ఒక్కచాన్స్‌ ప్లీజ్‌!

ABN , First Publish Date - 2022-05-25T05:15:11+05:30 IST

ఎన్నికల వేడి మొదలైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో

ఒక్కచాన్స్‌ ప్లీజ్‌!

  • టిక్కెట్ల కోసం నేతల అగచాట్లు
  • ఒక్కసారి అవకాశం కల్పించాలంటున్న ఆశావహులు
  • మరోసారి అవకాశం ఇవ్వాలంటున్న సిట్టింగ్‌లు
  • ఎమ్మెల్సీలు సైతం పోటీకి ఆసక్తి
  • నేతల వారసులదీ అదే మాట


ఎన్నికల వేడి మొదలైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీట్లకోసం పోటీ ఎక్కువైంది. ఈ పోటీ అధికార పార్టీలోనే కాదు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే, ఈసారి చాలామంది సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం రాదన్న వార్తలతో వారు టికెట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధిష్టానాన్ని బతిమిలాడుకునే పనిలో పడ్డారు.


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, మే 24) : రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికల వేడి మొదలు కావడంతో ఆశావహులు ఇప్పటి నుంచే టిక్కెట్ల కోసం వేట మొదలు పెట్టారు. ప్రధాన రాజకీయపార్టీల నుంచి పలువురు పోటీకి సన్నద్ధమవుతున్నారు. అయితే టిక్కెట్ల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ నేతలకు ముందస్తుగా హామీలు ఇవ్వడం లేదు. సిట్టింగ్‌ల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. సర్వేల్లో ప్రజాభిప్రాయం మేరకు సీట్లు కేటాయిస్తామని అధికార టీఆర్‌ఎ్‌సతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు కూడా చెబుతున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలు నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ  ప్రశాంత్‌కిషోర్‌ టీమ్‌తో సర్వేలు మొదలు పెట్టింది. మరోవైపు ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచి కూడా సమాచారం సేకరిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై రోజువారీ నివేదికలు కూడా తెప్పించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా అదే దారిలో ఉంది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా సర్వేల ఆధారంగానే సీట్లు కేటాయిస్తామని, ఎంత సీనియర్లైనా ప్రజల్లో లేకుంటే టిక్కెట్ల ఇచ్చేది లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక బీజేపీ నాయకత్వం కూడా ప్రజామోదం ఎక్కువగా ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తామని చెబుతోంది. దీంతో టిక్కెట్టు ఆశిస్తున్న ఆయా పార్టీల నేతల్లో టెన్షన్‌ మొదలైంది. తమకు ఒక్కసారి చాన్స్‌ ఇవ్వాలని అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్సీలు సైతం ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతుండడం గమనార్హం. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, మాజీమంత్రి మహేందర్‌రెడ్డి తన కోరికను ఇప్పటికే అధిష్టానం వద్ద వ్యక్త పరిచారు. మరో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు సైతం ఇదే ఆశతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్నిచోట్ల కూడా అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ తరపున విజయం సాధించిన సబితారెడ్డి, తాండూరు నుంచి కాంగ్రెస్‌ తరుపున గెలుపొందిన రోహిత్‌రెడ్డిలు ఆ తరువాత టీఆర్‌ఎ్‌సలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అన్ని స్థానాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇపుడు ఇందులో పనితీరు బాగాలేని కొందరిని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం పక్కన పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకత్వం ఇప్పటికే సిట్టింగ్‌లకు సంకేతాలు పంపింది. ప్రజల్లో మంచి పేరున్న వారికే మరోసారి అవకాశం కల్పిస్తామని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని సాగనంపుతామని అంతర్గత సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. టీఆర్‌ఎ్‌సలో నేతలకు కొదవలేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా టిక్కెట్‌ రేస్‌లో ముగ్గురు నలుగురున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వీరంతా ఏదో ఒక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నియోజకవర్గాల్లో చురుకుగా ఉంటున్నారు. దీంతో సిట్టింగ్‌ల్లో కలవరం మొదలైంది.


పర్యటనల్లో ఎమ్మెల్యేలు బిజీబిజీ

ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో రోజువారీ పర్యటనలు చేస్తున్నారు. కొందరైతే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గ్రామాల్లో నిత్యం పర్యటిస్తున్నారు. టిక్కెట్‌ విషయంలో ఆందోళనతో ఉన్న సిట్టింగ్‌లు కొందరు ముఖ్యనేతలను కలిసినప్పుడు మరోసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. నగర శివార్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈసారి టిక్కెట్‌ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన ఆయన మరొక్కసారి అవకాశం ఇవ్వండి.. తరువాత మళ్లీ టిక్కెట్‌ అడగనని ముఖ్యనేతలను కోరుతున్నట్లు సమాచారం. ఆయనే కాదు చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఇదే ఆందోళనతో ఉన్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలామందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో వారి స్థానాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. దీంతో పలుచోట్ల ద్వితీయశ్రేణి నేతలు, ఇప్పటివరకు పోటీ చేసేందుకు అవకాశం దక్కని నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. అధినాయకత్వం దృష్టిలో పడేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. తమకు ఒక్కసారి అవకాశం కల్పించాలని ముఖ్యనేతలను కోరుతున్నారు. ఇందుకోసం సీనియర్‌ నేతలతో పైరవీలు కూడా చేయించుకుంటున్నారు. కాంగ్రెస్‌, బీజేపీల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. అనేకచోట్ల ఇద్దరు, ముగ్గురు టిక్కెట్‌ రేస్‌లో ఉన్నారు. ఒక్కసారి తమకు అవకాశం కల్పించాలని అగ్రనేతలను కలిసి విన్నవించుకుంటున్నారు. ఇటీవల కాలంలో నగర శివార్లలో పుంజుకున్న బీజేపీలో టిక్కెట్ల కోసం పోటీ పెరుగుతోంది. ముఖ్యంగా మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లిలో పలువురు టిక్కెట్లు ఆశిస్తున్నారు. ఈ మూడు స్థానాల్లో టిక్కెట్ల కేటాయింపు పార్టీ నాయకత్వానికి సవాల్‌గా మారింది. ముఖ్యంగా మహేశ్వరంలో టిక్కెట్‌ కోసం పలువురు నేతలు గట్టిగా పోటీపడుతున్నారు. ఇటీవల అమిత్‌షా పర్యటనలో కూడా రూ. లక్షలు ఖర్చుచేసి పోటీపడి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. 


వారసులు సైతం..

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు ముఖ్యనేతల వారసులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో గతంలో అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి చెందిన వారు కూడా ఉన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి తనయుడు మహేందర్‌రెడ్డి. అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌రెడ్డి (బంటి), షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పెద్దకుమారుడు రవీందర్‌యాదవ్‌, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి కుమారుడు రోహిత్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి,  శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కుమారుడు రవికుమార్‌ యాదవ్‌, జడ్పీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ అన్న కుమారుడు వీరేష్‌ తదితరులు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరంతా తమకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.  ఈ మేరకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు కొందరు సీనియర్‌ నేతలు తమకు టిక్కెట్‌ ఇవ్వకుంటే తమ పిల్లలకైనా ఇవ్వాలని కోరుతున్నారు. వారసులతో తమ నియోజకవర్గాల్లో జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.



Updated Date - 2022-05-25T05:15:11+05:30 IST