లక్షా 80వేలు దాటేశాయ్‌!

ABN , First Publish Date - 2021-05-16T06:36:25+05:30 IST

జిల్లాలో పాజిటివ్‌ కేసులు అడ్డుఅదుపు లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఏమాత్రం కట్టడి లేకుండా కమ్మేస్తున్నాయి ఒకపక్క కర్ఫ్యూ అమల్లో ఉన్నా పాజిటివ్‌ల కల్లోలం కొనసాగుతోంది.

లక్షా 80వేలు దాటేశాయ్‌!

కొనసాగుతున్న కేసుల కల్లోలం

మహమ్మారి కట్టడికి తలపట్టుకుంటున్న వైద్య, ఆరోగ్య శాఖ

 మరో మూడు రోజుల్లో ముగియనున్న పగటి కర్ఫ్యూ

 మళ్లీ పొడిగిస్తారా? లేదా తొలగిస్తారా? అనేదానిపై సందిగ్ధం

శనివారం జిల్లావ్యాప్తంగా 3,833 పాజిటివ్‌ల నిర్ధారణ

 అత్యధిక కేసులతో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు విలవిల

జిల్లాకు 29వేల కొవాగ్జిన్‌ టీకాలు రాక

మంగళవారం సెకండ్‌ డోసు కింద పంపిణీ

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పాజిటివ్‌ కేసులు అడ్డుఅదుపు లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఏమాత్రం కట్టడి లేకుండా కమ్మేస్తున్నాయి ఒకపక్క కర్ఫ్యూ అమల్లో ఉన్నా పాజిటివ్‌ల కల్లోలం కొనసాగుతోంది. దీంతో మహమ్మారి కట్టడికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తలపట్టుకుంటోంది. ఏంచేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలైతే వందలాది కేసులతో అల్లాడుతున్నాయి. నిత్యం నమోదవుతున్న మూడు వేలకుపైగా కేసుల్లో 1,200 వరకు ఇక్కడే నిర్ధారణ అవుతున్నాయి. దీంతో ఇక్కడ పాజిటివ్‌ల కట్టడి అధికారులకు సవాల్‌గా మారింది. వాస్తవానికి ఈ రెండు నగరాల్లో కొవిడ్‌ టెస్టుల కోసం జనం నిత్యం భారీ సంఖ్యలో బారులు తీరుతు న్నారు. కాగా శనివారం జిల్లావ్యాప్తంగా 3,383 పాజిటివ్‌లు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,80,186కు చేరింది. అటు మొత్తం కేసుల్లో రాష్ట్రం మొత్తంమీద ఒక్క తూర్పు గోదావరిలోనే అధికంగా ఉండడంతో వైరస్‌ కట్టడి అధికారులకు తలకుమించిన భారంగా మారింది. మరోపక్క రోజువారీగా వస్తున్న పాజిటివ్‌ల్లో రాష్ట్రంలో జిల్లా తొలిస్థానంలో ఉండడం సవాల్‌గా మారింది. ఇతర జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా ఇక్కడ మాత్రం కట్టడి లేకుం డా పరుగులు తీస్తూనే ఉన్నాయి. దీంతో అధికారుల వైఫల్యంపై వైద్య, ఆరోగ్య శాఖలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నవారిపై పర్యవేక్షణ లేక వారిలో చాలా మంది యథేచ్చగా బయట తిరిగేస్తున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం మెడికల్‌ ఆఫీసర్లు అంతర్గంతంగా నిర్వహించిన సమీక్షలో చర్చనీయాంశమైంది. అటు టెస్టుల విషయంలో కూడా అనేక వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. పరీక్ష కోసం వెళ్తే వివరాల నమోదుకు సంబంధించి సర్వర్లు పని చేయకపోవడంతో టెస్టుల్లో వేగం తగ్గింది. దీంతో అనేక మంది నిత్యం పరీక్షా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల కూడా పాజిటివ్‌లు పెరుగున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటిపై పూర్తిస్థాయి పర్యవేక్షణ పెరిగితే కేసులను కొంతవరకు నియంత్రించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన పగటి కర్ఫ్యూ మరో మూడు రోజుల్లో ముగియనుంది. తిరిగి పొడిగిస్తారా? లేదా ఇతరత్రా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా? అని జనం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో పాజిటివ్‌ల పడగ నేపథ్యంలో నియంత్రణకు అధికారులు ఏ సిఫార్సులు చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఎట్టకేలకు జిల్లాకు 29వేల కొవాగ్జిన్‌ టీకాలు చేరాయి. వీటిని మంగళవారం సెకండ్‌ డోస్‌ కింద పంపిణీ చేయనున్నారు. జిల్లాలో సెకండ్‌ డోస్‌ కొవాగ్జిన్‌ కోసం వేలాది మంది ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎంపిక చేసిన శాశ్వత వ్యాక్సిన్‌ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేయనున్నారు.


Updated Date - 2021-05-16T06:36:25+05:30 IST