ఐదేళ్ల పాటు ఉచితంగా కిలో నెయ్యి: అఖిలేష్

ABN , First Publish Date - 2022-02-15T21:58:20+05:30 IST

యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం..

ఐదేళ్ల పాటు ఉచితంగా కిలో నెయ్యి: అఖిలేష్

రాయబరేలి: యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం సొంత ఉచిత రేషన్ స్కీమ్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్‌తో పాటు నెలనెలా కిలో నెయ్యి ఉచితంగా పంపిణీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తాజాగా హామీ ఇచ్చారు. రాయబరేలిలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలయ్యేంత వరకే పేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కొనసాగిస్తారని, ఆ తర్వాత దాన్ని ఎత్తేస్తారని చెప్పారు. గతంలో నవంబర్ వరకూ రేషన్ ఇస్తామని చెప్పి, యూపీ ఎన్నికలు ప్రకటించడంతో మార్చి వరకూ పొడిగిస్తున్నట్టు చెప్పారని అన్నారు. ఎన్నికలు మార్చితో అయిపోతున్నందున ఢిల్లీ బడ్జెట్‌లో కూడా ఉచిత రేషన్‌కు నిధులు కేటాయించలేదని తెలిపారు.


''గతంలో సమాజ్‌వాదీ ప్రభుత్వం రేషన్ ఇచ్చింది. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ పేదలకు రేషన్ ఇచ్చి తీరుతాం. దానితో పాటు కిలో ఆవనూనె, ఏడాదికి రెండు సిలెండర్లు, కిలో నెయ్యి ఇస్తాం'' అని అఖిలేష్ యాదవ్ ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉండటమే కాకుండా, ఉప్పులో గ్లాసు ముక్కల్లాంటివి కనిపిస్తున్నాయని అన్నారు. యూపీలో 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, యువతకు ఉద్యోగవకాశాలు కల్పించడం ద్వారా వీటిని భర్తీ చేస్తామని అఖిలేష్ భరోసా ఇచ్చారు. గ్రామాల్లో తిరుగూతూ కరపత్రాలు పంచిన బీజేపీ నేతలు ఆ తర్వాత ప్రచారం మానేశారని, ప్రజలు ఖాళీ సిలెండర్లు చూపిస్తుండటంతో ఇంటింటి ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారని అన్నారు.


యూపీలో శాంతిభద్రతల పరిస్థితి కుప్పకూలిందని, బీజేపీ హయాంలో అత్యధికంగా కస్టడీ మరణాలు సంభించాయని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో అవినీతి కూడా రెట్టింపు అయిందని ఆయన ఆరోపించారు. రాయబరేలి నియోజకవర్గం ప్రజలు సమాజ్‌వాదీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అఖిలేష్ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-02-15T21:58:20+05:30 IST