దేశంలో ఇంకే స్కాములూ జరగలేదా?: తేజస్వీ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-21T21:22:52+05:30 IST

ఒకవేళ లాలూ ప్రసాద్ కనుక బీజేపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటే ఆయనకు రాజా హరిశ్చంద్ర బిరుదు లభించేది. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై పోరాడుతున్నారు కాబట్టే జైలుకు వెళ్లాల్సి వస్తోంది. అయినా మేం ఇలాంటి వాటికి భయపడబోం. దేశంలో దాణా స్కాము కాకుండా మరే స్కామూ జరగలేదా? బిహార్‌లో 80 స్కాములు వెలుగు చూశాయి...

దేశంలో ఇంకే స్కాములూ జరగలేదా?: తేజస్వీ ఆగ్రహం

పాట్నా: దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి జైలు శిక్ష పడటంపై కుమారుడు, బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దాణ స్కాము కాకుండా మరే స్కామూ లేదా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీపై పోరాటం చేస్తున్న కారణంగానే లాలూ జైలుకు వెళ్లాల్సి వస్తోందని, ఒకవేళ కమల పార్టీకి అనుకూలంగా ఉండుంటే రాజా హరిశ్చంద్ర బిరుదు లభించేదని అన్నారు. సోమవారం లాలూకి రాంచీ సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన అనంతరం తేజస్వీ మీడియాతో మాట్లాడారు.


‘‘ఒకవేళ లాలూ ప్రసాద్ కనుక బీజేపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటే ఆయనకు రాజా హరిశ్చంద్ర బిరుదు లభించేది. బీజేపీ-ఆర్ఎస్ఎస్‌పై పోరాడుతున్నారు కాబట్టే జైలుకు వెళ్లాల్సి వస్తోంది. అయినా మేం ఇలాంటి వాటికి భయపడబోం. దేశంలో దాణా స్కాము కాకుండా మరే స్కామూ జరగలేదా? బిహార్‌లో 80 స్కాములు వెలుగు చూశాయి. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ ఎక్కడ ఉన్నాయి? దేశంలో ఒక్కటే స్కాం, ఒక్కరే లీడర్ ఉన్నట్లు ఉంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ లాంటి వారిని సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని తేజస్వీ అన్నారు.


ఇక రాంచీ సీబీఐ కోర్టు తీర్పుపై తేజస్వీ స్పందిస్తూ ‘‘కోర్టు తీర్పుపై నేను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయను. ఎందుకంటే ఇది చివరి తీర్పు కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉన్నాయి. మేము ఈ కేసుపై అక్కడికి వెళ్తాం. కింది స్థాయి కోర్టులో వచ్చిన తీర్పుకు భిన్నంగా హైకోర్టు తీర్పునిస్తుందనే నమ్మకం మాకుంది’’ అని అన్నారు. దాణా స్కామ్‌లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. దాణా కుంభకోణం ఐదో కేసులోనూ లాలూ దోషిగా తేలినట్లు కోర్టు ఇటీవలే ప్రకటించింది. లాలూ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 950కోట్ల రూపాయల విలువైన దాణా స్కామ్ జరిగింది. ఇదే కుంభకోణంలోని మిగతా కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలడంతో లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.

Updated Date - 2022-02-21T21:22:52+05:30 IST