చేర్పులు చేసి తుది ఓటరు జాబితాను జనవరి, 5-2022న ప్రచురిస్తామని పేర్కొన్నారు. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు తొలగింపు, మార్పులు, చేర్పులపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించి 2022 సంవంత్సరానికి తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నవంబరు 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని, ఆ జాబితాను పోలింగ్‌ కేంద్రాల వారీగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు ఉన్నా, ఫొటో లేకపోయినా, ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించిన అభ్యంతరాలపై నవంబరు 30 వరకు దరఖాస్తులను స్వీకరించి సరి చేయాలని చెప్పారు. అనంతరం 2022 జనవరి 5న తుది ఓటరు జాబితాను ప్రచురించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అదనపు పోలింగ్‌ స్టేషన్లు లేదా పోలింగ్‌ కేంద్రాల మార్పు ఉన్నచోటా రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించి సూచనలు తీసుకొని మార్పులను చేయాలని చెప్పారు. ఓటరు జాబితా ప్రత్యేక  సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన నిమిత్తం స్వీప్‌ కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు గాను కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలని, కళాజాత బృందాలని ఏర్పాటు చేసి ఓటరు జాబితాపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నుంచి అంజయ్య, టీఆర్‌ఎస్‌ నుంచి రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, ఐఎన్‌సీ నుంచి సాయిబాబా, బీఎస్పీ నుంచి ఆది లక్ష్మయ్య, ఎంఐఎం నుంచి సాదతుల్ల మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితాను ప్రతుల రూపంలోనే ఇవ్వాలని, ఒక వేళ ఓటరు మరో చిరునామాకు మారినట్లైతే అక్కడ ఓటువేసే ఇవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, తహసీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలి : కలెక్టర్‌


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), అక్టోబరు 28 : మునిసిపా లిటీ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పార్కులను అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని టీడీగుట్ట, నల్‌బౌళి ప్రాంతా ల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ వేసుకోలేని వారిని వ్యాక్సిన్‌ వేసుకునేలా చైతన్యవంతులను చేశారు. అదేవిధంగా ఆయన ఇల్లిల్లు తిరుగుతున్న క్రమంలో ఆ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఖాళీ ప్రదేశాల్లో పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్లను పలకరించి వ్యాక్సి న్‌ వేసుకున్నారా.. లేదా అని అడిగారు. 100శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా. శశికాంత్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌, కౌన్సిలర్‌ మునీరుద్దీన్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-10-29T05:26:41+05:30 IST