ప్రతి వందలో ఒకరు!

ABN , First Publish Date - 2020-08-12T08:49:35+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వందమంది కరోనా బాధితుల్లో ఒక ఆంధ్రుడు ఉన్నాడు. దేశీయంగా ప్రతి వంద కేసుల్లో పదిమంది ఆంధ్రులే. కరోనా వ్యాప్తిలో మన రాష్ట్రం ఘనత ఇదీ.

ప్రతి వందలో ఒకరు!

  • ప్రపంచ కరోనా కేసుల్లో ఏపీ ఘనత
  • దేశంలో ప్రతి 100మందిలో 10మంది 
  • అన్ని దేశాల్లో కలిపి 2.03కోట్ల కేసులు 
  • రాష్ట్రంలో 2.44లక్షలకు పైగా నమోదు 
  • జిల్లాలన్నీ డేంజర్‌జోన్‌గా మారే ప్రమాదం 
  • వైరస్‌ ఉధృతిపై వైద్యవర్గాల్లో ఆందోళన 

(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వందమంది కరోనా బాధితుల్లో ఒక ఆంధ్రుడు ఉన్నాడు. దేశీయంగా ప్రతి వంద కేసుల్లో పదిమంది ఆంధ్రులే. కరోనా వ్యాప్తిలో మన రాష్ట్రం ఘనత ఇదీ. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఏపీ కన్నా అత్యధిక కేసులు మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఉన్నప్పటికీ యాక్టివ్‌ కేసుల్లో రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కట్టుదిట్టంగా వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టడంతో ఇతర రాష్ట్రాల్లో కేసులు తగ్గడంతో పాటు డిశ్చార్జిలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రోజుకు సగటున 8వేల మంది డిశ్చార్జి అవుతున్నా నిత్యం దాదాపు 10వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య సగటున 90 పైమాటే. దీంతో రాష్ట్రంలో కరోనా ఉధృతి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.


అంతర్జాతీయంగానూ రాష్ట్రం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రపంచంలో మొత్తం కరోనా కేసులు 2.03కోట్లు ఉండగా అందులో ఒకశాతం (2లక్షలు) మార్కును ఏపీ ఇప్పటికే దాటేసింది. ఈ లెక్కన ప్రపంచంలో ప్రతి వందమంది బాధితుల్లో ఒకరు ఆంధ్రుడు ఉంటున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 22.87లక్షలు. రాష్ట్రంలో 2.44లక్షల కేసులున్నాయి. దీనిప్రకారం దేశంలో ప్రతి వంద కేసుల్లో 10 ఏపీలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇదో సరికొత్త పరిణామమని, ఆందోళనకరమైనదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ‘‘కరోనా కేసుల్లో సంఖ్యాపరంగా మహారాష్ట్ర, తమిళనాడు మొదటి రెండుస్థానాల్లో ఉన్నా యాక్టివ్‌ కేసులు తగ్గించడంలో అవి మెరుగైన ఫలితాలు కనబరుస్తున్నాయి. ఏపీలో మొదట్లో మూడు నెలల పాటు కేసుల పెరుగుదల నిదానంగా ఉన్నా, గతనెల నుంచి వేగం పుంజుకుంది.


ఇది అత్యంత ఆందోళనకరం. రాష్ట్రంలో కరోనా కట్టడి ఎక్కడో కట్టుతప్పింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో రాజధానితో పాటు కొన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో ప్రతి జిల్లాల్లోనూ వైరస్‌ ఉధృతంగా ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. కరోనా చాపకింద నీరులా కాదు... ప్రత్యక్షంగా కళ్లకు కనిపించేలా వ్యాప్తి చెందుతోందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలను దాటేసి తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉంది. చాలావేగం, దూకుడుతో కూడిన కార్యాచరణ లేకుంటే ప్రతీ జిల్లా డేంజర్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో తమిళనాడును కూడా దాటేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యాక్టివ్‌ కేసుల్లో ఏపీ దేశంలో రెండోస్థానంలో నిలిచింది. ఇది ప్రమాద సంకేతం. ఇప్పటికైనా కరోనాను కట్టుదిట్టంగా కట్టడి చేయకపోతే పరిస్థితులు మరింత చేయిదాటిపోతాయి’’ అని ప్రముఖ శ్వాసకోశ నిపుణుడు డాక్టర్‌ వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - 2020-08-12T08:49:35+05:30 IST