ఒక్కడి కోసం..

ABN , First Publish Date - 2022-05-25T06:18:12+05:30 IST

ఒక్కడి కోసం..

ఒక్కడి కోసం..

రూ.10 కోట్ల పనులు మింగేసే పన్నాగాలు

కృష్ణాజిల్లాలో ఓ ఎమ్మెల్యే అనుచరుడికి కట్టబెట్టే ప్రయత్నాలు

‘పులిగడ్డ’కు టెండర్లను ఆహ్వానించని అధికారులు

కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు కాల్స్‌

టెండరు నుంచి తప్పుకుంటే ప్యాకేజీల ఆఫర్‌

జలవనరుల శాఖలో అవినీతి అక్రమాలు


లక్ష, రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 కోట్ల పైచిలుకు పనులు ఒకే కాంట్రాక్టరుకు ఏకపక్షంగా కట్టబెట్టడానికి జలవనరుల శాఖలో రంగం సిద్ధమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడైన ఓ కాంట్రాక్టరుకు 35 పనులను  అప్పజెప్పేందుకు అధికారులే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా కాంట్రాక్టర్లు టెండర్లు వేయకుండా తెరవెనుక నుంచి ఫోన్‌కాల్స్‌ వెళ్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : జూన్‌ నుంచి వ్యవసాయ పనులు ప్రారంభమవుతుండటంతో ఉమ్మడి జిల్లాలో కాల్వలు, లాకుల మరమ్మతులు, పూడికతీత, తూటుకాడ తొలగింపు, కరకట్టలు కొట్టుకుపోతున్న చోట్ల రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. కడ (కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ) సమావేశంలో ప్రతిపాదించిన 67 పనులకు అధికారులు ఆమోదం తెలిపారు. జలవనరుల శాఖలో డివిజన్లవారీగా మంజూరైన ఈ పనులకు టెండర్లను పిలవాలని నిర్ణయించారు. కేసీ (కృష్ణా సెంట్రల్‌) డివిజన్‌లో ఉన్న పులిగడ్డ సబ్‌ డివిజన్‌లో పనులకు మాత్రం ఎలాంటి టెండర్లు పిలవకుండా ప్యాకేజీ రూపం ఇచ్చి ఒకే కాంట్రాక్టరుకు కట్టబెట్టడానికి అధికారులు అన్ని వ్యూహాలు సిద్ధం చేశారు. ఈ పనుల విలువ అక్షరాలా రూ.10 కోట్ల 24 లక్షల 58 వేలు. కేసీ డివిజన్‌లో బందరు, పులిగడ్డ, హెడ్‌క్వార్టర్‌, ఆర్‌సీ (రివర్‌ కన్జర్వేషన్‌) సబ్‌ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 67 పనుల్లో 35 పనులు ఒక్క పులిగడ్డ సబ్‌ డివిజన్‌లోనే ఉన్నాయి. బందరు, హెడ్‌క్వార్టర్‌ సబ్‌ డివిజన్లకు సంబంధించిన పనులకు ఈనెల 23 నుంచి ఆన్‌లైన్‌లో టెండర్లను పిలిచారు. వాస్తవానికి మిగిలిన సబ్‌ డివిజన్లలోని పనులకు అదే తేదీ నుంచి టెండర్లను పిలవాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు.

ప్యాకేజీ వెనుక మర్మమేంటి?

కడ సమావేశంలో ప్రతిపాదించిన పనుల్లో ఒక్కో దానికి విడివిడిగా అంచనాలు రూపొందించారు. దాని ప్రకారమే ఆమోదం తెలిపారు. ఆమోదం వచ్చే వరకు కిమ్మనకుండా ఉన్న కేసీ డివిజన్‌ అధికారులు టెండర్ల సమయం వచ్చే సరికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేశారు. బందరు, హెడ్‌క్వార్టర్‌ సబ్‌ డివిజన్‌లోని పనులకు విడివిడిగా టెండర్లు ఆహ్వానించిన అధికారులు పులిగడ్డ సబ్‌ డివిజన్‌కు వచ్చే సరికి ప్లేటు ఫిరాయించారు. ఈ సబ్‌ డివిజన్‌లో మొత్తం 35 పనుల విలువ రూ.10 కోట్ల 24 లక్షల 58 వేలు కావడంతో ప్యాకేజీ ప్రతిపాదనను తీసుకొచ్చారు. వాస్తవానికి ఒక్కో పనికి విడివిడిగా టెండర్లు దాఖలు కావాలి. కానీ, కృష్ణాజిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కోసం కేసీ డివిజన్‌ అధికారులు ప్యాకేజీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. విడివిడిగా ఉన్న 35 పనులను కలిపి, ఒకే ప్యాకేజీ కిందకు తెచ్చి ఆ కాంట్రాక్టరుకు మేలు చేయాలని నిర్ణయించారు. దీని వెనుక భారీస్థాయిలో చక్రం తిప్పారు. 

టెండర్లు దాఖలు చేయకుండా కాంట్రాక్టర్లకు ప్యాకేజీ

ఈనెల 30తో టెండర్ల దాఖలుకు గడువు ముగుస్తుంది. ఈ పనులకు ఎందుకు టెండర్లను ఆహ్వానించడం లేదని పలువురు కాంట్రాక్టర్లు కేసీ డివిజన్‌ అధికారులను ప్రశ్నించారు. అప్పుడు వారికి వచ్చిన సమాధానం ప్యాకేజీ. మిగిలిన కాంట్రాక్టర్లు ఎలాంటి టెండర్లు దాఖలు చేయకుండా మొత్తం పనులన్నింటినీ ఒకే కాంట్రాక్టర్‌ చేతిలో పెట్టడానికి కేసీ డివిజన్‌ అధికారులు ప్యాకేజీ ప్రణాళికను అమలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో రహస్య మంతనాలు జోరుగానే సాగాయని తెలుస్తోంది. తమకు నచ్చిన కాంట్రాక్టర్ల కోసం అధికారులు ప్యాకేజీలను తయారు చేస్తుంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అనుచరులు మాత్రం కాంట్రాక్టర్లకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో పనులకు ఎలాంటి టెండర్లు దాఖలు చేయొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు మాత్రం వారి ఫోన్లను లిఫ్ట్‌ చేయడం లేదు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే.. 

ఈ బాగోతంపై కేసీ డివిజన్‌లోని ఓ అధికారిని వివరణ కోరగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ప్యాకేజీ నిర్ణయించామన్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయా.. అని ప్రశ్నించగా, మంగళవారం నుంచి పులిగడ్డ సబ్‌ డివిజన్‌లోని పనులకూ టెండర్లను పిలుస్తున్నామని వివరణ ఇచ్చారు. 



Updated Date - 2022-05-25T06:18:12+05:30 IST