సౌర టెండర్లలో..లక్ష కోట్ల స్కాం!

ABN , First Publish Date - 2021-06-19T08:17:45+05:30 IST

సౌర విద్యుత్‌ టెండర్లలో రూ.లక్ష కోట్ల కుంభకోణానికి జగన్‌ ప్రభుత్వం పథక రచన చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ టెండర్లను హైకోర్టు కొట్టివేయడంతో ఈ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందని..

సౌర టెండర్లలో..లక్ష కోట్ల స్కాం!

హైకోర్టు తీర్పుతో భారీ కుంభకోణానికి అడ్డుకట్ట

రేట్లు పెంచుకునే అధికారం అధికారుల కమిటీకా?

దీనిని అడ్డుపెట్టుకుని ఇంకా సొమ్ము గుంజే కుట్ర

షిర్డీ సాయి ఎలక్ర్టికల్స్‌ సంస్థ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డికి బినామీ

25 ఏళ్ల ఒప్పందాలను నాడు జగన్‌ అసెంబ్లీలో విమర్శించారు

ఇప్పుడు 30 ఏళ్లకు ఎలా పెంచారు?.. పట్టాభిరాం ఫైర్‌


అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్‌ టెండర్లలో రూ.లక్ష కోట్ల కుంభకోణానికి జగన్‌ ప్రభుత్వం పథక రచన చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ టెండర్లను హైకోర్టు కొట్టివేయడంతో ఈ కుంభకోణానికి అడ్డుకట్ట పడిందని.. తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం శుక్రవారమిక్కడ విలేకరులతో అన్నారు. పాత నిబంధనలు మొత్తం మార్చివేసి.. తమకు కావలసినప్పుడు టెండర్‌ రేటు పెంచుకోవడానికి.. టెండర్‌ పొందిన కంపెనీల యాజమాన్యాలను మార్చుకునేందుకు వెసులుబాట్లు కల్పించారని, దీని కోసం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, చట్టాలను కూడా లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ‘30 ఏళ్ల పాటు సౌర విద్యుత్‌ కంపెనీల నుంచి కరెంటు కొనుగోలుకు అనుమతిస్తూ జీవోలు ఇచ్చారు. ఆరు వేల మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినా మరో 50 శాతం సామర్థ్యంతో అదనపు యూనిట్లు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. అంటే సుమారు పది వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు భారం రాష్ట్రంపై పడనుంది. ఈ విద్యుత్‌ కొనుగోలు కోసం రాష్ట్రం ఏటా కనీసం రూ.4 వేల కోట్లు చెల్లించాలి. 30 ఏళ్లకు రూ.లక్షా ఇరవై వేల కోట్ల ప్రజా ధనం చెల్లించాలి. మిగిలిన రాష్ట్రాల్లో టెండర్లలో సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.1.90కి పడిపోయింది. ఇక్కడ మాత్రం 60 నుంచి 70 పైసలు అదనంగా చెల్లించేలా టెండర్లు ఖరారు చేయడానికి పథకం రచించారు. 


ఈ ధరను కూడా ఇంకా పెంచి ప్రజా ధనాన్ని అడ్డుగోలుగా దోపిడీ చేయడానికి ఈ టెండర్లలో పెద్ద కుట్ర జరిగింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో ఏ మార్పుచేర్పులు చేయాలన్నా అది విద్యుత్‌ నియంత్రణ మండలి (రెగ్యులేటరీ కమిషన్‌) మాత్రమే చేయాలి. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం దీనిని స్పష్టంగా నిర్దేశిస్తోంది. కానీ ఈ టెండర్లలో ఆ నిబంధనను ఎత్తివేశారు. ఆ అధికారాన్ని రెగ్యులేటరీ కమిషన్‌ నుంచి తొలగించి అధికారుల కమిటీకి అప్పగించారు. ఒక ఐఏఎస్‌ అధికారి, ఒక చీఫ్‌ ఇంజనీర్‌, ఒక ఎస్‌ఈ, కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఉండే కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందట! తమకు కావలసిన అధికారులను ఈ కమిటీలో పెట్టుకుని.. టెండర్ల తర్వాత నాలుగు రోజులు ఆగి ఈ రేట్లను మరింత పెంచుకునే కుట్ర ఇందులో దాగి ఉంది. 30 ఏళ్లలో  రూ. లక్ష కోట్ల కుంభకోణానికి ఈ ప్రక్రియ ఆస్కారం కల్పిస్తోంది’ అని పట్టాభి దుయ్యబట్టారు. ఉత్పత్తి ప్రారంభించిన మూడేళ్ల తర్వాత మాత్రమే టెండర్‌ పొందిన కంపెనీల యాజమాన్యం మారడానికి పాత నిబంధనలు అవకాశం కల్పిస్తున్నాయని.. తాజా టెండర్లలో ఆ సమయాన్ని ఏడాదికే కుదించారని ఆక్షేపించారు. ఇప్పుడు ఎవరో ఒక బినామీతో టెండర్‌ వేయించి.. ఏడాది తర్వాత దానిని హస్తగతం చేసుకోవడానికే ఈ వెసులుబాటు పెట్టుకున్నారని ఆరోపించారు.


అర్హత లేని కంపెనీకి..

సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఏ అనుభవం లేని కడప జిల్లాకు చెందిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ అనే కంపెనీ టెండర్లలో పాల్గొని వేల మెగావాట్ల మేర ఉత్పత్తి చేయడానికి విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపికైందని.. ఈ కంపెనీ కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి బినామీ అని పట్టాభి చెప్పారు. టెండర్లు పిలిచిన కంపెనీకి ఆ అర్హత లేకపోవడం మరో విచిత్రమన్నారు. ‘టెండర్లు పిలిచిన సంస్థకు నిబంధనల ప్రకారం ట్రేడింగ్‌ లైసెన్స్‌, డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ ఉండాలి. కానీ ఈ టెండర్లను పిలిచిన గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ఏ లైసెన్సూ లేదు. అప్పటికప్పుడు ఊరకే ఒక కార్పొరేషన్‌ పెట్టి దాని పేరుతో టెండర్లు పిలిచారు. నిబంధనలను ఎంత ఘోరంగా తుంగలో తొక్కారో ఇదే ఉదాహరణ’ అని విమర్శించారు. గత ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ తయారీ కంపెనీలతో పాతికేళ్లపాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే అది మహాపరాధంగా జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని.. ఆయన మాత్రం ఏకంగా ఆ వ్యవధిని 30 ఏళ్లకు పెంచేశారని అన్నారు. రాష్ట్రానికి అసలు సౌర, పవన విద్యుత్‌ అవసరమే లేదని, ఇప్పుడున్న థర్మల్‌, జల విద్యుత్‌ సరిపోతుందని కూడా ఆయన ఉపన్యాసాలు చెప్పారని, మరి ఇప్పుడు ఏకంగా పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి  టెండర్లు ఎలా పిలిచారని నిలదీశారు. హైకోర్టు ఈ టెండర్లను కొట్టివేసిన తర్వాత ప్రభుత్వ పెద్దలు ఎవరూ బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదని, తేలు కుట్టిన దొంగల మాదిరిగా మౌనంగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Updated Date - 2021-06-19T08:17:45+05:30 IST