తిరుప్పూరులో విషాదం

ABN , First Publish Date - 2022-05-24T14:32:45+05:30 IST

ఒకే రోజు రెండు జిల్లాల్లో జరిగిన హత్యా ఘటనలు స్థానికులను ఆందోళన కలిగించాయి. తిరుప్పూరు సమీపం సేడర్‌పాళయంలో ఓ ఇంటిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన

తిరుప్పూరులో విషాదం

- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య 

- అరియలూరు జిల్లాలో విద్యార్థి దారుణహత్య

 

చెన్నై: ఒకే రోజు రెండు జిల్లాల్లో జరిగిన హత్యా ఘటనలు స్థానికులను ఆందోళన కలిగించాయి. తిరుప్పూరు సమీపం సేడర్‌పాళయంలో ఓ ఇంటిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హత్య చేసి పారిపోయిన హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తిరువారూరు జిల్లాకు చెందిన ముత్తుమారి (38) అనే మహిళ ధరణీష్‌ (9), నితీష్‌ (6) అనే ఇద్దరు కుమారులతో పదిహేను రోజుల క్రితం సేడర్‌పాళయంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆ ఇంటి నుంచి కేకలు వినిపించడంతో చుట్టుపక్కలవారు పరుగెత్తుకెళ్ళారు. ఆ సమయంలో ఇంటి నుంచి కత్తిని పట్టుకుని ఓ వ్యక్తి పారిపోతుండటం గమనించారు. ఆ తర్వాత వారు ఇంటిలోనికి వెళ్ళి చూడగా ముత్తుమారి, ఇద్దరు కుమారులు వంటినిండా కత్తిపోట్లతో శవాలుగా పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో తిరుమురుగన్‌పూండి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పదిహేను రోజుల క్రితం ఆ ఇంటిని అద్దెకు తీసుకునేందుకు ముత్తుమారి, ఆమె పిల్లలను వెంటబెట్టుకుని 45 యేళ్ళ వ్యక్తి వచ్చాడని, అతడే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 


ప్లస్‌-1 విద్యార్థి హత్య

అరియలూరు జిల్లా పొర్‌పదిత్త నల్లూరుగ్రామానికి చెందిన ప్లస్‌-1 విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అరియలూరు ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌లో ఉంటూ ప్లస్‌-1 చదువుతున్న విద్యార్థి మణికంఠన్‌ (16) శని, ఆదివారాలు సెలవులు కావటంతో పెర్‌పదిత్త నల్లూరులోని బామ్మ ఇంటికి  వెళ్ళాడు. ఆదివారం రాత్రి ఆ ఇంటికి సమీపంలోని ఇంటిలో చదువుకునేందుకు వెళ్ళాడు. రాత్రి అక్కడే నిద్రపోయాడు. సోమవారం ఉదయం అతడు ప్లస్‌-1 చివరి పరీక్ష రాయాల్సి వుంది. ఈ పరిస్థితుల్లో ఎంతసేపటికీ మణికంఠన్‌  రాకపోవడంతో బామ్మ అక్కడికి వెళ్ళి చూసింది. ఆ ఇంటి గదిలో తలకు బలమైన గాయాలతో శవంగా పడి వున్న మణికంఠన్‌ను చూసి దిగ్ర్భాంతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు మణికంఠన్‌ను రాళ్ళతో కొట్టి  హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.



Updated Date - 2022-05-24T14:32:45+05:30 IST