రాళ్లవాగులో ఒకరు గల్లంతు

ABN , First Publish Date - 2020-11-27T08:06:17+05:30 IST

రేణిగుంట మండలం రాళ్ళవాగులో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు గల్లంతు కాగా మరో ఇద్దరిని పోలీసు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.

రాళ్లవాగులో ఒకరు గల్లంతు
కాపాడినవారికి ధైర్యం చెబుతున్న చెవిరెడ్డి

ఇద్దరిని రక్షించిన పోలీసులు, వలంటీర్లు


రేణిగుంట,నవంబరు 26: రేణిగుంట మండలం రాళ్ళవాగులో చిక్కుకుపోయిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు గల్లంతు కాగా మరో ఇద్దరిని పోలీసు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శేషాచలం కొండలు, అడవుల నుంచీ వర్షపు నీరు వచ్చి చేరడంతో రేణిగుంట మండలం మల్లిమడుగు రిజర్వాయర్‌ గురువారం తెల్లవారుఝామున నిండిపోయింది. అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. రిజర్వాయరు నుంచీ విడుదలయ్యే నీరు ప్రవహించే రాళ్ళవాగులో అమర్చిన మోటర్‌ తెచ్చుకునేందుకు మండలంలోని ఆర్‌.మల్లవరం పంచాయతీ కుమ్మరపల్లెకు చెందిన ప్రసాద్‌ (34) గ్రామానికే చెందిన లోకేష్‌ (22), వెంకటేష్‌ (20)లతో కలసి గురువారం ఉదయం వెళ్ళి నీటిలో చిక్కుకుపోయారు. నీటి ఉధృతిలో ప్రసాద్‌ గల్లంతు కాగా మిగిలిన ఇద్దరూ ఉదయం 9 గంటల నుంచీ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాగులోని చెట్ల కొమ్మలు పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారమందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో చిత్తూరు నుంచీ స్పీడు బోటు తెప్పించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారిద్దరినీ కాపాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు లైఫ్‌జాకెట్‌ ధరించి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.బోటులో వెళ్లి చెట్టుకొమ్మలను పట్టుకుని ఉన్న ఇద్దరు రైతులను బయటకు తీసుకొచ్చారు. వారికి మంచినీళ్లు తాగించి ధైర్యం చెప్పారు. గల్లంతైన ప్రసాద్‌ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గాలిస్తున్నాయి.  మరో ఘటనలో చంద్రగిరి మండలం మొండికాల్వ ప్రాంతంలో బంధువులకు భోజనం క్యారియర్‌ ఇచ్చేందుకు వెళ్ళిన రాయలపురం గ్రామానికి చెందిన అభిరామ్‌ అనే యువకుడు దోసుల వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అక్కడ కాపలా వున్న వలంటీర్లు అతన్ని గుర్తించి కాపాడి ఒడ్డుకు చేర్చారు.

Updated Date - 2020-11-27T08:06:17+05:30 IST